మనుషులు వెళ్లడానికి ఇష్టపడని ప్రదేశాలలో శ్మశానం ఒకటి అని చెబుతుంటారు. అయితే అసహజ మరణాలకు సంబంధించిన శవాలు శ్మశానానికన్నా ముందు చేరుకునే ప్రదేశం మార్చురీ. అక్కడ కొద్దిసేపు గడపాలంటేనే ఇబ్బంది పడేవాళ్లు, భయపడేవాళ్లు ఉంటారు. అలాంటిది పోస్ట్‌మార్టం గదిలో రోజూ ఉద్యోగం చేయడం అంటే ఎంతో ధైర్యం కావాలి.
ఆ గుండె ధైర్యం రామ్‌ప్రసన్నలో ఉంది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రామ్‌ప్రసన్న... ‘ఆడవాళ్లు ఈ ఉద్యోగం చేయడం ఏమిటి!!’ అనే లింగవివక్షతతో కూడిన మాటలు... ‘చేయడానికి నీకు ఈ ఉద్యోగమే దొరికిందా!’లాంటి వెక్కిరింపులు ఎదుర్కొన్నా... ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. వృత్తి జీవితంపై గౌరవాన్ని తగ్గించుకోలేదు...
ఇచ్చోటనే...నిండా పాతికేళ్లు కూడా నిండని యువకుడి శవం. ‘బహుశా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు’ అని ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి... తన పిల్లల్ని తలుచుకొని కళ్లనీళ్ల పర్యంతం అవుతున్నట్లు అనిపిస్తుంది. ‘ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేయాలి. వారి పెళ్లి చూడకుండానే వరద నన్ను మింగేసింది’... మధ్యతరగతి తండ్రి శవం అదేపనిగా రోదిస్తున్నట్లుగా ఉంటుంది. శవాలు మౌనంగా చెప్పే కథలు ఎన్నో విన్నది రామ్‌ప్రసన్న. అలా అని శ్మశాన వైరాగ్యంలాంటిది తెచ్చుకోలేదు. వృత్తిని వృత్తిలాగే ధైర్యంగా నిర్వహిస్తోంది.
‘నాకు ఉద్యోగం వచ్చింది అనగానే సంతోషించిన వాళ్లు శవాల గదిలో అని చెప్పగానే నోరు తెరిచారు. ఆడపిల్లవు...అక్కడెలా చేస్తావంటూ అడిగేవాళ్లు. ఎక్కువ రోజులు ఉండలేవు. వచ్చేస్తావు అన్నవాళ్లూ ఉన్నారు. అందుకే ఆడవాళ్లు ఎవరూ రాని ఈ వృత్తిలో కొనసాగుతున్నా’ అంటుంది తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అసిస్టెంట్ (శవపరీక్ష సహాయకురాలు)గా విధులు నిర్వర్తిస్తున్న రామ్ ప్రసన్న.
ఆసుపత్రి వెనుక వైపు కాస్తంత దూరంగా ఉండే మార్చురీలోకి నిత్యం వచ్చే శవాలతోనే తన వృత్తిజీవితం ముడిపడివుంది. ఆత్మహత్యకు పాల్పడినవాళ్లు, రోడ్డు ప్రమాదాల మృతులు, నీళ్లలో కొట్టుకు వచ్చిన మృతదేహాలు... నిత్యం ఆసుపత్రికి వస్తూనే వుంటాయి. అన్నింటికీ శవపరీక్ష నివేదిక కీలకమని తెలిసిందే. సంబంధిత వైద్యుడు శవపరీక్ష చేస్తే అందుకు తగినట్టుగా మృతదేహాన్ని సిద్ధం చేయటం, వైద్యుడికి సహాయపడటం సహాయకురాలిగా రామ్‌ప్రసన్న ఉద్యోగం.
భర్త ప్రోత్సాహంతో...
ప్రమాదాల్లో రక్తమోడుతున్న మృతదేహాలూ, నీటిలో ఉబ్బిపోయినవీ, డీ కంపోజింగ్‌కు చేరువైనవి... చూడటమే కష్టం. నెలకు పదిహేను నుంచి ఇరవై వరకు వచ్చే ఇలాంటి మృతదేహాలను శవపరీక్షకు సిద్ధం చేయాలంటే ఎంత ధైర్యం కావాలి? సన్నగా, రివటలా ఉండే రామ్‌ప్రసన్న ఆ విధులను వస్త్రాలకు అతుకులు కుట్టినంత శ్రద్ధగా, అలవోకగా చేస్తోంది.
రామ్‌ప్రసన్న దూరవిద్యలో బీఏ చేసింది. కూలి పనులకు వెళుతుండే భర్తకు తోడుగా తాను కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంది. డీసీహెచ్‌ఎస్ నుండి వెలువడిన నోటిఫికేష¯Œ లో పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్ పోస్టు కనిపించటంతో దరఖాస్తు చేసింది. ఇంటర్వ్యూ కూడా పూర్తయ్యాక తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టింగ్ ఇచ్చారు. భర్త ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండాప్రోత్సహించాడు.
భయం అనిపించలేదు... ఆసక్తిగా అనిపించింది!
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో పోస్టుమార్టమ్ సహాయకులుగా ఇప్పటివరకు పురుషులే ఉండేవారు. శవపరీక్షకు ముందు మద్యం సేవించటం తప్పనిసరి అన్నట్టుగా ప్రవర్తించే వారు కొందరు. ఇలాంటి వారు మృతుల బంధువుల నుంచి మద్యానికి డబ్బులు వసూలు చేసేవారు. అలాంటి ఉద్యోగంలో ఇప్పుడు ఒక ఆడపిల్లను చూడడం చాలామందికి వింతగా ఉంది. ఆ ఆశ్చర్యం సంగతి ఎలా ఉన్నా మృతదేహాల రక్తసంబంధీకులకు ఇప్పుడు మద్యం కోసం పీడన లేదు.
‘ఈ ఉద్యోగంలోకి వచ్చాక తొలిసారి శవపరీక్షలో పాల్గొన్నాను. మరణానికి కారణాలు తెలుసుకోవటం ఆసక్తిగా అనిపించింది. భయం అనిపించలేదు. ఉద్యోగాన్ని అంకితభావంతో చేస్తున్నాను.’ అంటుంది రామ్‌ప్రసన్న.
‘మహిళలు ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయగలరు. ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయాలి’ అనే అప్రకటిత తీర్పులకు, పురుషాధిపత్య ధోరణులకు రామ్‌ప్రసన్న వృత్తిజీవితం, అంకితభావం చెంపపెట్టులాంటిది.
ఈ ఉద్యోగం నాకు గర్వకారణం
నేను చేస్తున్న ఉద్యోగంపై కొందరి సందేహాలు, భయాలు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను వేరే లోకంలో ఉద్యోగం చేయడం లేదు. గ్రహాంతర జీవులు, ప్రమాదకర వ్యక్తుల మధ్య ఉద్యోగం చేయడం లేదు. నిన్నటి వరకు వాళ్లు మనలాంటి మనుషులే. మన మధ్య ఉన్న వాళ్లే. ్రపాణదీపం ఆరిపోగానే వారిని పరాయి వాళ్లుగా చూసి భయపడడం తగదు. నేను భయపడుతూ ఉద్యోగం చేయడం లేదు. గర్వంగా చేస్తున్నాను. అంకితభావంతో చేస్తున్నాను.
– రామ్‌ప్రసన్న
– బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి
Comments
Please login to add a commentAdd a comment