రోజు రోజుకు బలోపేతం
Published Thu, Sep 26 2013 11:47 PM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
గుంటూరు,న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో చేపట్టిన ఉద్యమం 58వ రోజు గురువారం నిరసనలు, ఆందోళనలతో హోరెత్తింది. జిల్లాలో పలు చోట్ల ప్రదర్శనలు, రోడ్లపై వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారు. తెనాలిలో మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు 31వ రోజుకు, టీడీపీ రిలేదీక్షలు 29వ రోజుకు చేరాయి. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు వీధుల్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. బాపట్లలో పాత బస్టాండు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర దీక్షలో ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. రాష్ట్రం సమైక్యాంగా ఉంటేనే ఎంతో మంచిదన్నారు.
ప్రత్తిపాడులో సమైక్యాంధ్రకు మద్దతుగా రోటరీక్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. సమైక్యాంధ్ర కోరుతూ వేమూరు నియోజకవర్గం దోనేపూడిలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. చిలకలూరిపేటలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో ర్యాలీ కొనసాగింది. ఏపీఎన్‌జీవోలు, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, జాతీయరహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు. మంగళగిరిలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు భారీ ప్రదర్శన చేశారు. అనంతరం రోడ్డుపై యోగా చేసి నిరసన తెలిపారు. నరసరావుపేట, మాచర్లలో సమైక్యాంధ్ర కోసం రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నరసరావుపేటలో 1000 మంది ఆర్యవైశ్యులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. రేపల్లెలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మేళ్లవాగులో ఉపాధ్యాయులు జలదీక్ష నిర్వహించారు. వినుకొండలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మోటారు సైకిళ్లతో ప్రదర్శన జరిగింది.
గుంటూరు నగరంలో ...
ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్‌లో రోడ్డుపై బట్టలు ఉతికి రజకులు నిరసన తెలిపారు. ఇంటర్‌బోర్డు ఆర్జేడీ కార్యాలయం వద్ద ‘విభజన వాద సంహారం’ పేరుతో జూనియర్ కళాశాలల అధ్యాపకులు రోడ్డుపై లఘునాటిక ప్రదర్శించారు. విభజనవాదులను భరతమాత కాళికాదేవి అవతారంలో ఆగ్రహించి సంహరించినట్లు చూపారు. ప్రభుత్వ పాఠశాలలఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలల హాస్టళ్లకు వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థినులను ఇళ్లకు పంపారు. విద్యా సంస్థల బంద్ సందర్భంగా విద్యార్థి జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బుడంపాడులోని గుంటూరు చానల్‌లో జలదీక్ష చేశారు.
Advertisement
Advertisement