కాంగ్రెస్, టీడీపీ అవకాశవాదాన్ని వీడాలి: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇకనైనా అవకాశవాదాన్ని విడనాడాలని సీపీఎం శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపారో తిరిగి అదే పార్టీ వాళ్లు సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడపడం విడ్డూరమని పేర్కొన్నారు.
పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్ నేతలు, తెలంగాణకు కట్టుబడి ఉంటామని లేఖ ఇచ్చిన టీడీపీ నాయకులే ఇప్పుడు సీమాంధ్రలో ప్రజల్ని రెచ్చగొట్టడం అన్యాయమని సోమవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఏదైనా పార్టీకి ఒకే విధానం, ఒకే జెండా ఉంటాయని, కాంగ్రెస్, టీడీపీలు మాత్రం విభిన్నంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.
ప్రజల్ని గందరగోళం చేయడం మానాలని హితవు పలికారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి వ్యవహరించాలని కోరారు. అవకాశ ఉద్యమాలకు పాల్పడవద్దని, ఇప్పటికే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. వైషమ్యాలు పెంచే వైఖర్ని విడనాడి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సత్‌సంబంధాల కోసం కృషి చేయాలని సలహా ఇచ్చారు.