ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ :
ముఖ్యమంత్రి, మంత్రులు ఒకరిపైనొకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? లేదా..? అనే అనుమానం కలుగుతోందని సీపీఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి అవకాశవాద రాజకీయాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. మంగళవారం పట్టణంలోని సీపీఎం కార్యాలయం ఎదుట కామ్రెడ్ బాసెట్టి మాధవరావు స్మారక కేంద్రం, సీఐటీయూ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కార్మిక నాయకుడిగా, పేదల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడిన మాధవరావు వ్యక్తి కాదు శక్తి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అన్ని రంగాల కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న సీఐటీయూ నాయకులు మాధవరావును ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని, అందువల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్య తలెత్తిందని చెప్పారు. సీడబ్ల్యూసీ తెలంగాణపై నిర్ణయం తీసుకొని 60 రోజులు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో ఉద్యమాలు ఉధృతం అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణ సమస్య పరిష్కరించాలని అన్నారు. మాధవరావు సేవలను ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గోడం నగేష్, డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, ఆల్‌ఇండియా రైతు సంఘం ఉపాధ్యక్షుడు సారంపెల్లి మల్లారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు, సీపీఎం రాష్ట్ర నాయకుడు లంక రాఘవులు, జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముంజం శ్రీనివాస్, డి.మల్లేశ్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాయల శంకర్, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు అశోక్, మాధవరావు సతీమణి కమలబాయి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..?
Published Wed, Oct 2 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement