Panchayat building
-
బిల్లులు రాక.. పంచాయతీ భవనం తాకట్టు!
మేడిపల్లి (వేములవాడ): చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవటంతో ఓ మాజీ సర్పంచ్ గ్రామ పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మేడిపల్లి మండలం తొంబరావుపేట తాజా మాజీ సర్పంచ్ మామిడి సత్తమ్మ ధర్మారెడ్డి శుక్రవారం కట్లకుంట తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో పంచాయతీకి సంబంధించి దస్త్రాలను తాకట్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుమారు రూ.18 లక్షలకు పైగా అప్పు చేసి తొంబరావుపేట పంచాయతీ భవనం నిర్మించామని, ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవటంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని వాపోయారు. అప్పు ఇచి్చనవారు రోజూ ఇంటికి వచ్చి వేధిస్తున్నారని తెలిపారు. దీంతో అప్పులు తీర్చేందుకు లోన్ కోసం పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేసిన వెంటనే వడ్డీతో సహా బ్యాంకులో చెల్లిస్తానని సిబ్బందికి వివరించారు. తాకట్టు పెట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తమకు వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని లేకుంటే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బ్యాంకు అధికారిని సంప్రదించటానికి ప్రయతి్నంచగా అందుబాటులోకి రాలేదు. -
గ్రామ స్వరాజ్యం దిశగా పల్లెలు
నిర్మల్ రూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణ పల్లెలు గ్రామ స్వరాజ్యం దిశగా పయనిస్తున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఇందులో తాము భాగస్వాములం అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ మండలం భాగ్యనగర్ గ్రామంలో గురువారం పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి మంత్రి నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. గ్రామంలోని పారి శుధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం ఐకేరెడ్డి మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారాయని తెలిపారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ప్రతీ గ్రామంలో వైకుంఠధామం, హరితవనం, నర్సరీ, క్రీడా ప్రాంగణం, ట్రాక్టర్ ట్రాలీ తదితర ఎన్నో సౌకర్యాలను సమకూర్చామన్నారు. భూముల రేట్లు పెరుగుతున్నాయని రైతులు భూములను అమ్ముకోవద్దని సూచించారు. దేశంలో రైతులకు కష్టం లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని స్పష్టం చేశారు. కలెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ప్రతీ గ్రామంలో మంచినీరు, కరెంట్ సమస్య ఉండేదన్నారు. ఇప్పుడు ఆ బాధ తీరిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులు ఎలా ఉండేవో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకోవాలన్నారు. వేడుకల్లో డీపీవో శ్రీలత, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో సాయిరాం, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ కారగిరి భూమయ్య, ఉపసర్పంచ్ రాజేందర్, నాయకులు మహేశ్‌రెడ్డి, రామ్‌కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి -
‘కొత్తపల్లె’ కరెంటు బిల్లు.. రూ. 11.41 కోట్లు!
మాచారెడ్డి: ఇటీవల పంచాయతీల పునర్విభజనలో కొత్త పంచాయతీగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లె పంచాయతి భవనానికి రూ. కోట్లలో వచ్చిన కరెంటు బిల్లును చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. పంచాయతీ వాటర్ వర్క్స్‌కు సంబంధించిన సర్వీస్ నంబర్ 3801–02321పై ఈనెల 3న ట్రాన్స్‌కో బిల్లింగ్ సిబ్బంది మీటర్ రీడింగ్ నమోదు చేశారు. జనవరి 2 నుంచి ఫిబ్రవరి 3 వరకు 1,88,15,257 యూనిట్లు వాడినట్టు పేర్కొన్నారు. దీనికి ఏకంగా రూ. 11,41,63,672 బిల్లు విధించారు. ఏసీడీ డ్యూ కింద మరో రూ.8,716 వడ్డించారు. ఈనెల 17 లోపు బిల్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ బిల్లును చూసిన సర్పంచ్, పంచాయతీ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. గతనెల విద్యుత్ బిల్లు రూ.3,257 వచ్చిందని సర్పంచ్ తెలిపారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సాంకేతిక సమస్యతో బిల్లు ఇలా వచ్చిందని చెప్పారు. -
పంచాయతీ కార్యాలయం కట్టకపోతే బతకను
రాయగడ : కల్యాణ సింగుపురం సమితిలోని కొందొకత్తిపాడు గ్రామంలోనే పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆ గ్రామ సర్పంచ్ సునీత హికాక హెచ్చరించారు. ఈ విషయమై ఆమె తమ పంచాయతీలోని దంతలింగి, పొంగళి, ఒడాగుడ, చింతలిగుడ, కెందుగుడ గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్లోని సబ్‌కలెక్టరు ప్రతాప్‌చంద్ర ప్రధాన్‌కి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదివరకు పొలమ పంచాయతీలో ఉండే కొందొకత్తిపాడుని 6 నెలల క్రితం ఆ పంచాయతీ నుంచి వేరుచేసి, కొత్త పంచాయతీగా చేశారని తెలిపారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న పంచాయతీ కార్యా లయాన్ని కొత్త పంచాయతీ కొందొకత్తిపాడులోనే ఏర్పాటు చేయాలని ఆమె పట్టుబట్టారు. అయితే కొద్దిరోజుల క్రితం పంచాయతీ కార్యాల యం నిర్మాణానికి సంబంధించి, పొలమ పంచాయతీకి దగ్గరలోని 7 సెంట్ల ప్రభుత్వ భూమిని అధికారులు పరిశీలించారని ఆమె పేర్కొన్నారు. కొందొకత్తిపాడులోని 10 సెంట్ల ప్రభుత్వ స్థలంలో పంచాయతీ కార్యాలయం నిర్మాణం చేపట్టకుండా వేరేచోట ఆ నిర్మాణం చేపట్టడం వెనక ఉన్న ఆంత్యర్యమేంటని ఆమె ప్రశ్నించారు. ఎటువంటి గ్రామసభలు నిర్వహించకుండా పంచాయతీ కార్యాలయం నిర్మాణం చేపట్టేందుకు అధికారులు ఈ ఏకపక్ష నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా కొందొకత్తిపాడులో ఉన్న అనువైన స్థలంలోనే పంచాయతీ కార్యాలయం నిర్మాణం జరిగేలా చూడాలని సబ్‌కలెక్టర్‌ని ఆమె కోరారు. దీనిపై స్పందించిన సబ్‌కలెక్టరు ఈ సమస్యని కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
గ్రామస్తులపై చేయిచేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే
-
గ్రామస్తులపై చేయిచేసుకున్న నరసాపురం ఎమ్మెల్యే
సాక్షి, నరసాపురం : టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు రౌడీలా ప్రవర్తించారు. గ్రామ పంచాయతీ భవనాన్ని తరలించొద్దంటూ వేడుకున్నా వినకుండా వారిపై చేయిచేసుకున్నారు. ఈ సంఘటన నరసాపురం మండలంలోని సరిపల్లిగ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. సరిపల్లి గ్రామంలోని పంచాయతీ భవన వివాదం కోర్టు పరిధిలో ఉంది. దానిని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే బండారు అక్కడకు చేరుకున్నారు. అయితే, వివాదంలో ఉన్న భవనాన్ని ప్రారంభించేందుకు వీలులేదని స్థానికులు అడ్డుచెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన మాధవనాయుడు గ్రామస్తులపై చేయిచేసుకున్నారు. మెడలు పట్టుకుని వారిని అక్కడ నుంచి గెంటేసి పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే తీరుతో సరిపల్లిలో ఉద్రికత్తత తీవ్ర స్థాయికి చేరింది. మాధవనాయుడు రౌడీల ప్రవర్తించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పంచాయతీ భవనానికి విద్యుత్ షాక్ !
బొంరాస్‌పేట: మండలంలోని రేగడిమైలారం పంచాయితీ భవనాన్ని ఎక్కడ ముట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతోంది. భవనం ఎతైన భాగంలో గోడలకు విద్యుత్ తీగలు ఎక్కడో తగిలి, ప్రస్తుత వర్షాలకు గోడలు తడిసి విద్యుత్ షాక్ వస్తున్నట్లు గ్రామ సేవకులు, గ్రామస్తులు చెబుతున్నారు. పంచాయితీ భవనంలోకి వెళ్లాలంటే జంకుతున్నారు. సర్పంచ్, విద్యుత్ సిబ్బంది స్పందించి దీన్ని నివారించాలని కోరుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున శుక్రవారం పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్ సిబ్బంది తెలిపారు. -
ల్యాండ్.. మీ 'దయా'!
* అభివృద్ధికి భూమి ఆటంకాలు * శ్రద్ధ చూపనంటున్న రెవెన్యూ సిబ్బంది * నిధులు మంజూరైనా సాగని నిర్మాణాలు * చీమకుర్తి నగర పంచాయతీకి తీరని కష్టాలు చీమకుర్తి: దేవుడు కరుణించినా.. పూజారి జాలి చూపలేదట. నగర పంచాయతీ స్థాయి పెంచేందుకు.. కీర్తి పంచేందుకు ఎన్నో నిర్మాణాలు కావాలి. అందుకే వాటి కోసం ప్రభుత్వం నిధుల మంజూరుకు అనుమతించింది. కానీ అధికారులు మోకాళ్లడ్డుతారే! నిర్మాణాలకు అవసరమైన స్థలాలు కేటాయించరే! ఇలాంటి పరిస్థితుల్లో చీమకుర్తి నగర పంచాయతీ కొట్టుమిట్టాడుతోంది. ప్రజలకు అవసరమైన పనులకు దిక్కులేకుండా పోతోంది. రెండేళ్ల క్రితమే చీమకుర్తి నగర పంచాయతీగా ఆవిర్భవించింది. ప్రజలంతా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. కానీ అప్పటి నుంచి కష్టాలు పెరిగాయే కానీ ఫలితం మాత్రం శూన్యం. మున్సిపల్ భవనం సమకూరేనా? మొదటి నుంచి నాటి పంచాయతీ భవనంలోనే మున్సిపాలిటీ కూడా కొనసాగుతోంది. సొంత బిల్డింగ్ కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ. 50 లక్షలు మంజూరు చేసింది. అయితే స్థల సమస్య కొలిక్కి రాలేదు. పంచాయతీ భవనం ఆనుకొని ఉన్న తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోనే 88 సెంట్ల స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించారు. తహశీల్దార్ ద్వారా ఆర్డీఓ నుంచి కలెక్టర్‌కు ప్రతిపాదనల ఫైలు పంపించారు. అయితే ఇక్కడే చిక్కు వచ్చి పడింది. సాంకేతిక కారణాల వల్ల ఫైలును రెవెన్యూ అధికారులు తిరిగి వెనక్కు తీసుకున్నారు. ఇదంతా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. అప్పటి దాకా కాంగ్రెస్‌ను తిట్టిపోసిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం సాధించలేకపోయింది. రవాణాశాఖ మంత్రి ఏరియా! చీమకుర్తికి చెందిన శిద్దా రాఘవరావు ప్రస్తుతం రాష్ర్ట రవాణాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కొంతమంది టీడీపీ నాయకులే అభివృద్ధిపై శ్రద్ధ చూపించడంలేదని అధికారులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతం తాలూకూ పాలనపై విమర్శలు గుప్పించడమే కానీ తక్షణ కర్తవ్యం గుర్తించడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరైనప్పటికీ.. సకాలంలో వాటిని వినియోగించకుంటే తిరిగి వెనక్కు వెళ్లే ప్రమాదం నెలకొంది. గారెలున్నాయ్.. బూరెలున్నాయ్ పాయసం..పులిహోరా నోరూరిస్తోంది కానీ ఏం లాభం తింటే రోగం.. రుచికరమైన వంటకాలను అలా చూస్తూ ఉండాల్సిందే! సరిగ్గా.. ఇలాగే! చీమకుర్తి మున్సిపాలిటీ పరిస్థితి ఉంది ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన గెలాక్సీ గ్రానైట్ దీని ద్వారా కోట్ల రూపాయల రాయల్టీ వేలాది మంది పౌరులు.. ఇలా ఈ పట్టణం అయ్యింది మున్సిపాలిటీ! వివిధ అభివృద్ధి పనులకు డబ్బులు మంజూరయ్యాయి ఇక తిరుగులేదనుకుంటుంటే.. వాటి నిర్మాణాలకు భూములు కేటాయించరు.. మున్సిపల్ భవనం.. డంపింగ్ యార్డు.. ఎస్ఎస్ ట్యాంకు.. ఇలాంటి ప్రతిపాదనలన్నీ జనంకల్లి ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాయి... చెత్త పోసే దిక్కులేదు చీమకుర్తి పట్టణంగా మారిన తర్వాత నివాస గృహాలు పెరిగిపోయాయి. దుకాణ సముదాయాలు, తోపుడు బండ్ల వ్యాపారులు కూడా ఎక్కువయ్యారు. దీనికితోడు గ్రానైట్ వ్యర్థాలు ఎలాగూ ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో రోజూ క్వింటాల కొద్దీ చెత్త ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీనంతటినీ తరలించాలంటే డంపింగ్ యార్డు కావాలి. కానీ చీమకుర్తికి ఇలాంటి సౌకర్యం లేకపోవడంతో చెత్తంతా పాటిమీదపాలెం పోయేదారిలోనున్న రెండు ఎకరాల్లో రోడ్డుకు సమీపంలోనే వేస్తున్నారు. ఆ చోటు కూడా సరిపోకపోవడ ంతో చెత్తంతా రోడ్డుమీదకు వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. సమస్య పరిష్కారం కోసం పాటిమీదపాలెం సమీపంలో 10 ఎకరాలు డంపింగ్ యార్డు కోసం పరిశీలించినట్లు మున్సిపాలిటీ అధికారులు గత శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేకు తెలియ జేశారు. ఇదిలా ఉంటే సమస్యను తహశీల్దార్ దృష్టికి తీసుకుపోయి డంపింగ్‌కు అవసరమైన స్థలాన్ని గుర్తించటంలో మున్సిపాలిటీ అధికారులు ఏడాదిగా కుస్తీలు పడుతూనే ఉన్నారు. దాహార్తి తీర్చేందుకూ ముందుకు రారు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా చీమకుర్తి మున్సిపాలిటీకి తాగునీరు అందించేందుకు దాదాపు రూ. 52 కోట్లతో ప్రతిపాదనలను పంపించారు. రామతీర్థం రిజర్వాయర్‌లోని తాగునీటిని చీమకుర్తి పరిసరాల్లోకి తీసుకొచ్చి స్టోర్ చేస్తే ప్రజల దాహార్తి తీరుతుంది. దీనికోసం కావాల్సింది కేవలం ఒక్క ఎకరా మాత్రమే! కానీ ఈ విషయంలోనూ రెవె న్యూ అధికారులు మున్సిపాలిటీవారికి సహకరించక పోవడంతో మహత్తర పథకానికి మంగళం పాడినట్లయింది. మహిళా స్వశక్తి భవన్‌కు నిధులొచ్చినా.. మహిళా స్వశక్తి భవన్ నిర్మించేందుకు మున్సిపాలిటీకి ఏడాది క్రితం రూ. 25 లక్షలు మంజూరయ్యాయి. అలాగే కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్ పేరుతో రెండు భవనాలకు మొత్తం రూ. 22 లక్షలు కూడా మంజూరు చేశారు. నిర్మాణాలకు అవసరమైన భూములు అందజేస్తామంటున్న రెవెన్యూ అధికారులు.. మున్సిపాలిటీ అధికారులను తమ చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు.