వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థిని నాగశ్రీ వందన పరిమళ మృతి చెందగా ఆమె ఇద్దరు స్నేహితులు గాయపడినట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ (26) ఉన్నత చదువుల కోసం 2022 డిసెంబర్‌లో అమెరికాకు వెళ్లారు. అక్కడ టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్)చదువుతున్నారు.
అయితే ఈ తరుణంలో గత శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా, రాక్‌వుడ్ ఎవెన్యూ సమీపంలో ట్రక్ వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో నాగశ్రీ వందన పరిమళతో పాటు ఆమె స్నేహితులకు పవన్, నికిత్‌లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వందన మరణించగా.. పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కాగా, రోడ్డు ప్రమాదంలో నాగశ్రీ వందన పరిమళ మృతి చెందడంతో తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వందన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అక్కడి అధికారులు, తెలుగు సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment