ల్యాండ్.. మీ 'దయా'! | Disturbances in the development of the land | Sakshi
Sakshi News home page

ల్యాండ్.. మీ 'దయా'!

Published Sun, Nov 2 2014 3:02 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM

ల్యాండ్.. మీ 'దయా'! - Sakshi

ల్యాండ్.. మీ 'దయా'!

* అభివృద్ధికి భూమి ఆటంకాలు
* శ్రద్ధ చూపనంటున్న రెవెన్యూ సిబ్బంది
* నిధులు మంజూరైనా సాగని నిర్మాణాలు
* చీమకుర్తి నగర పంచాయతీకి తీరని కష్టాలు

చీమకుర్తి: దేవుడు కరుణించినా.. పూజారి జాలి చూపలేదట. నగర పంచాయతీ స్థాయి పెంచేందుకు.. కీర్తి పంచేందుకు ఎన్నో నిర్మాణాలు కావాలి. అందుకే వాటి కోసం ప్రభుత్వం నిధుల మంజూరుకు అనుమతించింది. కానీ అధికారులు మోకాళ్లడ్డుతారే! నిర్మాణాలకు అవసరమైన స్థలాలు కేటాయించరే! ఇలాంటి పరిస్థితుల్లో చీమకుర్తి నగర పంచాయతీ కొట్టుమిట్టాడుతోంది. ప్రజలకు అవసరమైన పనులకు దిక్కులేకుండా పోతోంది. రెండేళ్ల క్రితమే చీమకుర్తి నగర పంచాయతీగా ఆవిర్భవించింది. ప్రజలంతా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. కానీ అప్పటి నుంచి కష్టాలు పెరిగాయే కానీ ఫలితం మాత్రం శూన్యం.
 
మున్సిపల్ భవనం సమకూరేనా?

మొదటి నుంచి నాటి పంచాయతీ భవనంలోనే మున్సిపాలిటీ కూడా కొనసాగుతోంది. సొంత బిల్డింగ్ కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ. 50 లక్షలు మంజూరు చేసింది. అయితే స్థల సమస్య కొలిక్కి రాలేదు. పంచాయతీ భవనం ఆనుకొని ఉన్న తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోనే 88 సెంట్ల స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించారు. తహశీల్దార్ ద్వారా ఆర్డీఓ నుంచి కలెక్టర్‌కు ప్రతిపాదనల ఫైలు పంపించారు. అయితే ఇక్కడే చిక్కు వచ్చి పడింది. సాంకేతిక కారణాల వల్ల ఫైలును రెవెన్యూ అధికారులు తిరిగి వెనక్కు తీసుకున్నారు. ఇదంతా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. అప్పటి దాకా కాంగ్రెస్‌ను తిట్టిపోసిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం సాధించలేకపోయింది.
 
రవాణాశాఖ మంత్రి ఏరియా!
చీమకుర్తికి చెందిన శిద్దా రాఘవరావు ప్రస్తుతం రాష్ర్ట రవాణాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కొంతమంది టీడీపీ నాయకులే అభివృద్ధిపై శ్రద్ధ చూపించడంలేదని అధికారులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతం తాలూకూ పాలనపై విమర్శలు గుప్పించడమే కానీ తక్షణ కర్తవ్యం గుర్తించడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరైనప్పటికీ.. సకాలంలో వాటిని వినియోగించకుంటే తిరిగి వెనక్కు వెళ్లే ప్రమాదం నెలకొంది.
 
 గారెలున్నాయ్.. బూరెలున్నాయ్
 పాయసం..పులిహోరా నోరూరిస్తోంది
 కానీ ఏం లాభం తింటే రోగం..
 రుచికరమైన వంటకాలను
 అలా చూస్తూ ఉండాల్సిందే!
 సరిగ్గా.. ఇలాగే!
 చీమకుర్తి మున్సిపాలిటీ పరిస్థితి ఉంది
 ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన గెలాక్సీ గ్రానైట్
 దీని ద్వారా కోట్ల రూపాయల రాయల్టీ
 వేలాది మంది పౌరులు.. ఇలా ఈ పట్టణం
 అయ్యింది మున్సిపాలిటీ!
 వివిధ అభివృద్ధి పనులకు
 డబ్బులు మంజూరయ్యాయి
 ఇక తిరుగులేదనుకుంటుంటే..
 వాటి నిర్మాణాలకు భూములు కేటాయించరు..
 మున్సిపల్ భవనం.. డంపింగ్ యార్డు..
 ఎస్‌ఎస్ ట్యాంకు.. ఇలాంటి ప్రతిపాదనలన్నీ
 జనంకల్లి ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాయి...
 

చెత్త పోసే దిక్కులేదు
చీమకుర్తి పట్టణంగా మారిన తర్వాత నివాస గృహాలు పెరిగిపోయాయి. దుకాణ సముదాయాలు, తోపుడు బండ్ల వ్యాపారులు కూడా ఎక్కువయ్యారు. దీనికితోడు గ్రానైట్ వ్యర్థాలు ఎలాగూ ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో రోజూ  క్వింటాల కొద్దీ చెత్త ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీనంతటినీ తరలించాలంటే డంపింగ్ యార్డు కావాలి. కానీ చీమకుర్తికి ఇలాంటి సౌకర్యం లేకపోవడంతో చెత్తంతా పాటిమీదపాలెం పోయేదారిలోనున్న రెండు ఎకరాల్లో రోడ్డుకు సమీపంలోనే వేస్తున్నారు.

ఆ చోటు కూడా సరిపోకపోవడ ంతో చెత్తంతా రోడ్డుమీదకు వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. సమస్య పరిష్కారం కోసం పాటిమీదపాలెం సమీపంలో 10 ఎకరాలు డంపింగ్ యార్డు కోసం పరిశీలించినట్లు మున్సిపాలిటీ అధికారులు గత శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేకు తెలియ జేశారు. ఇదిలా ఉంటే సమస్యను తహశీల్దార్ దృష్టికి తీసుకుపోయి డంపింగ్‌కు అవసరమైన స్థలాన్ని గుర్తించటంలో మున్సిపాలిటీ అధికారులు  ఏడాదిగా కుస్తీలు పడుతూనే ఉన్నారు.
 
 
దాహార్తి తీర్చేందుకూ ముందుకు రారు
కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా చీమకుర్తి మున్సిపాలిటీకి తాగునీరు అందించేందుకు దాదాపు రూ. 52 కోట్లతో ప్రతిపాదనలను పంపించారు. రామతీర్థం రిజర్వాయర్‌లోని తాగునీటిని చీమకుర్తి పరిసరాల్లోకి తీసుకొచ్చి స్టోర్ చేస్తే ప్రజల దాహార్తి తీరుతుంది. దీనికోసం కావాల్సింది కేవలం ఒక్క ఎకరా మాత్రమే! కానీ ఈ విషయంలోనూ రెవె న్యూ అధికారులు మున్సిపాలిటీవారికి సహకరించక పోవడంతో మహత్తర పథకానికి మంగళం పాడినట్లయింది.
 
మహిళా స్వశక్తి భవన్‌కు నిధులొచ్చినా..
మహిళా స్వశక్తి భవన్ నిర్మించేందుకు మున్సిపాలిటీకి ఏడాది క్రితం రూ. 25 లక్షలు మంజూరయ్యాయి. అలాగే కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్ పేరుతో రెండు భవనాలకు మొత్తం రూ. 22 లక్షలు కూడా మంజూరు చేశారు. నిర్మాణాలకు అవసరమైన భూములు అందజేస్తామంటున్న రెవెన్యూ అధికారులు.. మున్సిపాలిటీ అధికారులను తమ చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement