కెరీర్ వర్సెస్ హోమ్!
‘‘కావ్యా... కప్పు కాఫీ ఇవ్వు. తలనొప్పిగా ఉంది’’ - అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన సాకేత్ సోఫాలో కూలబడుతూ అంటాడు.
‘‘ఆ పనేదో నువ్వు చెయ్యి... బాగా అలసిపోయి ఆఫీసు నుంచి వచ్చాను’’ - అసహనంగా అంటుంది కావ్య. ఇక అంతే! మాటల యుద్ధం మొదలవుతుంది.‘‘అసలు నిన్నెవరు ఉద్యోగం చేయమన్నారు? నీదో బోడి ఉద్యోగం, బోడి జీతం’’ - సాకేత్ రంకె వేస్తాడు.‘‘మీకొచ్చే కోటిరూపాయల జీతానికి నేను ఉద్యోగం చేయకుంటే ఎలా?’’ - వ్యంగ్యబాణం విసురుతుంది కావ్య. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఇది మచ్చుకు మాత్రమే, ఇంకా చాలా ఉండొచ్చు. కెరీర్ వర్సెస్ హోమ్ బాధలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి ఇది చాలా చిన్న సమస్య. ఈ విషయం తెలుసుకోకుంటే మాత్రం చా....లా పెద్ద సమస్య. ఈ సమస్యకు కొన్ని పరిష్కారాలు...
► ఇంట్లో చేయాల్సిన పనులను సమానంగా పంచుకోండి. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వారి పని మీరు చేయండి.
► ఒకరు పని చేస్తుంటే మరొకరు టీవి చూడడమో, పాటలు వినడమో కాకుండా వారికి పనిలో మీ వంతుగా సహాయపడితే మరీ మంచిది.
► ఆఫీసు పనిభారంతో ఇంటికి వచ్చి, అసహనంతో మాట తూలితే... వెంటనే సారీ చెప్పడం మరవకండి.
► ఆఫీసును ఇంటి గుమ్మం దగ్గర, ఇంటిని ఆఫీసు గేటు దగ్గర వదలడానికి ప్రయత్నించండి.
► పనిభారానికి రెండు కోణాలు ఉన్నాయి. అవి మన మీదే ఆధారపడి ఉంటాయి. ‘భారం’ అనుకుంటే పని భయపెడు తుంది. గమనించాల్సిన
విషయం ఏమంటే, నిజానికి పని మనలో చురుకుదనాన్ని నింపుతుంది. చురుగ్గా ఉండడం ఆరోగ్యానికి మంచిదే కదా! అదే చురుకుదనాన్ని ఇంట్లో కూడా ప్రదర్శించండి.
► ‘నాకో పండగ లేదు, పబ్బం లేదు... విందు లేదు, వినోదం లేదు... టైమంతా ఆఫీసు తినేస్తోంది’ అని అన్నిటికీ దూరంగా ఉంటారు కొందరు ఉద్యోగులు. ఈ వైఖరి ఇంటి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే నెలవారీ క్యాలెండర్ ఒకటి తయారు చేసుకోండి. సెలవు రోజుల్లో పిల్లలతో ఎక్కడికి వెళ్లాలి, ఏ సినిమాకు వెళ్లాలి, బంధువులను ఎవరిని కలవాలి...ఇలాంటి విషయాలను ఆ క్యాలెండర్‌లో రాసుకొని పాటించండి.