పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ :బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్‌కు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ ఉద్యోగిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అయితే పెద్దచేపలు తప్పించుకొని చిన్నచేప దొరికిందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. సంఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీఆర్.విజయపాల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చెరువుకట్ట బజారుకు చెందిన కొల్లి బ్రహ్మం తనకున్న 2 సెంట్ల స్థలంలో భవనాన్ని నిర్మించుకునేందుకు ప్లాను తయారు చేయించుకుని అప్రూవల్ కోసం మున్సిపల్ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నాడు.
ఇంతవరకు అప్రూవ్ చేయకపోవటంతో బిల్డింగ్ ఓవర్‌సీయర్ బి.వి.మధుసూదనరావును కలిశాడు. మధుసూదనరావు రూ.8 వేలు డిమాండ్ చేయగా రూ.5వేలకు రేటు కుదిరింది. లంచం ఇచ్చేందుకు అయిష్టంగా ఉన్న బ్రహ్మం సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల ఆధారంగా మంగళవారం ఉదయం టౌన్‌ప్లానింగ్ కార్యాలయానికి వ చ్చిన బ్రహం, అతని సోదరుడు తిరుపతి పౌడర్ చల్లిన పది రూ.500 నోట్లను మధుసూదనరావుకు ఇచ్చారు. ఆయన వాటిని బల్లపై ఉన్న తన డైరీలో పెట్టుకోగానే ఏసీబీ అధికారులు వచ్చి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మధుసూదనరావు చేతిని కెమికల్స్‌లో ముంచగా అవి రంగుమారటంతో లంచం తీసుకున్నట్లు నిర్థారణకు వచ్చినట్లు డీఎస్పీ విజయపాల్ తెలిపారు.
లంచం డిమాండ్‌లో పైఅధికారుల ప్రమేయం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, ఆ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. గుంటూరులోని వసంతరాయపురంలో ఉన్న మధుసూదనరావు నివాసగృహంలోనూ ఏసీబీ ఎస్‌ఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించేందుకు ఒక టీమును పంపినట్లు డీఎస్పీ తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని మధుసూదనరావు అద్దెకుంటున్న గదిలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఎస్‌ఐలు రవి, శ్రీనివాస్, నాగరాజు, సీతారాం సిబ్బంది పాల్గొన్నారు. ప్లాన్ అప్రూవల్ కోసం రెండునెలల నుంచి తిరుగుతున్నా పనిచేయకుండా చాలా ఇబ్బంది పెట్టారని, చివరకు అసలు విషయం చెప్పండని సోమవారం అడుగగా రూ.8 వేలు ఇస్తే ప్రాసెస్ మొదలు పెడతానని బ్లాక్‌మెయిల్ చేశాడని బాధితుడు కొల్లి బ్రహ్మం చెప్పారు.
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఉద్యోగి
Published Wed, Oct 23 2013 2:31 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM
Advertisement