కొమరం భీమ్: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీ గది నిర్వహణ కొరవడడంతో అధ్వానంగా తయారైంది. సరైన వసతి, సౌకర్యాలు లేక మృతదేహాలను భద్రపర్చలేని దుస్థితి. పోస్టుమార్టం నిర్వహణకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కనీస సదుపాయాలు లేక మార్చురీ సమస్యలకు నిలయంగా మారింది. దశాబ్దాలుగా తీవ్ర నిరాదరణకు గురవుతోంది. సదుపాయాల కల్పనలో అంతులేని నిర్లక్ష్యం జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రోడ్డు విస్తరణలో...
జాతీయ రహదారి విస్తరణ మార్చురీ గదికి శాపమైంది. హైదరాబాద్–చంద్రపూర్ జాతీయ రహదారి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ముందు నుంచి వెళ్తోంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మార్చురీ గది సగం వరకు కోల్పోవాల్సి వచ్చింది. ప్రహరీని పూర్తిస్థాయిలో పడగొట్టారు. ఈ పరిణామాల క్రమంలో గది అనివార్యంగా రోడ్డెక్కింది. జాతీయరహదారికి అనుబంధంగా ఏర్పాటు చేసిన సర్వీసు రోడ్డు భూభాగంలోకి వచ్చేసింది. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ఆరుబయటే మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా పట్టింపులేని ధోరణి ప్రదర్శిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పడిపోతున్న ప్రహరీ
ఏరియా ఆస్పత్రికి దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రహరీ క్రమంగా కూల్చివేతకు గురై ఆనవాళ్లు లేకుండా పోతోంది. ప్రస్తుతం ఆస్పత్రి ముందు భాగంలో ఉన్న ప్రహరీ జాతీయ రహదారి విస్తరణలో కూల్చివేతకు గురైంది. పాత భవనం పక్కనున్న ప్రహరీని రాకపోకలు సాగించడానికి వీలుగా కొందరు పడగొట్టారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో మూగజీవులు సంచరిస్తున్నాయి. ప్రహరీని పునర్నిర్మించాల్సి ఉండగా పట్టింపులేని ధోరణి ప్రదర్శిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపాం
జాతీయ రహదారి విస్తరణలో మార్చురీ గది సగం వరకు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పోస్టుమార్టం చేయడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొత్త గది నిర్మాణానికి, మార్చురీలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం, కూల్చివేతకు గురైన ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు నాలుగు నెలల క్రితం ప్రతిపాదనలు పంపాం. ఇంత వరకు నిధులు మంజూరు కాలేదు. ఎమ్మెల్యే వినోద్ దృష్టికి కూడా తీసుకెళ్లాం.
– డాక్టర్ జీ.రవి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, బెల్లంపల్లి
మృతదేహాల స్టోరేజీ ఏదీ?
పోస్టుమార్టం గదిలో మృతదేహాలను భద్రపర్చడానికి కనీసం నాలుగైదు బాడీఫ్రీజర్లు అందుబాటులో ఉంచాల్సి ఉండగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. నెలకు గరిష్టంగా 20 వరకు మృతదేహాలు బెల్లంపల్లి మార్చురీకి వస్తుంటాయి. రైలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను కొన్నిరోజుల పాటు మార్చురీలో భద్రపర్చాల్సి ఉంటుంది.
ఒక్కోసారి రెండు, మూడు వరకు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు వస్తుంటాయి. వీటిని భద్రపర్చడానికి బాడీఫ్రీజర్లు అవసరం. అవి లేకపోవడంతో మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వేసిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పాలకులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్చురీలో ఏసీ, ఇతర సౌకర్యాలు కల్పించడంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా మృతదేహాల నుంచి వెలికి తీసిన ఆర్గాన్స్‌ను భద్రపర్చడానికి పోస్టుమార్టం గదికి అనుబంధంగా ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆఊసే లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment