Postmortem room
-
రోడ్డు విస్తరణలో సగానికి కోల్పోయిన మార్చురీ గది
కొమరం భీమ్: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీ గది నిర్వహణ కొరవడడంతో అధ్వానంగా తయారైంది. సరైన వసతి, సౌకర్యాలు లేక మృతదేహాలను భద్రపర్చలేని దుస్థితి. పోస్టుమార్టం నిర్వహణకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కనీస సదుపాయాలు లేక మార్చురీ సమస్యలకు నిలయంగా మారింది. దశాబ్దాలుగా తీవ్ర నిరాదరణకు గురవుతోంది. సదుపాయాల కల్పనలో అంతులేని నిర్లక్ష్యం జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు విస్తరణలో... జాతీయ రహదారి విస్తరణ మార్చురీ గదికి శాపమైంది. హైదరాబాద్–చంద్రపూర్ జాతీయ రహదారి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ముందు నుంచి వెళ్తోంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మార్చురీ గది సగం వరకు కోల్పోవాల్సి వచ్చింది. ప్రహరీని పూర్తిస్థాయిలో పడగొట్టారు. ఈ పరిణామాల క్రమంలో గది అనివార్యంగా రోడ్డెక్కింది. జాతీయరహదారికి అనుబంధంగా ఏర్పాటు చేసిన సర్వీసు రోడ్డు భూభాగంలోకి వచ్చేసింది. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ఆరుబయటే మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా పట్టింపులేని ధోరణి ప్రదర్శిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పడిపోతున్న ప్రహరీ ఏరియా ఆస్పత్రికి దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రహరీ క్రమంగా కూల్చివేతకు గురై ఆనవాళ్లు లేకుండా పోతోంది. ప్రస్తుతం ఆస్పత్రి ముందు భాగంలో ఉన్న ప్రహరీ జాతీయ రహదారి విస్తరణలో కూల్చివేతకు గురైంది. పాత భవనం పక్కనున్న ప్రహరీని రాకపోకలు సాగించడానికి వీలుగా కొందరు పడగొట్టారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో మూగజీవులు సంచరిస్తున్నాయి. ప్రహరీని పునర్నిర్మించాల్సి ఉండగా పట్టింపులేని ధోరణి ప్రదర్శిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపాం జాతీయ రహదారి విస్తరణలో మార్చురీ గది సగం వరకు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పోస్టుమార్టం చేయడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొత్త గది నిర్మాణానికి, మార్చురీలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం, కూల్చివేతకు గురైన ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు నాలుగు నెలల క్రితం ప్రతిపాదనలు పంపాం. ఇంత వరకు నిధులు మంజూరు కాలేదు. ఎమ్మెల్యే వినోద్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. – డాక్టర్ జీ.రవి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, బెల్లంపల్లి మృతదేహాల స్టోరేజీ ఏదీ? పోస్టుమార్టం గదిలో మృతదేహాలను భద్రపర్చడానికి కనీసం నాలుగైదు బాడీఫ్రీజర్లు అందుబాటులో ఉంచాల్సి ఉండగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. నెలకు గరిష్టంగా 20 వరకు మృతదేహాలు బెల్లంపల్లి మార్చురీకి వస్తుంటాయి. రైలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను కొన్నిరోజుల పాటు మార్చురీలో భద్రపర్చాల్సి ఉంటుంది. ఒక్కోసారి రెండు, మూడు వరకు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు వస్తుంటాయి. వీటిని భద్రపర్చడానికి బాడీఫ్రీజర్లు అవసరం. అవి లేకపోవడంతో మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వేసిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పాలకులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్చురీలో ఏసీ, ఇతర సౌకర్యాలు కల్పించడంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా మృతదేహాల నుంచి వెలికి తీసిన ఆర్గాన్స్‌ను భద్రపర్చడానికి పోస్టుమార్టం గదికి అనుబంధంగా ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆఊసే లేకుండా పోయింది. -
శవాల విందు !
కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో శవాలకూ రక్షణ లేకుండా పోయింది. ప్రమాదంలో మరణించినా.. ఆత్మహత్యల కేసుల్లోనూ.. రోగులు మృతి చెందినా.. పోస్టు మార్టం మరుసటి రోజుకు వాయిదా పడిం దంటే చాలు.. శవం మార్చురీ గదికి వెళ్లిందో.. అక్కడ పందికొక్కులు రెడీగా ఉంటాయి పీక్కు తినడానికి .. ఈ వేదనా భరిత దుస్థితికి మృతుల బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందికొక్కులే అతిథి దేవుళ్లు వేదిక : కామారెడ్డి ఏరియా ఆస్పత్రి, మార్చురీ గది కామారెడ్డి :రోగులే కాదు.. శవాలు కూడా ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనేంతటి దుస్థితి నెలకొంది కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో ! రోగుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు చివరకు శవాల విషయంలోనూ అంతకన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో వృతిచెందిన ఒక వ్యక్తి శవాన్ని పోస్టుమార్టం గదిలో పందికొక్కులు, ఎలుకలు పీక్కుతిన్న ఘటనే నిదర్శనం. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణ నడిబొడ్డున ఉన్న ఏరియా ఆస్పత్రిలో అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. కామారెడ్డి మీదుగా జాతీయరహదారి, రైల్వేబ్రాడ్గేజ్ లైన్‌తో పాటు రాష్ట్రీయ రహదారులు వెళతాయి. దీంతో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతుంటాయి. దానికి తోడు ఆత్మహత్యలు, హత్యల కేసులూ ఎక్కువే. ప్రమాదాల్లోగాని, ఆత్మహత్యలు, హత్య ఘటనల్లో గాని చనిపోయిన వారి శవాలను ఏరియా ఆస్పత్రికి తీసుకువస్తారు. రోజుకూ ఒకటి, రెండు శవాలు వస్తూనే ఉంటాయి. సూర్యాస్తమయం తరువాత వచ్చే శవాలను పోస్టుమార్టం గదిలో పడేస్తారు. తెల్లవారి ఆస్పత్రికి వైద్యులు వచ్చి, పోలీసుల పంచనామా ప్రక్రియలు ముగిసిన తరువాత పోస్టుమార్టం ప్రక్రియ మొదలవుతుంది. అయితే పోస్టుమార్టం గది నిర్వహణ విషయంలో ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పందికొక్కులు, ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి. పోస్టుమార్టం గదిలో ఉంచిన శవాలను కొరుక్కుతింటుండడంతో చనిపోయిన వారి కుటుంబాల వారు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమవారి ఆఖరిచూపులోనైనా వారి ముఖం చూసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి ముఖం చెదిరిపోకుండా ఉండింది. కాని పోస్టుమార్టం గదిలో తెల్లారేసరికి మొఖంపై ఉన్న చర్మాన్ని పందికొక్కులు, ఎలుకలు పీక్కుతిన్నాయి. వైద్యం కోసం వచ్చేవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు శవాల విషయంలోనూ అంతకన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఆస్పత్రి నిర్వహణకు వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల బడ్జెట్ వస్తున్నా ఆస్పత్రి ప్రధాన అధికారులు వసతుల కల్పన విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. పోస్టుమార్టం గదిలో ఫ్రీజర్లు లేవు.... గుర్తుతెలియని వృతదేహాలను భద్రపరిచేందుకు ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో ఎలాంటి ఫ్రీజర్లు లేవు. ఒక్కోసారి శవాలను నాలుగైదు రోజులు భద్రపర్చాల్సి ఉంటుంది. అయితే ఆస్పత్రిలో ఫ్రీజర్ల ఏర్పాటు విషయంలో అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. పోస్టుమార్టం గది చిన్నగా ఉండడం వల్ల ఒక్కోసారి నాలుగైదు శవాలు వస్తే వాటిని కింద పడేస్తున్నారు. పశువుల వృతదేహాల కన్నా నిర్లక్ష్యంగా శవాలను పడేస్తుండడం ఆత్మీయులను కంటతడి పెట్టిస్తోంది. ఏటా ఐదు వందల నుంచి ఆరు వందల వరకు శవాలు పోస్టుమార్టం గదికి వస్తుంటాయి. మనుషులను పట్టించుకోని అధికారులు కనీసం శవాలపైనైనా మానవతా దృక్పథం ప్రదర్శించాలని పలువురు కోరుతున్నారు.