శవాల విందు ! | Freezers are in Postmortem room | Sakshi
Sakshi News home page

శవాల విందు !

Published Sun, Feb 1 2015 4:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

శవాల విందు !

శవాల విందు !

కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో శవాలకూ రక్షణ లేకుండా పోయింది. ప్రమాదంలో మరణించినా.. ఆత్మహత్యల కేసుల్లోనూ.. రోగులు మృతి చెందినా.. పోస్టు మార్టం మరుసటి రోజుకు వాయిదా పడిం దంటే చాలు.. శవం మార్చురీ గదికి వెళ్లిందో.. అక్కడ పందికొక్కులు రెడీగా ఉంటాయి పీక్కు తినడానికి .. ఈ వేదనా భరిత దుస్థితికి మృతుల బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
పందికొక్కులే అతిథి దేవుళ్లు
వేదిక : కామారెడ్డి ఏరియా ఆస్పత్రి, మార్చురీ గది

కామారెడ్డి :రోగులే కాదు.. శవాలు కూడా ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనేంతటి దుస్థితి నెలకొంది కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో !  రోగుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు చివరకు శవాల విషయంలోనూ అంతకన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో వృతిచెందిన ఒక వ్యక్తి శవాన్ని పోస్టుమార్టం గదిలో పందికొక్కులు, ఎలుకలు పీక్కుతిన్న ఘటనే నిదర్శనం.

మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణ నడిబొడ్డున ఉన్న ఏరియా ఆస్పత్రిలో అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. కామారెడ్డి మీదుగా జాతీయరహదారి, రైల్వేబ్రాడ్‌గేజ్ లైన్‌తో పాటు రాష్ట్రీయ రహదారులు వెళతాయి. దీంతో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతుంటాయి. దానికి తోడు ఆత్మహత్యలు, హత్యల కేసులూ ఎక్కువే. ప్రమాదాల్లోగాని, ఆత్మహత్యలు, హత్య ఘటనల్లో గాని చనిపోయిన వారి శవాలను ఏరియా ఆస్పత్రికి తీసుకువస్తారు. రోజుకూ ఒకటి, రెండు శవాలు వస్తూనే ఉంటాయి.

సూర్యాస్తమయం తరువాత వచ్చే శవాలను పోస్టుమార్టం గదిలో పడేస్తారు. తెల్లవారి ఆస్పత్రికి వైద్యులు వచ్చి, పోలీసుల పంచనామా ప్రక్రియలు ముగిసిన తరువాత పోస్టుమార్టం ప్రక్రియ మొదలవుతుంది. అయితే పోస్టుమార్టం గది నిర్వహణ విషయంలో ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పందికొక్కులు, ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి. పోస్టుమార్టం గదిలో ఉంచిన శవాలను కొరుక్కుతింటుండడంతో చనిపోయిన వారి కుటుంబాల వారు మానసిక క్షోభకు గురవుతున్నారు.

ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమవారి ఆఖరిచూపులోనైనా వారి ముఖం చూసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి ముఖం చెదిరిపోకుండా ఉండింది. కాని పోస్టుమార్టం గదిలో తెల్లారేసరికి మొఖంపై ఉన్న చర్మాన్ని పందికొక్కులు, ఎలుకలు పీక్కుతిన్నాయి. వైద్యం కోసం వచ్చేవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు శవాల విషయంలోనూ అంతకన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఆస్పత్రి నిర్వహణకు వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల బడ్జెట్ వస్తున్నా ఆస్పత్రి ప్రధాన అధికారులు వసతుల కల్పన విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు.
 
పోస్టుమార్టం గదిలో ఫ్రీజర్లు లేవు...
.
గుర్తుతెలియని వృతదేహాలను భద్రపరిచేందుకు ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో ఎలాంటి ఫ్రీజర్లు లేవు. ఒక్కోసారి శవాలను నాలుగైదు రోజులు భద్రపర్చాల్సి ఉంటుంది. అయితే ఆస్పత్రిలో ఫ్రీజర్ల ఏర్పాటు విషయంలో అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. పోస్టుమార్టం గది చిన్నగా ఉండడం వల్ల ఒక్కోసారి నాలుగైదు శవాలు వస్తే వాటిని కింద పడేస్తున్నారు.

పశువుల వృతదేహాల కన్నా నిర్లక్ష్యంగా శవాలను పడేస్తుండడం ఆత్మీయులను కంటతడి పెట్టిస్తోంది. ఏటా ఐదు వందల నుంచి ఆరు వందల వరకు శవాలు పోస్టుమార్టం గదికి వస్తుంటాయి. మనుషులను పట్టించుకోని అధికారులు కనీసం శవాలపైనైనా మానవతా దృక్పథం ప్రదర్శించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement