
కారుచౌకగా మఠం భూములు ధారాదత్తం!
తిరుపతిలో శ్రీ గాలిగోపురం భూములను ఆక్రమణదారులకే క్రమబద్ధీకరించే యత్నాలు
మీడియాకు రామానుజ సంక్షేమ సమితి, స్వధర్మ విజ్ఞాన వేదిక ప్రతినిధులు వెల్లడి
సాక్షి, అమరావతి: తిరుపతిలోని శ్రీ గాలి గోపురం మఠానికి చెందిన అత్యంత విలువైన భూములను కారుచౌకగా ఆక్రమణదారులకే కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని రామానుజ సంక్షేమ సమితి చైర్మన్ డీఎస్‌ఎన్వీ ప్రసాదబాబు, స్వధర్మ విజ్ఞాన వేదిక కన్వీనర్ వీవీఆర్ కృష్ణంరాజు ఆరోపించారు. ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం దేవదాయ భూములను కాపాడడంలో విఫలమైందన్నారు.
ఈ నేపథ్యంలో విజయవాడలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. 1413వ సంవత్సరంలో తిరుపతిలో ఏర్పాటైన గాలి గోపురం మఠానికి ఉన్న విలువైన భూముల్లో 23 ఎకరాలు అనేక సంవత్సరాల క్రితం ఆక్రమణలకు గురయ్యాయని.. ప్రస్తుతం వాటి విలువ ఎకరం రూ.20 కోట్లు ఉంటుందన్నారు. ఈ భూముల మొత్తం విలువ సుమారు రూ.460 కోట్లు కాగా.. దానిని కేవలం రూ.31 లక్షలకే ఆక్రమణదారులకు కట్టబెట్టడానికి దేవదాయ శాఖ ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. నిజానికి.. ఈ భూముల వివాద పరిష్కారానికి 2019లో చంద్రబాబు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయగా అది 2022 ఆక్టోబరు 10న ఇచ్చిన నివేదికలో ఎకరాకు రూ.1.35 లక్షల చొప్పున ఆక్రమణలు క్రమబద్ధీకరించాలని సూచించిందని కృష్ణంరాజు వివరించారు.
అయితే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ నివేదికను బుట్టదాఖలు చేయగా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఇదే నివేదిక సిఫార్సులను అమలుచేయాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఈఓ కార్యాలయం ఎదురుగా సింగాలకుంట నుంచి ఇస్కాన్ రోడ్డు వరకూ విస్తరించిన ఈ ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్ విలువ గజం రూ.40 వేలు ఉందని, ఇంత విలువైన భూమిని ఎకరాకు రూ.1.35 లక్షల చొప్పున ఎలా క్రమబద్ధీకరిస్తారని వారు ప్రశ్నించారు.
ఆక్రమణల చెరలో 87 వేల ఎకరాలు..
ఇక చంద్రబాబు ప్రభుత్వం దేవదాయ భూములను కాపాడడంలో విఫలమైందని, ఆక్రమణలకు గురైన భూములను కారుచౌకగా క్రమబద్ధీకరించడానికి నాంది పలికిందని ప్రసాదబాబు ఆరోపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం సర్వే నెంబర్ 233లోని ఎకరా 72 సెంట్ల భూమిని గజం కేవలం రూ.500లకే విక్రయించిందని గుర్తుచేశారు. అయితే, 2019 సెప్టెంబరులో అప్పటి సీఎం జగన్ హయాంలో టీటీడీ సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన 188 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుందన్నారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం దేవదాయ శాఖకు ఉన్న మొత్తం నాలుగున్నర లక్షల ఎకరాల భూముల్లో 87వేల ఎకరాలు ఆక్రమణదారుల చెరలో ఉన్నాయని.. వాటిని కూడా అతితక్కువ రేట్లకే క్రమబద్ధీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రసాదబాబు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment