corpses
-
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. శవాలను భద్రపరిచే కెమికల్ కలుపుతూ..
సాక్షి, నల్గొండ: అధికారుల ఉదాసీన వైఖరిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సంపాదనే ధ్యేయంగా తాగే నీటి నుంచి పాలు, అల్లం తదితర నిత్యావసరాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. బీబీనగర్ మండలం హైదరాబాద్ దగ్గరగా ఉండడాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు పాలను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ పదార్థాలను మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లతో పాటు హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. దీంతో బీబీనగర్ మండలం రోజురోజుకు కల్తీకి కేరాఫ్‌గా మారుతోంది. భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామంలో కల్తీ పాల తయారీ ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శవాలను భద్రపరిచే కెమికల్ కలుపుతూ.. గతంలో మండలంలోని బీబీనగర్, జైనపల్లి, కొండమడుగు గ్రామాల్లోని కొందరు అక్రమార్కులు పొలాల్లో చల్లే యూరియా వాడి పాలను కల్తీ చేసేవారు. ఇప్పుడు ఏకంగా మనుషుల శవాలను భద్రపరిచేందుకు వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను కలుపుతుండటాన్ని ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తాజాగా మండలంలోని మొబైల్ టెస్టింగ్ వ్యాన్‌తో చేపట్టిన తనిఖీల్లో బయటపడింది. కొండమడుగు గ్రామంలోని ఓ పాల వ్యాపారి తన పాల సేకరణ సెంటర్లో పాలు పగలకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా మార్చురీల్లో మృతదేహాలు కుళ్లిపోకుండా వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను వాడుతున్నట్లు తేలింది. దాంతో పాటు పాలల్లో నీళ్లతో పాటు సుక్రోజ్, అమ్మోనియం సల్ఫేట్‌ను కలిపి అధికంగా పాలను తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చదవండి: మలక్‌పేట్‌లో బాలింతల మృతిపై ప్రాథమిక నివేదిక.. కారణాలివే.. నెమురుగొముల పరిధిలో బయటపడిన కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ (ఫైల్) అల్లం, నీళ్ల బాటిళ్లు సైతం పాల కల్తీతో పాటు కూరల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ సైతం కల్తీ చేసి విక్రయించడాన్ని గతంలో నెమురగొముల గ్రామ పరిధిలో పోలీసులు గుర్తించారు. కుళ్లిపోయిన అల్లం, ఎల్లిగడ్డలను మిషన్లలో వేసి అది పాడవకుండా పేస్ట్‌లో కెమికల్‌ను వాడుతున్నట్లు తేలింది. అలాగే బీబీనగర్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు విక్రయించే వాటర్ బాటిళ్ల విషయంలో చిరు వ్యాపారులు కల్తీకి పూనుకున్నారు. కిన్లీ, బిస్లరీ స్లిక్కర్లతో కూడిన వాటర్ బాటిళ్లను సేకరించి వాటిలో మామూలు వాటర్‌ను నింపి విక్రయించారు. ఈ విషయాన్ని పోలీసులు గతంలో వెలుగులోకి తెచ్చారు. ఇలా మండలంలో ఒకదాని తర్వాత మరొకటి కల్తీ వ్యాపారం బయటపడుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కల్తీ జరగకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఉన్న బాటిళ్లలో మామూలు వాటర్‌ను నింపి అమ్ముతున్న అక్రమార్కులు (ఫైల్) తనిఖీలు ముమ్మరం చేస్తాం గ్రామాల్లో పాల కల్తీకి పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు తనిఖీలను ముమ్మరం చేస్తాం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా కల్తీ పాలు తయారు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయిస్తాం. పాలు, ఇతర ఫుడ్ తయారీకి సంబంధించిన విషయాల్లో అనుమానం వస్తే మాకు సమాచారం ఇవ్వాలి. – జ్యోతిర్మయి, జిల్లా జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ -
హెలికాప్టర్ ప్రమాదం: పార్థివ దేహాలను తరలిస్తున్న అంబులెన్స్‌కు యాక్సిడెంట్
చెన్నై: తమిళనాడులోని కున్నూరులో బుధవారం జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో 13 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటన పార్థివ దేహాలను తరలిస్తుండగా అంబులెన్సుకు ప్రమాదం జరిగింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను ఢిల్లీకి తరలించేందుకు గురువారం కున్నూర్ నుంచి సూలూరు ఎయిర్‌బేస్‌కు అంబులెన్సుల్లో తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు వద్ద ఓ అంబులెన్సు ముందుగా వెళ్తున్న మరో అంబులెన్సును అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో కొందరు పోలీసులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే ప్రమాదానికి గురైన అంబులెన్సులోని పార్థివ దేహాలను మరో అంబులెన్సులోకి ఎక్కించారు. శుక్రవారం ఢిల్లీలో బిపిన్ రావత్ అంత్యక్రియలు జరగనున్నాయి. -
Mumbai mayor: కోవిడ్ మృతులను పడేసేందుకు ఇక్కడ నదులు లేవండి
ముంబై: కోవిడ్-19 మరణాలను ముంబై తక్కువ చేసి చూపించడంలేదని లేదని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ స్పష్టం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. నగరంలో కోవిడ్ మృతులు డేటాను రహస్యంగా కప్పిపెట్టలేదన్నారు. మృతదేహాలను డంప్ చేయడానికి మాకు ఇక్కడ నదులు లేవని వ్యంగ్యంగా స్పందించారు. కాగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్‌లో పలు చోట్ల శవాలు నదిలో తేలుతూ కనిపించగా, మరి కొన్ని నది ఒడ్డున కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ముంబైలో కోవిడ్ మృతులను గుట్టుచప్పడుకాకుండా పడేసేందుకు ఇక్కడ నది లేదన్నారు. ముంబైలో కోవిడ్ వల్ల చనిపోతున్నవారి వివరాలను మూడు ప్రదేశాల్లో నమోదు చేస్తున్నారని, అందుకే ఎక్కడా డేటాను దాచిపెట్టేదిలేదని ఆమె అన్నారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ ఇలా కౌంటర్ ఇచ్చారు. కాగా బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఇంతకుముందు పౌరసంఘం, మహారాష్ట్ర ప్రభుత్వం మరణాల డేటాను తప్పుగా చూపిస్తున్నాయని ఆరోపించారు. మహమ్మారి కారణంగా మహారాష్ట్ర అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అక్కడ సెకండ్ వేవ్ మొదట్లో రోజువారీ కేసులు, మరణాలు పెరుగుతూ ఆందోళన కలిగించగా, ప్రస్తుతం అక్కడ పరిస్థితిలో స్థిరమైన మెరుగుదల కనిపిస్తోంది. చదవండి: పంజాబ్‌లో మరోసారి రాజుకున్న పోస్టర్ వివాదం.. -
మృతదేహాల ద్వారా కరోనా వ్యాపించదు
ముంబై : కరోనా వైరస్ బాధితుల మృతదేహాలను పూడ్చేందుకు అవసరమైన శ్మశాన వాటికలను గుర్తించే అధికారం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు ఉందని ముంబై హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. శవాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిరూపించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారలు లేవని న్యాయస్థానం పేర్కొంది. కరోనా కారణంగా మరణించిన వ్యక్తుల మృతదేహాలను పూడ్చేందుకు 20 శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని ముంబై కార్పొరేషన్ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. (వలస కార్మికులకు అండగా హైకోర్టులు) అయితే బీఎంసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సబర్బన్ బాంత్రా నివాసి ప్రదీప్ గాంధీ ఏప్రిల్ 9న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్ఎస్ షిండేలతో కూడిన ధర్మాసనం కరోనా మృతదేహాల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేనందున పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. (డబ్ల్యూహెచ్ఓలో కీలక బాధ్యతలు చేపట్టిన భారత్) బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ప్రకటన చట్టానికి అనుగుణంగానే ఉందని, కరోనా రోగుల మృతదేహాలను పూడ్చేందుకు కావాల్సిన శ్మశానవాటికలను గుర్తించడానికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు అధికారం ఉందని కోర్టు తీర్పు వెల్లడించింది. కరోనా సోకిన మృతదేహాలను సురక్షితంగా పూడ్చేందుకు కార్పొరేషన్, ఇతర అధికారులు భారత ప్రభుత్వం అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించిన మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. (పలాసలో బుక్‌చేస్తే.. ఢిల్లీలో గుర్తించారు) -
‘పెద్దింటి అల్లుడవుతున్నాడని ఈర్ష్య పడ్డానేమో.. అందుకే’
జీవితమైనా మాటైనా సరైన రూట్లో వెళ్లాలి. జీవితం తూలినా మాట తూలినా భవిష్యత్తు చతికిల పడుతుంది. చట్టం చుట్టుముడుతుంది. ‘దీపికా ఎందుకంతగా భయపడతావు. ఈ రోజే మీ వాళ్లతో మాట్లాడతాను. ఒప్పుకోక ఏం చేస్తారు? కాదంటే ఎటైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం. సరేనా’ కళ్లనీళ్లతో ఉన్న దీపికకు ధైర్యం చెబుతూ అన్నాడు కుమార్. ‘ఒప్పుకుంటారని ఎలా అంటావు. ఆల్రెడీ నీ మీద కేసు పెట్టి లోపలేయించారు. మీ వాళ్లు ఏదో చేసి బయటకు తెచ్చారు. నువ్వు మారలేదు. నేను మారలేదు. మన ప్రేమ ఇంకా పెరిగింది. నువ్వు లేకుండా నేను బతకలేను కుమార్’ అంది దీపిక ఏడుస్తూ. ‘భయపడకు. మన ప్రేమలో నిజాయితీ ఉంది. తప్పక మనం ఒకటవుతాం’ అన్నాడు కుమార్. దీపిక హుజురాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కుమార్ ఓ సెల్‌ఫోన్ షాప్‌లో జాబ్ చేస్తున్నాడు. ఇద్దరికీ ఏడాది క్రితం పరిచయం అయ్యింది. పరిచయం కాస్తా స్నేహంగా, ప్రేమగా మారింది. తమ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఏమంటారోనని దీపిక భయపడుతోంది. అలా ఏమీ జరగదని దీపికకు ధైర్యం చెబుతూ వస్తున్నాడు కుమార్. దీపిక –కుమార్‌లు మళ్లీ కలిసి తిరుగుతున్నట్టు దీపిక తండ్రికి తెలిసింది. ‘నిన్ను చంపేస్తాను. చదువుకోమని పంపితే పుస్తకాలు వదిలిపెట్టి బేవార్స్ పనులు చేస్తున్నావా? సెల్ఫోన్లు రిపేర్ చేసుకునేవాడితో ప్రేమేంటే?’ కూతురుపై అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. దీపిక తాత, మేనమామ సర్దిచెప్పారు. దీపిక పెదనాన్నలు కూడా ‘ఏందిరా.. బిడ్డ మీద అలాగేనా నోరేసుకునేది. దానికేం తెలుసు పెద్ద పెద్ద విషయాలు.మనమే చక్కదిద్దాల. పిల్లోడ్ని పిలిపించి అన్నీ సరే అనుకుంటే లగ్గం చేద్దాం’ అన్నారు. అన్నల మాటలకు దీపిక తండ్రి వాళ్లవైపు చూశాడు. అతనికి ఏదో అర్థమైంది.‘సరే’ అని నెమ్మదించాడు.‘అన్నీ ఆలోచించి చేద్దాం’ అంటూ చుట్ట వెలిగించుకుంటూ వాకిట్లోకి వెళ్లాడు దీపిక తాత. ‘చూడబ్బీ.. పిలవగానే వచ్చినవ్. మాకు మీ ప్రేమ విషయం అర్థమైంది. మంచి పిల్లోడివి కాబట్టే మా చిట్టితల్లి నిన్ను ఇష్టపడింది. గతంలో జరిగినవి మనసుల పెట్టుకోకు. మీ పెళ్లి మేం జరిపిస్తం.భయాలేవీపెట్టుకోవద్దు సరేనా!’ అన్నాడు దీపిక తాత. ‘మైనర్ అయిన అమ్మాయిని మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వంచిస్తున్నాడ’ని ఆరు నెలల క్రితం కుమార్ మీద కేసు పెట్టింది దీపిక తాతే.‘కేసు విషయం పట్టించుకోవద్దు. ఎలా కాదనుకున్నా మా ఇంటి అల్లుడివి. మంచి ముహూర్తం పెట్టి మేమే నిన్ను పిలుస్తాం’ అన్నారు దీపిక పెదనాన్నలు. కుమార్ సంతోషంగా తలవూపి ఇంటి దారి పట్టాడు. అక్టోబర్ 9, 2018.కరీంనగర్ జిల్లా శంకరపట్నం.తెల్లవారుజాము.అప్పుడప్పుడే వెలుతురు విచ్చుకుంటోంది.ఎంగిలిపూల బతుకమ్మ కోసం ఊరి జనం అడవి పూల సేకరణలో పోటీపడుతున్నారు. అరుణ అనే మహి తమ పత్తి చేనులోకి పత్తిపువ్వులను తెంపుకు రావడానికి వెళ్లింది. నాలుగైదు పువ్వులను తెంపిందో లేదో ఎదురుగా కనిపించిన దృశ్యానికి షాకై ఆ పువ్వులను అక్కడే పడేసి ఊరివైపుగా పరిగెత్తింది.అరుణ చెప్పిన విషయం వింటూనే ఊరి జనం పరుగున పత్తిచేనువైపుగా వచ్చారు. అక్కడ ఒక యువకుడి శవం. చిన్న ఊరు అది. మనిషిని పోల్చడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ శవం కుమార్‌ది. అంతే. ఆ వార్త వినగానే అతని తల్లీదండ్రి కంటిమింటికీ ఏడుస్తూ వచ్చారు. చుట్టూ మూగిన జనంలో ఎన్నో సందేహాలు.ఏం జరిగింది..? ఎలా జరిగింది..? కుమార్‌ని ఎవరైన హత్య చేశారా? లేక అతనే ఆత్మహత్య చేసుకున్నాడా? అందరిలోనూ అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. పోలీసులు వచ్చారు. వారిని చూడటంతోటే కుమార్ బంధువులు ఊరి జనం తిరగబడ్డారు.‘బంగారంలాంటి పిల్లాణ్ణి ప్రేమించాడని చంపేస్తే తీరిగ్గా ఇప్పుడొస్తున్నారు. తప్పుడు కేసు పెట్టి లోపల వేయించినప్పుడే వాళ్లను మీరు కంట్రోల్ చేయాల్సింది’ అని పోలీస్ జీపు మీద రాళ్ల వర్షం కురిపించారు.దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా ఎఫ్.ఐ.ఆర్ రాశారు. అయినా జనం శాంతించ లేదు. ఉన్నతాధికారులు వచ్చి ఊరిజనాన్ని సమాధానపరిచి, హంతుకులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో సర్దుకున్నారు. కుమార్ పడున్న చోట అతని సెల్‌ఫోన్ ఒకటే ఆధారంగా దొరికింది. అందులోని కాల్‌డేటా పరిశీలించారు. ఊరిజనంతో మాట్లాడి మరిన్ని వివరాలు రాసుకొని బయల్దేరారు. కుమార్ చనిపోయి పది రోజులు అవుతుంది. అతనిది హత్యో, ఆత్మహత్యో తేలడం లేదు. కుమార్ ఫోన్లో కాల్‌డేటా ఆధారంగా 128 మందిని దర్యాప్తు చేశారు పోలీసులు.‘సార్.. ఇది మా వాళ్ల పనే. చింతగుట్ట గుట్టల్లోకి వెళుతున్నానని నాకు లాస్ట్ ఫోన్ కాల్లో కుమార్ చెప్పాడు’ ఏడుస్తూ చెప్పింది దీపిక. పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ‘ఇది ప్రేమకు సంబంధించిన హత్య అయి ఉంటుందా?’ అని దీపిక తండ్రి, మేనమామ, పెదనాన్నల మీద నిఘా పెట్టారు. ఇంటికెళ్లి విచారణ చేశారు. వాళ్లు పొడిపొడిగా సమాధానం చెప్పారు కానీ అందులో నుంచి ఏమీ దొరకడం లేదు. తగిన ఆధారం లేకుండా అరెస్టు చేయడం ప్రమాదం. ఇప్పుడు ఆధారం ఎలా?మరో నాలుగు రోజులు గడిచాయి. కేసు మిస్టరీ ఎలా ఛేదించాలో పోలీసులకు అర్థం కాలేదు. కుమార్ లాస్ట్ఫోన్ కాల్‌ను బట్టి అతడు చింతగుట్ట గుట్టల్లోకి వెళ్లాడు.కాని ఆ గుట్టలకు వెళ్లి వెతికితే ఏమీ కనిపించలేదు... తాగేసిన సీసాలు తప్ప. ఆ ప్రాంతంలో కుర్రాళ్లు తాగాలంటే సాధారణంగా ఆ గుట్టల్లోకి వెళుతుంటారు.‘కుమార్‌కు తాగుడు అలవాటుందా?’ స్నేహితులను అడిగారు.‘అప్పుడప్పుడు తాగుతాడు సార్’ అని చెప్పారు వాళ్లు.దీనిని క్లూగా తీసుకుని ఆ చుట్టుపక్కల పల్లెల మద్యం దుకాణాల సీసీ పుటేజీ పరిశీలించారు. అక్టోబర్ 8న అర్థరాత్రి ఓ ఆటో ఆనవాలు కనిపించింది. ఆ ఆటో నంబర్ ట్రేస్ చేసి డ్రైవర్‌ను పట్టుకున్నారు.‘సార్.. ఆ రోజు కుమార్‌తో పాటు వెంకటేశం అనే అతని స్నేహితుడు ఆటో ఎక్కారు. ఇద్దరూ అప్పటికే ఫుల్లుగా తాగున్నారు. అయినా సరే గుట్ట వైపు వెళ్లి తాగాలని అనుకున్నారు. వాళ్లు చెప్పిన చోట ఆటో ఆపేశాను. ఇద్దరూ బాటిళ్లు తీసుకొని దిగారు. నన్ను వెళ్లిపొమ్మనడంతో వెళ్లిపోయాను సార్’ అన్నాడు.‘కుమార్ పోన్ స్విbŒ∙ఆఫ్ అయ్యింది 12:10 గంటల ప్రాంతం. అంటే, అప్పటి వరకు వారిద్దరూ కలిసే ఉన్నారా...’ పోలీసులకి అనుమానం వచ్చింది. ఆటో ఆనవాలు కనిపించిన కేశవపట్నం మద్యం దుకాణం వద్ద సీసీ పుటేజీ పరిశీలించారు.12:30 గంటల ప్రాంతంలో వెంకటేశ్ ఒక్కడే మళ్లీ వచ్చి బీరు బాటిల్ తీసుకున్నట్లు రికార్డు అయ్యింది. ‘ఇక్కడే ఏదో తేడా కొడుతోంది. ఇద్దరుగా వెళ్లి ఒక్కడే ఎందుకు వచ్చాడు?’పోలీసులు వెంటనే వెంకటేశ్‌ను పట్టుకొచ్చారు. ‘సార్... నాకే పాపం తెలియదు. కుమార్‌ను వాళ్ల ఇంటిదగ్గరే దింపి వెళ్లిపోయాను’ అన్నాడు వెంకటేశ్. పోలీసులు సరైన ‘విచారణ’ మొదలెట్టే సరికి అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.‘సార్... దీపిక ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకున్నారన్న సంతోషంతో కుమార్ పార్టీకి పిలిచాడు. నేను వెళ్లాను’‘తర్వాత?’‘ఇద్దరం వైన్‌షాప్ దగ్గరే తాగాం. ఇంకా తాగుదాం అన్నాడు కుమార్.సరే అని రెండు బీరు బాటిళ్లు తీసుకుని గుట్ట వైపు వెళ్లడానికి ఆటో ఎక్కాం. కాని మధ్యలోనే పత్తి చేను దగ్గర దిగేశాం’‘ఊ...’‘నా ఆలోచన ఏంటంటే తొందరగా తాగేసి కుమార్‌ను ఇంటి దగ్గర దించి నేను కూడా ఇంటికి వెళ్లిపోవాలని. కాని మత్తు నా నెత్తికి ఎక్కింది. ఏం మాట్లాడుతున్నానో తెలియదు. దీపికతో ప్రేమ వరకేనా... పెళ్లికి ముందే ఇంకేమైనా చేశావా అనే అర్థంలో మోటుగా ఏదో అడిగినట్టున్నాను’...‘ఊ...’‘దానికి కుమార్‌కు కోపం వచ్చింది. పవిత్ర ప్రేమను అవమానిస్తావా అని నన్ను కొట్టాడు. నాక్కూడా చాలా కోపం వచ్చింది. కాని అసలు కారణం వేరేమో. నాలాంటి చిన్న చితకా మనిషైన కుమార్ దీపిక లాంటి మంచి అమ్మాయిని చేసుకుని పెద్దింటి అల్లుడు అవుతున్నాడని ఈర్ష్య పడినట్టున్నాను. అందుకే దారుణంగా అతడిపై దాడి చేశాను. దేంతో కొట్టానో కూడా తెలియదు. అతను చచ్చిపోయాడు. భయం వేసి శవాన్ని అక్కడే వదిలేశాను. ధైర్యం కోసం మళ్లీ వచ్చి ఒక బీరు కొనుక్కున్నాను. అలా బీరు కొనుక్కోవడం వల్లే మీకు దొరికిపోయాను’ అన్నాతడు.ఈ కేసును పోలీసులు తొమ్మిది రోజుల్లో ఛేదించారు.కాని ఒకడి క్షణికావేశం ఒక యువకుడి నూరేళ్ల జీవితాన్ని బలిగొంది. నేరస్తుడి జీవితాన్ని నాశనం చేసింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
ఆమె ఎవరు?
ఏప్రిల్ 24, 2011. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతం. ఉదయం 5.30. రాత్రి పశువుల వద్ద కాపలాగా ఉన్న కాపరి ఇంటికి బయల్దేరాడు. దారిలో ఏవో మూలుగులు వినిపించాయి. ‘ఊ...ఊ...ఊ’ కొద్దిగా రోడ్డు దిగి చూశాడు. చెట్ల వెనకాల నుంచి ఏదో కదులుతోంది. ‘ఊ...ఊ...ఊ’... మూలుగులు.భయం వేసినా చేతిలోని కర్రను గట్టిగా పట్టుకుని పొద వెనకాల ఉన్న కాలిబాట వైపుతొంగి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అదిరిపడ్డాడు. రెండు కాళ్లు తెగిపోయిన ఓ మహిళ ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని మెల్లిగా రోడ్డువైపే పాకుతోంది. ఒళ్లంతా రక్తం. చాలా దూరం పాక్కుంటూ వచ్చినట్టుంది... ఆ దారి అంతా నెత్తురు. ఉదయాన్నే ఆ భీతావహ సన్నివేశం చూసేసరికి వాంతి వచ్చినంతపనైంది. వెంటనే తనకు తెలిసిన మీడియా వ్యక్తికి ఫోన్ చేశాడు.శంషాబాద్ నగర శివారు కాబట్టి ఎక్కడో చంపి శవాలు ఇక్కడ పడేయడం సాధారణమే. అందుకే, పశువుల కాపర్లు పోలీసులకు కాకుండా ముందు మీడియాకు చెబుతారు. పశువులకాపరి చెప్పింది విని అపనమ్మకంగానే వచ్చారు మీడియా వాళ్లు. కాపరి వాళ్లను తన వెంట తీసుకెళ్లి చూపించాడు.మీడియా వాళ్లు చాలా ఘటనలు చూసి మొద్దుబారి ఉంటారు. అలాంటిది వాళ్లే ఆమెను చూసి ఒక అడుగు వెనక్కి వేశారు.‘ఈమె దగ్గరకి కుక్కలు రాకుండా ఇక్కడే ఉన్నాను సార్’ అన్నాడు కాపరి.నిమిషాల్లో పోలీసు జీపు, అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. పోలీసు వాహనం నుంచి దిగాడు ఎస్.ఐ అశోక్ కుమార్. ఆ మహిళ దగ్గరికి వేగంగా నడుచుకుంటూ వెళ్లాడు.‘ఏమ్మా... ఏమ్మా’ పిలిచాడు.అప్పటికే స్పృహ కోల్పోయింది. రక్తం మరకల ఆధారంగా చిట్టడవిలాంటి ప్రాంతంలోకి వెళ్లగా ఆమె తెగిన కాళ్లు కనిపించాయి. కానిస్టేబుళ్లను, 108 సిబ్బందిని పిలిచాడు. అంతా కలిసి తెగిన కాళ్లతోపాటు బాధితురాలిని అంబులెన్సులో ఎక్కించారు. వీలైనంత త్వరగా ఉస్మానియాకు తరలించాలని ఆదేశించాడు ఎస్.ఐ. సైరన్ మోతతో అంబులెన్స్ హైదరాబాద్ హైవే ఎక్కింది. నిమిషాల్లో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నడియీడు మహిళ కాళ్లు నరకడం, ఆమె ప్రాణాలతో పోరాడుతుండటంతో ఒక్కసారిగా మీడియా దృష్టి ఈ కేసుపై పడింది. రోజంతా ఇదే వార్తను తిప్పి తిప్పి ప్రసారం చేస్తుండటంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. క్షణాల్లో క్లూస్ టీం రంగంలోకి దిగింది. డాగ్ స్క్వాడ్‌ను కూడా రప్పించాడు ఎస్.ఐ అశోక్. సమీపంలోని పొదల్లో ఓ గ్రానైట్ రాయి దొరికింది. దానికి రక్తం అంటుకుని ఉంది. నేరస్తుడు ఉపయోగించిన ఆయుధం అన్నమాట. పోలీసు కుక్కను వదిలితే వాసన పసిగడుతూ సమీపంలోని దర్గా వద్దకు, అక్కడనుంచి శంషాబాద్ బస్టాప్ వరకు వెళ్లి ఆగింది. ‘ఏం చేద్దాం సార్’ అన్నాడు డాగ్ స్క్వాడ్ కానిస్టేబుల్ ఎస్.ఐతో.‘ఒక గ్రానైట్ రాయితో రెండుకాళ్లను పూర్తిగా తెగ్గొట్టడం మాటలు కాదు. ఒకే వ్యక్తి ఈ పని చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఒకరి కంటే ఎక్కువ మంది లేదా ఏదైనా బందిపోటు ముఠా ఈ ఘాతుకానికి పాల్పడి ఉండాలి’ అన్నాడు ఎస్.ఐ అశోక్.ఇంతలో సైబరాబాద్ కమిషనర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘అశోక్ హియర్ సార్! స్పాట్లోనే ఉన్నాను. ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేశాం’ చెప్పాడు అశోక్.‘నీకెలాంటి టీం కావాలన్నా ఇస్తా. కానీ 24 గంటల్లో నేరస్తుడు దొరకాలి’ అన్నాడు కమిషనర్. మధ్యాహ్నానికి ఫింగర్‌ఫ్రింట్స్ వచ్చాయి. ‘సార్! పాత నేరస్తుల జాబితాతో ఎక్కడా మ్యాచ్ కాలేదు’ చెప్పాడు హెడ్ కానిస్టేబుల్. ఎస్.ఐ. అశోక్ తల పంకించి ‘ఆమెను చూసి వద్దాం పదా’ అంటూ ఉస్మానియాకు బయల్దేరాడు.అప్పటికే ఆమె ఎమర్జన్సీలో ఉంది. వేగంగా వైద్యం చేస్తున్నారు డాక్టర్లు.‘కాళ్లు రెండూ నరికి చాలా సేపయింది. వాటిని అతికించలేం. సారీ’ అన్నాడు డాక్టర్ అశోక్‌తో.‘నా అంచనా ప్రకారం రాత్రి 11 నుంచి 12 గంటల మధ్యలో ఘటన జరిగి ఉంటుంది. ఇక ఆ అభాగ్యురాలికి అవిటి బతుకు తప్పదు’ నిట్టూర్చాడు డాక్టర్. ‘ఇపుడు ఆమెతో మాట్లాడొచ్చా?’ అడిగాడు ఎస్.ఐ. ‘సారీ! ప్రస్తుతం స్ప్పహలో లేదు’ బదులిచ్చాడు డాక్టర్. ‘ఆమె ఎలాగైనా కళ్లు తెరవాలి డాక్టర్. ఆమె స్టేట్మెంట్ ఇపుడు ఎంతో కీలకం’ ‘చాలా రక్తం పోవడం వల్ల స్ప్పహలో లేదు. అంతరక్తం పోయినా అసలామె ఇంతసేపు బతికి ఉండటమే చాలా గొప్ప విషయం. స్పృహ వస్తే ఇన్ఫామ్ చేస్తాను’ అన్నాడు డాక్టర్. ఎస్.ఐ. తిరిగి శంషాబాద్ పిఎస్‌కు చేరుకున్నాడు. చుట్టుపక్కల గ్రామాల్లోని పోలీసు ఇన్ఫార్మర్లు, పశువుల కాపర్లను పిలిపించాడు. అందరిదీ ఒకే సమాధానం ..‘ఆమె ఎవరో తెలియదు.’ ఆలోచనల్లో పడ్డాడు ఎస్.ఐ. బాధితురాలు ఓ నడిఈడు మహిళ. మెడలో పసుపుతాడు, కట్టుకున్న చీర ఆధారంగా పేద మహిళ అని ఇట్టే తెలిసిపోతుంది. మహిళ స్థానికురాలు కాదు. కాబట్టి పక్కనున్న బీదర్, రాయచూర్ లేదా పాలమూరు జిల్లా మహిళ అయి ఉండవచ్చని అనుమానించాడు. మిగతా పోలీస్స్టేషన్లకు ఆమె ఫొటో పంపాడు. ఎక్కడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదని తెలిసింది. మరి అయితే, ఈమె ఎవరు? ఈమె కాళ్లు నరకాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? సాయంత్రం సమయంలో ఉస్మానియా నుంచి ఫోన్ చేశాడు కానిస్టేబుల్. ‘సార్.. ఆమెకి స్ప్పహ వచ్చింది’ అన్నాడు. వాయువేగంతో ఆసుపత్రిలో వాలాడు ఎస్.ఐ. తన ఊరు, పేరు, వివరాలు చెప్పింది ఆమె. కానీ తన కాళ్లు నరికిన వ్యక్తి ఎవరో తెలియదంది. ఆ సమాధానంతో మైండ్ బ్లాంక్ అయింది ఎస్.ఐకి. అదేంటి? నీకు తెలియకుండా మీ ఊరు నుంచి ఇక్కడిదాకా అతనితో ఎందుకు వచ్చావు?’ ‘కూలి పని ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చాడు సార్!’ అని చెప్పింది. ‘వాడి వివరాలు చెప్పగలవా?’ అన్నాడు ఎస్.ఐ. వాడికి 40 ఏళ్లపైనే ఉంటాయి సార్. ఆ టైంలో తాగి ఉన్నాడు. తాగడానికి డబ్బులు కూడా నేనే ఇచ్చా. అంతకుమించి నాకేం గుర్తులేదు’ అంటూ ఏడ్వడం ప్రారంభించింది. ‘పోనీ అతని గుర్తులేమైనా చెప్పగలవా?’ ‘నాకేం గుర్తులేదు...’ మళ్లీ అదే సమాధానం.ఇక లాభం లేదనుకుని నెత్తిన క్యాప్ పెట్టుకుని ముందుకు నడిచాడు. సార్...!’ ఆమె పిలవడంతో వెనక్కి తిరిగాడు. ‘ఇపుడు గుర్తొచ్చింది.. సార్!’ అంది.విషయం విన్న ఎస్సైకి పోయిన ప్రాణం లేచివచ్చినట్లయింది. ఈ ఒక్క విషయం చాలు. వాడిని పట్టుకునేందుకు. అసలు వాడెవడో నీకు తెలియనపుడు నీ కాళ్లు నరకాల్సిన అవసరం వాడికెందుకు వచ్చింది?’ అన్నాడు ఎస్.ఐ. ‘ఏమో సార్! కూలి పని చేసుకుని బతికేదాన్ని, నా కాళ్లకు కడియాలు, పట్టీలు తప్ప మరేం లేవు’ అని మళ్లీ బోరుమంది. అంతే! ఎస్.ఐకి విషయం అర్థమైంది. శంషాబాద్‌లోని అన్ని బంగారు దుకాణాలు, కల్లు కాంపౌండ్లలో నిఘా పెట్టారు పోలీసులు. సాయంత్రం షాద్‌నగర్‌లోని ఓ కల్లు కాంపౌండ్ నుంచి ఇన్ఫార్మర్ ఫోన్ వచ్చింది. పచ్చరంగు టీషర్టు వేసుకున్న వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడన్నది ఆ కాల్ సారాంశం. పోలీసులు వెంటనే ఆ కల్లు కాంపౌండ్‌ను చుట్టుముట్టారు. అంతమంది పోలీసులు ఒకేసారి రావడంతో మందుబాబులంతా కంగారు పడ్డారు. కొందరు పరుగులు తీశారు. ఇంకొందరు పరిగెత్తలేక అక్కడే ఉన్నారు. కానీ, పోలీసులు నేరుగా వెళ్లి రాజయ్యనే పట్టుకున్నారు. పీకలదాకా కల్లు తాగిన రాజయ్యకు వచ్చింది పోలీసులన్న సంగతి కూడా తెలియట్లేదు. శంషాబాద్ పోలీస్ స్టేషన్...ఇన్వెస్టిగేషన్ రూమ్‌లో రాజయ్యకు ఎదురుగా కూర్చున్నాడు అశోక్. ‘ఇపుడు చెప్పు ఈ నేరం ఎందుకు చేశావు?’ ప్రశ్నించాడు ఎస్.ఐ. సార్... ఆ రోజు కల్లు కాంపాండ్ యజమాని పాతబాకీ కట్టకుండా కల్లు ఇవ్వనన్నాడు. దీంతో ఎవరినైనా తెలిసినవారిని డబ్బులు అడుగుదామని బస్టాప్‌దాకా వచ్చాను. అక్కడ కూలి పని కోసం ఎదురుచూస్తోన్న ఒకామె కనిపించింది. ఆమె కాళ్లకున్న కడియాలు నా కంట్లో పడ్డాయి. నేనొక మేస్త్రీని, శంషాబాద్‌లో పనిచేస్తా. నాతో వస్తే పని ఇప్పిస్తానని చెప్పా. నా మాటలు నమ్మి ఆమె నాతో వచ్చింది. ఆమె డబ్బులతోనే కల్లు కొని తాగుదామని పొదల్లోకి తీసుకెళ్లా. కల్లు తాగాక నా బుర్ర నా చేతుల్లో ఉండదు. కడియాల కోసం ఇంతపని చేశా. కడియాలు కుదవపెడితే నాలుగువేల రూపాయలు వచ్చాయి. మార్వాడీ కొట్టయితే అనుమానం వస్తుందని, తెలిసినవాడికి అమ్మేశా’ చెప్పాడు. మళ్లీ అతనే ‘సార్, ఎవరికీ తెలియకుండా ఈ పని చేశా. నన్నెలా పట్టుకున్నారు’‡ అన్నాడు.రాజయ్య కుడిచేతిని చూపిస్తూ ‘ఈ కాల్చిన గుర్తుతో’ అన్నాడు ఎస్.ఐ. ‘నీకు కామెర్లు వచ్చినపుడు నాటువైద్యం చేయించుకున్నావుగా.. అదే గుర్తు నిన్ను పట్టించింది. ఆమె ఇచ్చిన సమాచారంలో అతని కుడిచేతిమీద కాలిన గాయం తాలూకు మచ్చ ఉంది అని చెప్పింది. ఆ మచ్చ గల మనిషి ఎవరు వచ్చినా తెలియజేయమని అన్ని కల్లు కాంపౌండ్ల యజమానులకు ఇన్ఫామ్ చేశాం. రెండో క్లూ.. నీకు పనీపాటా లేదు. ఎపుడూ కల్లు కాంపౌండ్లలో అప్పు చేసి, వారిని వీరిని బతిమిలాడి తాగేవాడివి. కానీ రెండురోజులుగా నాన్‌స్టాప్‌గా తాగుతున్నావు. పాతబాకీ కట్టేశావు. ఈ రోజు ఉదయం నుంచి నీ మిత్రులకూ తాగిస్తున్నావు. చేతిలో చిల్లిగవ్వ ఉండని నువ్వు ఇంత ఖర్చు పెడుతుంటే నీ స్నేహితులకే అనుమానం వచ్చి మాకు ఉప్పందించారు..’ అన్నాడు ఎస్.ఐ. రాజయ్య తలదించుకున్నాడు.అపరిచితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించా లని ఈ కేసు మరోమారు హెచ్చరించింది. - అనిల్‌కుమార్ భాషబోయిన -
ఈ మిస్టరీ ఎందుకు వీడడం లేదు?
గుట్ట కాదు.. పుట్ట! విచారిస్తున్నాం! గుట్ట కాదు... పుట్ట! వాళ్లిద్దరూ క్లాస్మేట్స్, స్నేహితురాళ్లు. ఇద్దరూ ఒకేసారి చనిపోయారు! ఎలా చనిపోయారు? ఇంటి నుండి హాస్టల్‌కు వెళ్లాల్సినవాళ్లు... ఎందుకు వెళ్లలేదు? మధ్యలో దారి ఎందుకు మార్చుకున్నారు? ఊరి చివర గుట్ట దగ్గర.. శవాలుగా ఎందుకు కనిపించారు? చనిపోయారా? ఎవరైనా చంపేశారా? ఆర్నెల్లు గడిచినా ఈ మిస్టరీ ఎందుకు వీడడం లేదు? అడవిలో పాముల పుట్టలు ఉంటాయి. లేదంటే... చీమల పుట్టలు ఉంటాయి. కానీ ఇది పాముల పుట్ట కాదు.. చీమల పుట్ట కాదు. అనుమానాల పుట్ట. ఈ పుట్ట పగలాలి. నిజాలు బయటికి రావాలి. వరంగల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. అప్పుడే తెల్లవారింది. ఊరు మెల్లగా బద్దకాన్ని వదిలించుకుంటోంది. ఊరివాళ్లంతా పనుల్లో నిమగ్నమవుతున్నారు. అంతలో ఉన్నట్టుండి గ్రామసింహాల అరుపులతో పరిసరాలు దద్దరిల్లాయి. గుంపులు గుంపులుగా శునకాలు ఊళ్లోకి జొరబడ్డాయి. వెంటనే గ్రామస్తులు వాటిని అదిలించారు. అవి భయపడి పారిపోయాయి. కానీ వెళ్తూ వెళ్తూ తమ నోటిలో ఉన్నవాటిని వదిలేసి వెళ్లాయి. ఒకటే దుర్వాసన. ఏంటా అని చూసిన గ్రామస్థులు హడలిపోయారు. అవి మానవ శరీర అవయవాలు. కుళ్లిపోయి కంపు కొడుతున్నాయి. సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కుక్కలను అనుసరిస్తూ వెళ్లిన వాళ్లకి... గ్రామ శివారులోని ఓ గుట్ట వద్ద రెండు మృతదేహాలు కనిపించాయి. శిథిలమైన దశలో... కుక్కలు పీకేయగా ఛిద్రమైన స్థితిలో. ఘోరాతి ఘోరం... దారుణాతి దారుణం! ఆ దృశ్యం చూసి వారి మనసులు వికలమయ్యాయి. అందరిలోనూ ఒకటే ప్రశ్న. ఎవరివా దేహాలు? హాస్టల్‌కని వెళ్లి... నర్సంపేట డివిజన్లోని నల్లబెల్లి మండలం, మూడు చెక్కలపల్లిలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఒకటుంది. అందులో తొమ్మిదో తరగతి చదువుతున్నారు బానోతు భూమిక, బానోతు ప్రియాంక. ఇద్దరికీ పద్నాలుగేళ్లే. ఇద్దరూ పర్వతగిరి మండలం, నారాయణపురం గ్రామ శివారులోని కంబాలకుంట తండాకు చెందినవారే. పైగా మంచి స్నేహితులు. అందుకేనేమో... మరణంలో కూడా స్నేహం వీడలేదు. ఒక్కసారే చనిపోయారు. ఒక్కలాగే చనిపోయారు. కంబాలకుంట తండాలో 22 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. అందరూ తమకున్న కొద్దిపాటి భూమిలో పంటలు పండిస్తూ జీవితాలను సాగిస్తున్నారు. వారిలో బాలు-కమిలి, కిషన్-యాకమ్మ దంపతులు కూడా ఉన్నారు. బాలు-కమిలిలకు ఒక కొడుకు, ఒక కూతురు. ఆ కూతురే ప్రియాంక. కిషన్-యాకమ్మలకు కూడా ఒక కుమారుడు, కుమార్తె. ఆ కుమార్తెయే... భూమిక. ఎదురెదురిళ్లు కావడంతో అందరూ కలిసి మెలిసి ఉండేవారు. అందుకే అనుకుంటా... ఇరువురి ఇళ్లలోకీ విషాదం ఒక్కసారే వచ్చి చేరింది. కూతుళ్ల మరణం రూపంలో. అసలేం జరిగింది? ప్రియాంక, భూమికలిద్దరినీ ఆరో తరగతిలో ఆశ్రమ పాఠశాలలో చేర్చారు తల్లిదండ్రులు. మూడేళ్లుగా హాస్టల్లో ఉండి చదువుకుంటూ సెలవుల్లో ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఆ విధంగానే 2015లో దీపావళి సెలవులకు ముందు... ఇంటికి వచ్చారు. సెలవుల తర్వాత నవంబర్ 23న తిరిగి హాస్టల్‌కు బయలుదేరారు. కానీ హాస్టల్‌కు వెళ్లలేదు. నర్సంపేటలో దిగి జయశ్రీ థియేటర్లో మ్యాట్నీ చూశారు. ఆ తర్వాత కూడా హాస్టల్‌కి వెళ్లలేదు. ములుగు మండలం, మల్లంపల్లి శివారులోని శ్రీనగర్ గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికెళ్లారు. వాళ్ల హాస్టల్ వార్డెన్ వీరమ్మ... పిల్లలు ఇంకా రాలేదు అంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. వాకబు చేయగా బంధువుల ఇంట్లో ఉన్నారని తెలిసింది. వెంటనే హాస్టల్‌కు వెళ్లమని చెప్పారు. వెళ్లిపోతాం అన్నారు ఇద్దరూ. అన్నారే కానీ వెళ్లలేదు. అప్పుడే కాదు. ఎప్పటికీ వెళ్లలేదు. వాళ్లు ఎక్కడికి వెళ్లారో, ఏమయ్యారో ఎవరికీ తెలియలేదు. డిసెంబర్ 27న... చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట శివారులోని గుట్ట వద్ద కుళ్లిపోయిన శవాలుగా కనిపించారు. ఎన్నో అనుమానాలు... నిజానికి తల్లిదండ్రులు చెప్పగానే... అంటే నవంబర్ 24న బంధువుల ఇంటి నుంచి మల్లంపల్లికి వచ్చి, ఆర్టీసీ బస్సులో హాస్టల్‌కు బయలుదేరారు ప్రియాంక, భూమిక. తమతోపాటు ప్రయాణిస్తున్న ఓ అటవీ శాఖ ఉద్యోగి నుంచి సెల్‌ఫోన్ తీసుకుని వార్డెన్‌కు ఫోన్ చేశారు. వచ్చేస్తున్నామని చెప్పారు. కానీ వాళ్లు హాస్టల్‌కు వెళ్లలేదు. దాంతో 25న వార్డెన్ తల్లిదండ్రులకు మళ్లీ సమాచారం అందించారు. ఎంత వాకబు చేసినా పిల్లల జాడ తెలియలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పిల్లల ఫొటోలను పబ్లిక్ ప్రదేశాల్లో అతికించి, వారి ఆచూకీ తెలపమని వేడుకున్నారు. చివరికి వాళ్లని నిర్జీవులుగా చూసి అల్లాడి పోయారు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు విచారణ చేపట్టినా వాస్తవాలు కనుక్కోలేకపోయారు. మృతదేహాల పక్కన ఉన్న పురుగుల మందు డబ్బాను బట్టి వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు అన్నారే తప్ప ఏం జరిగిందో ఎంతకీ అంచనా వేయలేకపోయారు. దాంతో డీఐజీ ఈ కేసును సీఐడీకి అప్పగించారు. వాళ్లు కూడా ఈ మిస్టరీని నేటికీ ఛేదించలేకపోయారు. అసలు ప్రియాంక, భూమికలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? వాళ్లకి ఏం కష్టాలున్నాయి? ఇవి తల్లిదండ్రులు అడుగుతున్న ప్రశ్నలు. అసలివి ఆత్మహత్యలేనా అన్న ప్రశ్న కూడా చాలామంది మనసుల్లో ఉంది. దానికి కారణం లేకపోలేదు. మృతదేహాల దగ్గర ఉన్న క్రిమి సంహారక మందు డబ్బాలు కొంచెమే ఖాళీ అయ్యాయి. ఆ కాస్త తాగితేనే చనిపోతారా? పోనీ చనిపోయినా... పురుగుల మందు తాగితే కాళ్లూ చేతులూ గిలగిలా కొట్టుకుని ఉండాలి. కానీ అలాంటి ఆనవాళ్లేవీ లేవు. అమ్మాయిల వస్తువులు కొన్ని చెల్లాచెదురుగా పడివున్నాయి. కానీ అవి పడినట్టుగా కాక, కావాలని ఎవరో పెట్టినంత పద్ధతిగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే, మరణాలు అక్కడ సంభవించలేదని, వాళ్లని ఎవరైనా వేరేచోట చంపేసి అక్కడికి తెచ్చి పడేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా హాస్టల్‌కి వెళ్లాల్సిన అమ్మాయిలు మధ్యలో ఎందుకు ఆగారు? సినిమాకి వాళ్లు మాత్రమే వెళ్లారా? వాళ్లతో ఎవరైనా వెళ్లారా? తర్వాతైనా హాస్టల్‌కి వెళ్లిపోకుండా బంధువుల ఇంటికెందుకు వెళ్లారు? అక్కడేమయ్యింది? ఆ బంధువులు ఎందుకు మాట్లాడటం లేదు? అక్కడ్నుంచి బయల్దేరారని నిర్ధారణ అయ్యింది. మరి హాస్టల్కెందుకు వెళ్లలేదు? మధ్యలో ఎక్కడ ఆగారు? ఎలా అదృశ్యమయ్యారు? దీనంతటి వెనుకా ఎవరి హస్తమైనా ఉందా? ఎవరైనా నమ్మించి మోసం చేశారా? వంచించి హత్య చేశారా? అన్నీ అనుమానాలే. అవి ఇప్పటికీ నివృత్తి కాలేదు. ఎందుకంటే విచారణ ముందుకు సాగలేదు. సీఐడీ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. జిల్లా స్థాయి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటైంది. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నిరసన అంతకంతకూ ఎక్కువవుతోంది. కానీ కేసు ఇసుమంత కూడా కదల్లేదు. అడిగితే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నమంటున్నారు సీఐడీ అధికారులు. రిపోర్టు రావడానికి ఇంతకాలం పడుతుందా? ఈ కేసు ఎప్పటికి తేలుతుంది? ప్రియాంక, భూమికలకు న్యాయం జరుగుతుందా? అసలీ గుట్టు ఎప్పటికైనా వీడుతుందా?? - అబ్బు వెంకట్‌రెడ్డి, సాక్షి, నర్సంపేట, వరంగల్ న్యాయం కావాలి ‘‘ఆడబిడ్డలు లేక ఇల్లంతా సిన్నబోతోంది. మంచిగ సదివి మంచి ఉద్యోగాలు సంపాదించాలని అనుకున్నం. ఆళ్లని ఈ స్థితిలో చూస్తమని కల్లో కూడా అనుకోలేదు. అసలు మా బిడ్డలకు ఆత్మహత్యలు చేసుకునేంత ఇబ్బందులు ఏమీ లేవు. ఆల్లని ఎవరో పొట్టన పెట్టుకుని ఉంటారు. ఆరు నెలలు అయినా పోలీసోళ్లు ఎందుకు తెలుసుకుంటలేరు! ల్యాబ్ రిపోర్ట్ రాలేదని చెబుతాండ్రు. పెద్దపెద్దోళ్ల విషయంలో తొందర్నే వచ్చిన ల్యాబ్ రిపోర్టు మా బిడ్డల కాడికి వచ్చేసరికి ఎందుకు ఆలస్యమైతాందో అర్థం కావడం లేదు. ఏడవని రోజు లేదు. ఏ పనీ సేయలేకపోతాన్నం. ఇప్పటికైనా మా బిడ్డల హత్యల వెనక ఎవరు ఉన్నారో కనిపెట్టాల. - బాలికల తల్లిదండ్రులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నాం! ప్రియాంక, భూమికల కేసు విషయమై ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందిన వెంటనే బాలికల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులకు నివేదికలు అందించి.. అభిప్రాయాలు తీసుకుని, బాలికలది ఆత్మహత్యా హత్యా అనే విషయాలు వెలుగులోకి తీసుకువస్తాం. మరో వారం రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందే అవకాశం ఉంది. - డీఎస్పీ బాలుజాదవ్ కేసు దర్యాప్తు చేస్తున్నసీఐడీ అధికారి -
కళేబరాల గుట్టలు
వి.కోట(చిత్తూరు): చిత్తూరు జిల్లా వి. కోట మండలం సుద్దులకుప్పం గ్రామ శివారులో భారీగా జంతువుల కళేబరాలు పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం గ్రామ శివారులో పశువులను మేపడానికి వెళ్లిన కొందరు పశువుల కళేబరాలు గుట్టులగా పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. -
శవాల విందు !
కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో శవాలకూ రక్షణ లేకుండా పోయింది. ప్రమాదంలో మరణించినా.. ఆత్మహత్యల కేసుల్లోనూ.. రోగులు మృతి చెందినా.. పోస్టు మార్టం మరుసటి రోజుకు వాయిదా పడిం దంటే చాలు.. శవం మార్చురీ గదికి వెళ్లిందో.. అక్కడ పందికొక్కులు రెడీగా ఉంటాయి పీక్కు తినడానికి .. ఈ వేదనా భరిత దుస్థితికి మృతుల బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందికొక్కులే అతిథి దేవుళ్లు వేదిక : కామారెడ్డి ఏరియా ఆస్పత్రి, మార్చురీ గది కామారెడ్డి :రోగులే కాదు.. శవాలు కూడా ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనేంతటి దుస్థితి నెలకొంది కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో ! రోగుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు చివరకు శవాల విషయంలోనూ అంతకన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో వృతిచెందిన ఒక వ్యక్తి శవాన్ని పోస్టుమార్టం గదిలో పందికొక్కులు, ఎలుకలు పీక్కుతిన్న ఘటనే నిదర్శనం. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణ నడిబొడ్డున ఉన్న ఏరియా ఆస్పత్రిలో అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. కామారెడ్డి మీదుగా జాతీయరహదారి, రైల్వేబ్రాడ్గేజ్ లైన్‌తో పాటు రాష్ట్రీయ రహదారులు వెళతాయి. దీంతో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతుంటాయి. దానికి తోడు ఆత్మహత్యలు, హత్యల కేసులూ ఎక్కువే. ప్రమాదాల్లోగాని, ఆత్మహత్యలు, హత్య ఘటనల్లో గాని చనిపోయిన వారి శవాలను ఏరియా ఆస్పత్రికి తీసుకువస్తారు. రోజుకూ ఒకటి, రెండు శవాలు వస్తూనే ఉంటాయి. సూర్యాస్తమయం తరువాత వచ్చే శవాలను పోస్టుమార్టం గదిలో పడేస్తారు. తెల్లవారి ఆస్పత్రికి వైద్యులు వచ్చి, పోలీసుల పంచనామా ప్రక్రియలు ముగిసిన తరువాత పోస్టుమార్టం ప్రక్రియ మొదలవుతుంది. అయితే పోస్టుమార్టం గది నిర్వహణ విషయంలో ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పందికొక్కులు, ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి. పోస్టుమార్టం గదిలో ఉంచిన శవాలను కొరుక్కుతింటుండడంతో చనిపోయిన వారి కుటుంబాల వారు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమవారి ఆఖరిచూపులోనైనా వారి ముఖం చూసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి ముఖం చెదిరిపోకుండా ఉండింది. కాని పోస్టుమార్టం గదిలో తెల్లారేసరికి మొఖంపై ఉన్న చర్మాన్ని పందికొక్కులు, ఎలుకలు పీక్కుతిన్నాయి. వైద్యం కోసం వచ్చేవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు శవాల విషయంలోనూ అంతకన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఆస్పత్రి నిర్వహణకు వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల బడ్జెట్ వస్తున్నా ఆస్పత్రి ప్రధాన అధికారులు వసతుల కల్పన విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. పోస్టుమార్టం గదిలో ఫ్రీజర్లు లేవు.... గుర్తుతెలియని వృతదేహాలను భద్రపరిచేందుకు ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో ఎలాంటి ఫ్రీజర్లు లేవు. ఒక్కోసారి శవాలను నాలుగైదు రోజులు భద్రపర్చాల్సి ఉంటుంది. అయితే ఆస్పత్రిలో ఫ్రీజర్ల ఏర్పాటు విషయంలో అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. పోస్టుమార్టం గది చిన్నగా ఉండడం వల్ల ఒక్కోసారి నాలుగైదు శవాలు వస్తే వాటిని కింద పడేస్తున్నారు. పశువుల వృతదేహాల కన్నా నిర్లక్ష్యంగా శవాలను పడేస్తుండడం ఆత్మీయులను కంటతడి పెట్టిస్తోంది. ఏటా ఐదు వందల నుంచి ఆరు వందల వరకు శవాలు పోస్టుమార్టం గదికి వస్తుంటాయి. మనుషులను పట్టించుకోని అధికారులు కనీసం శవాలపైనైనా మానవతా దృక్పథం ప్రదర్శించాలని పలువురు కోరుతున్నారు. -
ఓరి దేవుడా..
‘ఓరే పవనూ లేయ్యిరా.. బడికి పోవాల్రా.. సిన్నోడా నీకేమైందిరా.. పిలుత్తుంటే పలకడం లేదెందుకురా.. ఎవరికేం అన్నాలం చేయలేదురా.. ఆ దేవుడు మమ్మల్ని సిన్న సూపు సూశాడురా.. ఓరి భగవంతుడా.. మా పల్లల్ని ఇలా తీసుకుపోయావేమిరా’ అంటూ ఆ తల్లిదండ్రులు పొగిలి పొగిలి ఏడుస్తుంటే ఆపడం ఎవరి తరమూ కాలేదు. కళ్యాణదుర్గం రూరల్ : కొడుకులిద్దరినీ తీసుకెళ్లి వంశవృక్షం లేకుండా చేస్తివి దేవుడా... అంటూ ఆ తల్లి రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టిం చింది. శుక్రవారం మధ్యాహ్నం ఆడుకునేందుకు బయటకు వెళ్లిన అన్నదమ్ములు శనివారం నీటికుంటలో శవాలుగా కనిపించారు. కళ్యాణదుర్గం మునిసిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. అనంతపురం రూరల్ మండలం సోమలదొడ్డికి చెందిన ఈడిగ శ్రీరాములు, దొడగట్టకు చెందిన పద్మావతి దంపతులు. వీరు ఆరు నెలల క్రితం సోమల దొడ్డి నుంచి దొడగట్టకు వచ్చారు. పద్మావతి ఇంటి వద్దే చిల్లర దుకాణం నిర్వహిస్తుండగా.. శ్రీరాములు ఆటో నడుపుతున్నాడు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. స్థానిక జ్ఞానభారతి ప్రైవేట్ పాఠశాలలో పవన్ (11) ఒకటో తరగతి, సంతోష్ (6) ఎల్కేజీ చదువుతున్నారు. కుమార్తె అనసూయ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. శుక్రవారం జ్ఞానభారతి పాఠశాలలో ఫంక్షన్ జరుగుతుండటంతో తరగతులు జరగవేమోనని కొంతమంది పిల్లలు ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. అలా ఇంటికి వచ్చి ఆడుకుంటున్న పవన్, సంతోష్‌లకు మధ్యాహ్న సమయంలో నానమ్మ నీలావతి వచ్చి భోజనం పెట్టింది. ఆ తర్వాత పిల్లలు మళ్లీ ఆడుకునేందుకు బయటకు వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి పిల్లలు కనిపించలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామ పరిసరాల్లో గాలించినా జాడ దొర కలేదు. దీంతో రాత్రి పదిన్నర గంటల సమయంలో పిల్లలు కనిపించడం లేదని తండ్రి శ్రీరాములు పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం బొమ్మన్నదేవరగుట్ట సమీపంలోని చిన్న నీటికుంటలో పవన్, సంతోష్‌ల మృతదేహాలను రవి, రాజేంద్ర అనే వ్యక్తులకు కనిపించాయి. వారు పట్టణ పోలీసులకు సమాచారమందించారు. ఎస్ఐ జయానాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి.. తల్లిదండ్రులు, గ్రామస్తుల సమక్షంలో మృతదేహాలను వెలికితీయించారు. కుమారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మేము ఎవరి కోసం బతకాలిరా దేవుడా అంటూ గుండెలుబాదుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ‘పథకం ప్రకారమే పిల్లలను చంపేశారు’ మా ఎదుగుదలను ఓర్వలేని వారు పథకం ప్రకారం పిల్లలను చంపేశారని పద్మావతి ఆరోపించింది. గ్రామంలో గతంలో జరిగిన ఓ సంఘటనలో మా కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్పలేదనే నేపంతోనే ఇద్దరు వ్యక్తులు మా పై కక్షగట్టి ఈ దుర్మార్గానికి ఒడిగట్టి ఉంటారని విలపించింది. పిల్లలను నీటికుంటలో ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటారని ఆరోపించింది. పిల్లలతో పాటు మమ్ములను కూడా చంపేయండి అంటూ కన్నీరుమున్నీరయ్యింది. పిల్లల మృతిపై అనుమానాలు చిన్నారులు పవన్, సంతోష్‌ల మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా నీటికుంట వద్దకు ఎందుకు వెళ్లి ఉంటారు. అసలు బొమ్మన్నదేవరగుట్ట వద్దకు వెళ్లేందుకు రహదారి కూడా లేదు. ఆ సమీప ప్రాంతంతో నీటి కుంటలున్నట్లు పిల్లలకు తెలియదు. ఈత కోసం వెళ్లి పిల్లలు నీటి కుంటలో పడి మృతి చెంది ఉండరని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. పిల్లలు మృతికి ఇంకేదైనా కారణం అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు. పాఠశాలలో ఉంటే బతికేవారేమో..? పిల్లలు పాఠశాలలో ఉండి ఉంటే బతికేవారని స్థానికులు అంటున్నారు. ఫంక్షన్ జరుగుతుండటాన్ని చూసి ఇక క్లాసులు ఉండవని భావించి పిల్లలు ఇంటికి వెళ్లడమే శాపంగా మారిందని పేర్కొంటున్నారు. యాజమాన్యం పాఠశాల నిర్వహణ పై శ్రద ్ధ చూపకపోడం వల్లే నేడు ఈ పరిస్థితి చోటు చేసుకుందని ఆరోపిస్తున్నారు. అయితే పాఠశాల కరస్పాండెంట్ రమేష్ ఈ ఆరోపణలను ఖండించారు. పాఠశాల యథావిధిగా జరిగిందని చెప్పారు. పలు కోణాల్లో దర్యాప్తు చిన్నారుల మృతిపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్ఐ జయనాయక్ తెలిపారు. పిల్లలను హత్య చేసి నీటి గుంటలో పడవేసినట్లు ఆనవాళ్లు కనిపించడం లేదన్నారు. మృతదేహాలపై ఎక్కడా రక్తపు గాయాలు కానీ, తేలికపాటి దెబ్బలు కానీ కనిపించడం లేదన్నారు. నీట మునిగి మృతి చెందినట్లు డాక్టర్ రంగనాథ్ నిర్ధారించారన్నారు. అయితే అన్ని అవయవాలనూ పరీక్షల నిమిత్తం తిరుపతి, హైదరాబాద్, అనంతపురం ల్యాబ్‌లకు పంపుతామన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. నాయకుల పరామర్శ పవన్, సంతోష్ ఇద్దరు పిల్లలు నీటి గుంటలో పడి మృతి చెందడంతో పలువురు నేతలు వారి కుటుంబాన్ని పరామర్శించారు. మునిసిపల్ చైర్మన్ వైపీ రమేష్, వైస్ చైర్మన్ అబ్దుల్ రహీమ్, ఎమ్మార్పీఎస్ నాయకులు అక్కులప్ప, తిమ్మరాజు తదితరులు మృతదేహాలను పరిశీలించారు. ఇదిలా ఉండగా నలుగురు పిల్లలు ఈత కెళ్లారని పవన్, సంతోష్‌లు నీట మునగగానే మిగతా వారిద్దరూ పారిపోయారనే చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి పారిపోయిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.