రాజుల కోటలు, ప్యాలస్‌ల వైభవాన్ని మన ఇంటికీ తీసుకురావచ్చు మ్యూరల్స్‌తో! చిన్న చిన్న ఆర్ట్ పీస్‌ల నుంచి గోడ మొత్తం పరచుకునేలా రూపుదిద్దుకునే మ్యూరల్స్ ఇప్పుడు ఇంటీరియర్‌లో అందమైన పాత్రను పోషిస్తున్నాయి. మన అభిరుచి.. సృజనకు అద్దం పడుతున్నాయి.
మ్యూరల్స్‌ని గోడ లేదా పైకప్పుకు డిజైన్ చేసే ఒక గ్రాఫిక్ ఆర్ట్‌గా చెప్పవచ్చు. ఖాళీ గోడను కాన్వాస్‌గా మార్చే అద్భుతమైన కళ ఇది. చిన్న చిన్న ఆకృతుల నుంచి గ్రాండ్ స్టేట్‌మెంట్ వరకు, పారిస్ వీధుల నుంచి మాల్దీవుల ప్రశాంతమైన బీచ్‌ల వరకు కళ్లను కట్టిపడేసే గ్రాఫిక్స్‌ను గోడల మీద కొలువుదీరుస్తుంది. మరో ప్రపంచానికి కిటికీ వంటిదిగా పేరొందిన ఈ కళ ద్వారా ఒక కథనే చెప్పవచ్చు.
మ్యూరల్స్.. వాల్‌పేపర్స్..
మ్యూరల్స్ వ్యయప్రయాసలతో కూడుకున్నవనిపిస్తే వాటిని తలపించే వాల్ పేపర్స్‌ని ఎంచుకోవచ్చు. నచ్చిన ఆకృతులు, దృశ్యాల వాల్ పేపర్స్ లివింగ్ రూమ్, ఆఫీసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జలపాతాలు, పచ్చటి మైదానాలతో పెయింట్ అయిన వాల్ పేపర్స్ ఏ గదినైనా ప్రశాంతంగా కనిపించేలా చేస్తాయి. గెలాక్సీలు, కోటలతో వాల్ పేపర్స్ పిల్లల గదులను మురిపిస్తాయి. వీటిని మార్చేసుకోవడమూ సులువే. కాబట్టి మ్యూరల్స్ భారం అనుకున్న వాళ్లు వాల్ పేపర్స్‌కి స్టిక్ అవొచ్చు.
మ్యూరల్స్‌కే ఓటు వేసే వాళ్లు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి..
కుడ్యచిత్రాలను స్థలాన్ని బట్టి డిజైన్ చేయించుకునే వీలుంటుంది. విశాల మైదానాలున్న కుడ్యచిత్రాల అలంకరణ వల్ల ఆ గది కూడా విశాలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
ముదురు రంగులు పెద్ద పెద్ద హాల్స్‌కు బాగుంటాయి. చిన్న గదులకైతే లైట్ షేడ్స్‌నే ఎంచుకోవాలి.
నిర్వహణ విషయానికొస్తే.. కుడ్యచిత్రం తాజాగా కనిపించాలంటే మెత్తని తడిగుడ్డతో తుడిస్తే సరిపోతుంది. ఆ కళాఖండం దీర్ఘకాలం మన్నాలంటే రసాయనాలు, స్క్రబ్స్ వంటివి వాడకూడదు.
మ్యూరల్ పెయింటింగ్ డిజైన్స్‌ని చిత్రించి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో గోడలను కళాఖండాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీటిలో రంగులే కాదు ఎలక్ట్రిక్ వెలుగులూ జతచేరాయి కొత్తగా!
Comments
Please login to add a commentAdd a comment