తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం బట్టబయలు
తిరుమలపై పూర్తి ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి బినామీలను ప్రవేశపెట్టిన సీఎం.. వీరికి ఫైబర్‌నెట్ కుంభకోణం ప్రధాన నిందితుడు వేమూరి హరికృష్ణ నాయకుడు
కీలక పాత్రధారులుగా లోకేశ్ సన్నిహితులు లక్ష్మణ్, చందు తోట
ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే టీటీడీలోకి చొరబాటు
భక్తుల సొమ్ముతో టీటీడీలో వీరికి చాంబర్, ప్రత్యేక సౌకర్యాలు
క్యూలైన్లు, దర్శనాలు, ప్రసాదాలు అన్నీ ఆ ముఠా ఆదీనంలోనే
ఆ ముఠా తొలి ప్రయోగమే వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూలైన్ల నిర్వహణ
అనంతరం తిరుమల క్యూలైన్ల బాధ్యత అప్పగించడమే లక్ష్యం
వికటించిన బాబు ముఠా ప్రయోగం
ఆరుగురు మృతి.. వెంటనే తిరుమల నుంచి జారుకున్న బాబు ముఠా
దీన్ని కప్పిపుచ్చేందుకే తిరుపతిలో అధికారులపై బాబు చిందుల డ్రామా
ఈ నిందను వైఎస్సార్‌సీపీపై వేసే ప్రయత్నమూ విఫలం
సాక్షి, అమరావతి: తిరుమల చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట జరగటం, ఆరుగురి ప్రాణాలను హరించడం వెనుక అసలు కుట్ర బట్టబయలైంది. శ్రీవారి ఆలయం పవిత్రత, సంప్రదాయాలకు భంగం కలిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ఆ వ్యవస్థనంతటినీ తన బినామీలైన ప్రైవేటు ముఠా ఆధిపత్యంలోకి తేవడం, వారి నిర్వాకంతోనే ఈ ఘటన జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. పైగా, ఆ నిందను వైఎస్సార్‌సీపీపై వేసేందుకూ టీడీపీ నేతలు వెనుకాడలేదు. ఇప్పుడు అసలు కుట్ర చంద్రబాబుదేనన్న విషయం బట్టబయలైంది. ఇంతకు ముందు శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ లేని అపోహలు సృష్టించిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా ఆలయంలోకి ప్రైవేటు వ్యక్తులను ప్రవేశపెట్టి తన గుప్పిట్లోకి తీసుకొనేందుకు సాగించిన గూడుపుఠాణి బట్టబయలైంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానాన్ని అందించే ముసుగులో చంద్రబాబు తన బినామీ ముఠాను టీటీడీలో అనధికారికంగా చేర్చారు. తిరుమలలో క్యూలైన్ల నిర్వహణ, దర్శనాలు, ప్రసాదం పంపిణీ.. ఇలా సమస్తం ఆ ముఠాకే కట్టబెట్టాలన్న దురాలోచనకు తెగించారు. అందుకోసం ప్రయోగాత్మకంగా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీని ఆ ముఠాయే పర్యవేక్షించడం, సరైన ప్రణాళిక లేక తొక్కిసలాటకు దారి తీసి ఆరుగురు భక్తుల దుర్మరణానికి కారణమైందన్న అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తిరుమల ఆలయాన్ని గుప్పిట పట్టేందుకు చంద్రబాబు బినామీ ముఠా చేస్తున్న కుతంత్రాన్ని కొన్ని నెలలుగా పరిశీలిస్తున్న టీటీడీ వర్గాలు అసలు విషయాన్ని ‘సాక్షి’కి సాధికారికంగా వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి అశేష భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న చంద్రబాబు కుట్ర ఇదిగో ఇలా ఉంది..
టీటీడీలో బాబు బినామీలు పాగా..
పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంపై తన బినామీలకు పెత్తనం కట్టబెట్టి, యావత్ టీటీడీ వ్యవస్థను హైజాక్ చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందుకోసం ఏఐ పరిజ్ఞానాన్ని టీటీడీకి అందిస్తారంటూ ప్రైవేటు వ్యక్తులను టీటీడీలోకి ప్రవేశపెట్టారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ నేతృత్వంలోనే ఈ కుతంత్రానికి తెరతీశారు. చంద్రబాబు ఏరికోరి నియమించిన తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి అందుకు పూర్తి సహకారం అందిస్తున్నారు. వీరి సహకారంతో చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితులైన లక్ష్మణ్ కుమార్, చందు తోట అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ నిపుణులు గుట్టుచప్పుడు కాకుండా టీటీడీలోకి ప్రవేశించారు.
వాస్తవానికి టీటీడీలో ఏదైనా పోస్టు ఇవ్వాలన్నా, కన్సల్టెంట్‌గా నియమించాలన్నా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వాలి. టీటీడీ పాలకమండలి తీర్మానం చేయాలి. కానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, టీటీడీ పాలకమండలి తీర్మానం లేకుండానే లక్ష్మణ్ కుమార్, చందు తోట టీటీడీలోకి దర్జాగా ప్రవేశించారు. ఓ కేంద్ర మంత్రి వద్ద గతంలో పీఎస్‌గా పని చేశానని చెప్పుకునే లక్ష్మణ్ కుమార్ ఏకంగా టీటీడీ అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి పక్కనే ఆయనకు కుర్చీ వేసి మరీ ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారు.
ఆయనకు ప్రత్యేక ఛాంబర్, వాహనం, ఇతర సౌకర్యాలను కల్పించడం గమనార్హం. అంటే టీటీడీలోకి అనధికారికంగా, అక్రమంగా ప్రవేశించిన ప్రైవేటు వ్యక్తులకు రాచమర్యాదలు కూడా కల్పిస్తున్నారు. అదీ భక్తులు తిరుమల ఆలయంలో సమర్పించిన కానుకల నిధుల నుంచీ..
ఆలయాన్ని గుప్పిటపట్టే కుట్ర..
ఏఐ పరిజ్ఞానాన్ని టీటీడీ వ్యవస్థలో ప్రవేశపెట్టడానికి లక్ష్మణ్ కుమార్, చందు తోట సహకరిస్తున్నారని టీటీడీ వర్గాలే చెబుతున్నాయి. ఆ మేరకు అధికారిక నోటిఫికేషన్ ఏమీ జారీ చేయలేదు. ఎందుకంటే.. ఏఐ పరిజ్ఞానం పేరుతో తిరుమల–తిరుపతిలో అన్ని వ్యవస్థలనూ బినామీలకు కట్టబెట్టాలన్నది చంద్రబాబు అసలు కుట్ర. తిరుమలలో గదుల కేటాయింపు, శ్రీవారి ఆలయం క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ, దర్శనాలు, ప్రసాదం పంపిణీ.. ఇలా అన్నింటినీ ఆ ముఠా ఆధిపత్యంలోకి తేవడమే అసలు వ్యూహం. వేలాదిమంది టీటీడీ ఉద్యోగులతో పటిష్టంగా ఉన్న వ్యవస్థను క్రమంగా నీరుగార్చి.. తన బినామీ ముఠాకే తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీపై గుత్తాధిపత్యం కట్టబెట్టాలన్నది అంతిమలక్ష్యం. అంటే తిరుమలలో గదులు, దర్శనం, ప్రసాదాలు ఇలా ఏదైనా ఈ ముఠా ద్వారానే జరగాలి.
వైకుంఠ ఏకాదశి టికెట్లపై ప్రయోగం
తిరుమల శ్రీవారి ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ వ్యవస్థను గుప్పిట పట్టేందుకు రూపొందించిన విధానాన్ని వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రయోగాత్మకంగా పరీక్షించాలని ఆ ముఠా భావించింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందు తోట కొన్ని రోజులుగా తిరుమల–తిరుపతిలోనే తిష్ట వేసి అదే పనిలో ఉన్నారు. పైలట్ ప్రాజెక్టును తిరుమలలో నిర్వహించే అవకాశం లేదు. అందుకే ముందుగా తిరుపతిలో పరీక్షించాలని భావించారు. అందుకే ఈసారి వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఉద్దేశçపూర్వకంగా తిరుపతిలో 8 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. కానీ, చంద్రబాబు బినామీ ముఠా రూపొందించిన విధానం పూర్తిగా బెడిసికొట్టింది. వారు చెప్పినట్టుగా టీటీడీ అధికార యంత్రాంగం చేయడంవల్లే టికెట్ల జారీ అస్తవ్యస్తంగా తయారైంది. భక్తులు గంటల తరబడి రోడ్లపై నిరీక్షించి తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. చివరికి తొక్కిసలాటకు దారి తీసి ఆరుగురు భక్తులను బలి తీసుకుంది.
పరారైన బాబు ముఠా
తమ ప్రయోగం వికటించి, ఆరుగురు మరణించారని తెలియగానే చంద్రబాబు బినామీ ముఠా బిచాణా ఎత్తేసింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందు తోట తిరుమల నుంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నారు. ఈ వ్యవహారమంతా బయటకు రాకూడదని తిరుపతిలో చంద్రబాబు పెద్ద డ్రామా నడిపించారు. ఆయన తిరుపతిలో అధికారులపై చిందులు తొక్కినట్టుగా డ్రామా నడిపి, నేరుగా బాధ్యతలేని అధికారులపై చర్యలు తీసుకుని అసలు విషయాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించారు. కాగా, తిరుమలలో కొన్ని నెలలుగా చంద్రబాబు బినామీ ముఠా బాగోతంపై టీటీడీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్రమైన తిరుమల ఆలయం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు, సనాతన సంప్రదాయాలను కాలరాసేందుకు, భారీ ఆర్థిక దోపిడీకి చంద్రబాబు బినామీ ముఠా పన్నాగం పన్నిందని ధ్వజమెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment