కొడితే ‘ఫాంగ్’ జాబ్ కొట్టాలి అనుకుంటోంది యువతరం. ప్రపంచంలోని ఉత్తమ పనితీరు కనబరిచే దిగ్గజ కంపెనీల సంక్షిప్త నామం–ఫాంగ్ (ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫిక్స్, గూగుల్) ‘ఫాంగ్’ కంపెనీలలో ఉద్యోగం చేయాలనే కలను నెరవేర్చుకోవడానికి స్కిల్ లెర్నింగ్ కాన్ఫరెన్స్‌లకు హాజరు కావడం నుంచి సీనియర్ ఉద్యోగులతో మాట్లాడడం వరకు ఎంతో కసరత్తు చేస్తున్నారు. కలను నెరవేర్చుకుంటున్నారు.
ప్రతిష్ఠాత్మకమైన ఫాంగ్ (ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్) కంపెనీలలో ఉద్యోగం చేయాలని యువతరం బలంగా అనుకోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే... కాంపిటీటివ్ స్పిరిట్, వర్క్–లైఫ్ బ్యాలెన్స్, గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీపై పనిచేసే అవకాశం అనేవి ముఖ్య కారణాలు.
‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేయాలనే కలను నెరవేర్చుకోవడానికి తగిన కసరత్తు చేస్తున్నారు. ‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడుతున్నారు. ‘ఫాంగ్’ రిక్రూటర్స్, ఎం.ఎల్. ఇంజినీర్స్, రిసెర్చర్‌లు హాజరయ్యే స్కిల్ లెర్నింగ్ కాన్పరెన్స్‌లకు హాజరవుతున్నారు. ‘ఫాంగ్’ ఇంటర్వ్యూల గురించి అవగాహన చేసుకోవడానికిప్రొఫెషనల్స్‌తో మాట్లాడుతున్నారు.
‘నా ఫ్రెండ్ ఒకరు మోస్ట్ టాలెంటెడ్. అయితే మొదటి ప్రయత్నంలో ఫాంగ్ కంపెనీలలో ఒకదాంట్లో ఎంపిక కాలేదు. అలా అని డిప్రెస్ కాలేదు. ఏ పొరపాట్ల వల్ల తనకు ఉద్యోగం రాలేదో లోతైన విశ్లేషణ చేసుకుంది. ప్రొఫెషనల్స్‌తో మాట్లాడింది. పొరపాట్లను సరిదిద్దుకొని రెండో ప్రయత్నంలో విజయం సాధించింది’ అంటుంది బెంగళూరుకు చెందిన షాలిని.
‘ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నా ఫాంగ్ కల నెరవేరలేదు. మొదట బాధ అనిపించింది. అయితే ఆ బాధలో నుంచి త్వరగా కోలుకున్నాను. మాస్టర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్‌పై దృష్టి పెట్టాను. మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్–సాల్వింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాను’ అంటున్న శైలిమ శ్రీవాస్తవ రెండవ ప్రయత్నంలో విజయం సాధించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోవాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఖుష్బు గుప్తా గూగుల్‌లో ఉద్యోగం చేయాలనే తన కలను నెరవేర్చుకుంది.
సవాళ్లను అధిగమిస్తే విజయం ఎప్పుడూ మనదే అవుతుంది. ‘గూగుల్‌లో చేరిన కొత్తలో చాలా మిస్టేక్స్ చేసేదాన్ని. అయితే సీనియర్‌ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ద్వారా తప్పులు జరగకుండా జాగ్రత్త పడడం నేర్చుకున్నాను’ అంటుంది ఖష్బు గుప్తా.
అమెజాన్ పాపులర్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ను మన దేశంలో లాంచ్ చేసిన బృందంలో లీలా సోమశేఖర్ ఒకరు. అమెజాన్‌లో పనిచేయాలనేది ఆమె కల. కంటెంట్ ఎడిటర్‌గా అమెజాన్‌లో అడుగులు మొదలు పెట్టిన లీల ఆ తరువాత ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్‌లోకి వచ్చింది. ‘ఆన్‌ది–జాబ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది’ అంటున్న లీల సక్సెస్ మంత్రకు ఇచ్చే నిర్వచనం... కొత్తగా ఆలోచించడం. చిన్న వయసులోనేపోలియో బారిన పడిన రేఖాపోడ్వాల్‌కు వీల్ చైర్‌పై ఆధారపడడం తప్పనిసరి అయింది. అయితే ఏదో సాధించాలనే తపన మాత్రం గట్టిగా ఉండేది. ఆ తపనే ఆమెను అమెజాన్ ఇండియా స్టార్ ఉద్యోగులలో ఒకరిగా చేసింది.
‘కలను నెరవేర్చుకోవడానికి అదృష్టం, అల్లావుద్దీన్ అద్భుతదీపంతో పనిలేదు. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ఆత్మవిశ్వాసం ఉంటే చాలు’ అంటుంది పుణెకు చెందిన రేఖాపోడ్వాల్.
సుందర సందేశం..
ఇటీవల గూగుల్ సీయీవో సుందర్ పిచాయ్‌ని యూట్యూబర్ వరుణ్ మయ్యా ‘ఫాంగ్’కు సంబంధించి యువత కల గురించి అడిగినప్పుడు అమీర్ ఖాన్ బ్లాక్‌బాస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’లోని ఒక సన్నివేశాన్ని గురించి ప్రస్తావించాడు పిచాయ్. ‘ఆ సీన్‌లో మోటర్ అంటే ఏమిటో వివరించే వెర్షన్ ఉంది. మోటర్ అంటే ఏమిటో అర్థం చేసుకునే వెర్షన్ ఉంది. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారానే నిజమైన విజయం లభిస్తుంది’ అంటాడు సుందర్ పిచాయ్. సినిమా సీన్ విషయానికి వస్తే ‘మెషిన్ అంటే ఏమిటో నిర్వచనం చెప్పండి’ అనిప్రొఫెసర్ అడిగిన దానికి అమీర్ సింపుల్‌గా చెప్పిన సమాధానం, ‘మెషిన్స్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ బాడీస్ సో కనెక్టెడ్ దట్ రిలేటివ్ మోషన్స్....’ అంటూ మార్కులు బాగా తెచ్చుకునే స్టూడెంట్ చెప్పిన సుదీర్ఘ, సంక్లిష్ట నిర్వచనం... ఒక విషయాన్ని వివరించడానికి, అర్థం చేసుకోడానికి మధ్య ఉండే తేడాను తెలియజేస్తుంది.
ధైర్యమే దారి చూపుతుంది..
కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన సోనాక్షి పాండే స్వభావరీత్యా సిగ్గరి. ఇంట్రావర్ట్. నలుగురిలో ధైర్యంగా మాట్లాడేది కాదు. డేటాబేస్ గురించి ఒక చర్చాకార్యక్రమంలో టెక్ ఎక్స్‌పర్ట్ ఒకరు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న, చర్చిస్తు్తన్న యూట్యూబ్ వీడియోను చూసింది పాండే. ఈ వీడియో ఆమె కెరీర్ గమనాన్ని మార్చేసింది. ఈ వీడియోతో ఇన్‌స్పైర్ అయిన పాండే నలుగురిలో ధైర్యంగా మాట్లాడడం అలవాటు చేసుకుంది. అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయింది. ఆ తరువాత అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నుంచి సొల్యూషన్ ఆర్కిటెక్చర్‌లోకి వచ్చింది. ఇందులో పబ్లిక్ స్పీకింగ్, క్లయింట్ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అయిదు సంవత్సరాలు అమెజాన్‌లో పనిచేసిన తరువాత మైక్రోసాఫ్ట్, గూగుల్‌కు అప్లై చేసింది. రెజ్యూమ్‌లోని కీ ఎలిమెంట్స్ వల్ల రెండు దిగ్గజ సంస్థల్లోనూ పాండేకు ఉద్యోగం వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment