ప్రజా సమస్యలు పట్టించుకునే నాధుడేడి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అనిశ్చితితో పరిపాలన పూర్తిగా స్తంభించి పోయిందని, ప్రజా సమస్యల్ని పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని సీపీఎం శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సచివాలయానికి తాళాలు వేయడం ఒక్కటే మిగిలి ఉందని, ఏ శాఖా కార్యాలయంలోనూ పనలు సాగడం లేదని వాపోయారు. ఆరోగ్య శ్రీ లబ్ధిదారులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నా, కాలువలు, చెరువులకు గండ్లు పడ్డా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు వారివారి స్వార్థం చూసుకుంటున్నాయే తప్ప ప్రజల్ని పట్టించుకోవడం లేదని తెలిపారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే సచివాలయానికి రాక పోతే ఇంకెవరు వస్తారని ప్రశ్నించారు.