సాగర్ విద్యుత్ మాకే!
-
700 మెగావాట్ల విద్యుత్ పూర్తిగా వినియోగం
-
సీలేరులో వాటా ఇవ్వనందుకే ఈ నిర్ణయమన్న టీ సర్కార్
సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య పవర్ వార్ కొనసాగుతూనే ఉంది. సీలేరు కేంద్రం నుంచి విద్యుత్ వాటా ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరాకరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కూడా అదే రీతిలో స్పందిం చింది. నాగార్జునసాగర్ రూపంలో ఆ రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. సాగర్ నుంచి ఉత్పత్తి చేస్తున్న 700 మెగావాట్ల విద్యుత్ మొత్తాన్ని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకే టీజెన్‌కో సరఫరా చేస్తోంది. 725 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సీలేరు కాంప్లెక్స్ నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను ఏపీ సర్కారే పూర్తిగా వాడుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇందులో తెలంగాణకు రావాల్సిన వాటా ఇవ్వాలని దక్షిణ ప్రాంత విద్యుత్ నిర్వహణ మండలి(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) ఆదేశించినప్పటికీ ఏపీ పాటించడం లేదనీ, అందుకే నాగార్జునసాగర్ నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను తాము ఏపీకి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. తెలంగాణలో ప్రస్తుతం జూరాల, శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జునసాగర్ కేంద్రాల్లో మొత్తం కలిపి 27 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీంతో సరఫరా పరిస్థితి కొంచెం మెరుగైందని ఇంధన శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ‘సీలేరు నుంచి మాకు విద్యుత్ రావడం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా సాగర్ విద్యుత్‌ను పూర్తిగా మేమే వాడుకుంటున్నాం. పీపీఏల రద్దు వద్దంటున్నప్పటికీ ఏపీ వైఖరి వల్ల మేం ఈ విధంగా వ్యవహరించక తప్పడం లేదు’ అని ఆ వర్గాలు తెలిపాయి.