ఈ మిస్టరీ ఎందుకు వీడడం లేదు? | Why not vidadam this mystery? | Sakshi
Sakshi News home page

ఈ మిస్టరీ ఎందుకు వీడడం లేదు?

Published Tue, Jul 12 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

ఈ మిస్టరీ ఎందుకు వీడడం లేదు?

ఈ మిస్టరీ ఎందుకు వీడడం లేదు?

గుట్ట కాదు.. పుట్ట!
విచారిస్తున్నాం!

 
గుట్ట కాదు... పుట్ట!
వాళ్లిద్దరూ క్లాస్‌మేట్స్, స్నేహితురాళ్లు.
ఇద్దరూ ఒకేసారి చనిపోయారు!
ఎలా చనిపోయారు?  
ఇంటి నుండి హాస్టల్‌కు వెళ్లాల్సినవాళ్లు...
ఎందుకు వెళ్లలేదు?
మధ్యలో దారి ఎందుకు మార్చుకున్నారు?
ఊరి చివర గుట్ట దగ్గర.. శవాలుగా ఎందుకు కనిపించారు?
చనిపోయారా? ఎవరైనా చంపేశారా?
ఆర్నెల్లు గడిచినా ఈ మిస్టరీ ఎందుకు వీడడం లేదు?
అడవిలో పాముల పుట్టలు ఉంటాయి.
లేదంటే... చీమల పుట్టలు ఉంటాయి.
కానీ ఇది పాముల పుట్ట కాదు.. చీమల పుట్ట కాదు.
అనుమానాల పుట్ట.
ఈ పుట్ట పగలాలి. నిజాలు బయటికి రావాలి.

 
 
వరంగల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. అప్పుడే తెల్లవారింది. ఊరు మెల్లగా బద్దకాన్ని వదిలించుకుంటోంది. ఊరివాళ్లంతా పనుల్లో నిమగ్నమవుతున్నారు. అంతలో ఉన్నట్టుండి గ్రామసింహాల అరుపులతో పరిసరాలు దద్దరిల్లాయి. గుంపులు గుంపులుగా శునకాలు ఊళ్లోకి జొరబడ్డాయి. వెంటనే గ్రామస్తులు వాటిని అదిలించారు. అవి భయపడి పారిపోయాయి. కానీ వెళ్తూ వెళ్తూ తమ నోటిలో ఉన్నవాటిని వదిలేసి వెళ్లాయి. ఒకటే దుర్వాసన. ఏంటా అని చూసిన గ్రామస్థులు హడలిపోయారు. అవి మానవ శరీర అవయవాలు. కుళ్లిపోయి కంపు కొడుతున్నాయి. సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కుక్కలను అనుసరిస్తూ వెళ్లిన వాళ్లకి... గ్రామ శివారులోని ఓ గుట్ట వద్ద రెండు మృతదేహాలు కనిపించాయి. శిథిలమైన దశలో... కుక్కలు పీకేయగా ఛిద్రమైన స్థితిలో. ఘోరాతి ఘోరం... దారుణాతి దారుణం! ఆ దృశ్యం చూసి వారి మనసులు వికలమయ్యాయి. అందరిలోనూ ఒకటే ప్రశ్న. ఎవరివా దేహాలు?
 
హాస్టల్‌కని వెళ్లి...
నర్సంపేట డివిజన్‌లోని నల్లబెల్లి మండలం, మూడు చెక్కలపల్లిలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఒకటుంది. అందులో తొమ్మిదో తరగతి చదువుతున్నారు బానోతు భూమిక, బానోతు ప్రియాంక. ఇద్దరికీ పద్నాలుగేళ్లే. ఇద్దరూ పర్వతగిరి మండలం, నారాయణపురం గ్రామ శివారులోని కంబాలకుంట తండాకు చెందినవారే. పైగా  మంచి స్నేహితులు. అందుకేనేమో... మరణంలో కూడా స్నేహం వీడలేదు. ఒక్కసారే చనిపోయారు. ఒక్కలాగే చనిపోయారు.

కంబాలకుంట తండాలో 22 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. అందరూ తమకున్న కొద్దిపాటి భూమిలో పంటలు పండిస్తూ జీవితాలను సాగిస్తున్నారు. వారిలో బాలు-కమిలి, కిషన్-యాకమ్మ దంపతులు కూడా ఉన్నారు. బాలు-కమిలిలకు ఒక కొడుకు, ఒక కూతురు. ఆ కూతురే ప్రియాంక. కిషన్-యాకమ్మలకు కూడా ఒక కుమారుడు, కుమార్తె. ఆ కుమార్తెయే... భూమిక. ఎదురెదురిళ్లు కావడంతో అందరూ కలిసి మెలిసి ఉండేవారు. అందుకే అనుకుంటా... ఇరువురి ఇళ్లలోకీ విషాదం ఒక్కసారే వచ్చి చేరింది. కూతుళ్ల మరణం రూపంలో.  అసలేం జరిగింది?

ప్రియాంక, భూమికలిద్దరినీ ఆరో తరగతిలో ఆశ్రమ పాఠశాలలో చేర్చారు తల్లిదండ్రులు. మూడేళ్లుగా హాస్టల్లో ఉండి చదువుకుంటూ సెలవుల్లో ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఆ విధంగానే 2015లో దీపావళి సెలవులకు ముందు... ఇంటికి వచ్చారు. సెలవుల తర్వాత నవంబర్ 23న తిరిగి హాస్టల్‌కు బయలుదేరారు. కానీ హాస్టల్‌కు వెళ్లలేదు. నర్సంపేటలో దిగి జయశ్రీ థియేటర్‌లో మ్యాట్నీ చూశారు. ఆ తర్వాత కూడా హాస్టల్‌కి వెళ్లలేదు. ములుగు మండలం, మల్లంపల్లి శివారులోని శ్రీనగర్ గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికెళ్లారు. వాళ్ల హాస్టల్ వార్డెన్ వీరమ్మ... పిల్లలు ఇంకా రాలేదు అంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. వాకబు చేయగా బంధువుల ఇంట్లో ఉన్నారని తెలిసింది. వెంటనే హాస్టల్‌కు వెళ్లమని చెప్పారు. వెళ్లిపోతాం అన్నారు ఇద్దరూ. అన్నారే కానీ వెళ్లలేదు. అప్పుడే కాదు. ఎప్పటికీ వెళ్లలేదు. వాళ్లు ఎక్కడికి వెళ్లారో, ఏమయ్యారో ఎవరికీ తెలియలేదు. డిసెంబర్ 27న... చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట శివారులోని గుట్ట వద్ద కుళ్లిపోయిన శవాలుగా కనిపించారు.

ఎన్నో అనుమానాలు...
నిజానికి తల్లిదండ్రులు చెప్పగానే... అంటే నవంబర్ 24న బంధువుల ఇంటి నుంచి మల్లంపల్లికి వచ్చి, ఆర్టీసీ బస్సులో హాస్టల్‌కు బయలుదేరారు ప్రియాంక, భూమిక. తమతోపాటు ప్రయాణిస్తున్న ఓ అటవీ శాఖ ఉద్యోగి నుంచి సెల్‌ఫోన్ తీసుకుని వార్డెన్‌కు ఫోన్ చేశారు. వచ్చేస్తున్నామని చెప్పారు. కానీ వాళ్లు హాస్టల్‌కు వెళ్లలేదు. దాంతో 25న వార్డెన్ తల్లిదండ్రులకు మళ్లీ సమాచారం అందించారు. ఎంత వాకబు చేసినా పిల్లల జాడ తెలియలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పిల్లల ఫొటోలను పబ్లిక్ ప్రదేశాల్లో అతికించి, వారి ఆచూకీ తెలపమని వేడుకున్నారు. చివరికి వాళ్లని నిర్జీవులుగా చూసి అల్లాడి పోయారు.

ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు విచారణ చేపట్టినా వాస్తవాలు కనుక్కోలేకపోయారు. మృతదేహాల పక్కన ఉన్న పురుగుల మందు డబ్బాను బట్టి వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు అన్నారే తప్ప ఏం జరిగిందో ఎంతకీ అంచనా వేయలేకపోయారు. దాంతో డీఐజీ ఈ కేసును సీఐడీకి అప్పగించారు. వాళ్లు కూడా ఈ మిస్టరీని నేటికీ ఛేదించలేకపోయారు.

అసలు ప్రియాంక, భూమికలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? వాళ్లకి ఏం కష్టాలున్నాయి? ఇవి తల్లిదండ్రులు అడుగుతున్న ప్రశ్నలు. అసలివి ఆత్మహత్యలేనా అన్న ప్రశ్న కూడా చాలామంది మనసుల్లో ఉంది. దానికి కారణం లేకపోలేదు. మృతదేహాల దగ్గర ఉన్న క్రిమి సంహారక మందు డబ్బాలు కొంచెమే ఖాళీ అయ్యాయి. ఆ కాస్త తాగితేనే చనిపోతారా? పోనీ చనిపోయినా... పురుగుల మందు తాగితే కాళ్లూ చేతులూ గిలగిలా కొట్టుకుని ఉండాలి. కానీ అలాంటి ఆనవాళ్లేవీ లేవు. అమ్మాయిల వస్తువులు కొన్ని చెల్లాచెదురుగా పడివున్నాయి. కానీ అవి పడినట్టుగా కాక, కావాలని ఎవరో పెట్టినంత పద్ధతిగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే, మరణాలు అక్కడ సంభవించలేదని, వాళ్లని ఎవరైనా వేరేచోట చంపేసి అక్కడికి తెచ్చి పడేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా హాస్టల్‌కి వెళ్లాల్సిన అమ్మాయిలు మధ్యలో ఎందుకు ఆగారు? సినిమాకి వాళ్లు మాత్రమే వెళ్లారా? వాళ్లతో ఎవరైనా వెళ్లారా? తర్వాతైనా హాస్టల్‌కి వెళ్లిపోకుండా బంధువుల ఇంటికెందుకు వెళ్లారు? అక్కడేమయ్యింది? ఆ బంధువులు ఎందుకు మాట్లాడటం లేదు? అక్కడ్నుంచి బయల్దేరారని నిర్ధారణ అయ్యింది. మరి హాస్టల్‌కెందుకు వెళ్లలేదు? మధ్యలో ఎక్కడ ఆగారు? ఎలా అదృశ్యమయ్యారు? దీనంతటి వెనుకా ఎవరి హస్తమైనా ఉందా? ఎవరైనా నమ్మించి మోసం చేశారా? వంచించి హత్య చేశారా?

అన్నీ అనుమానాలే. అవి ఇప్పటికీ నివృత్తి కాలేదు. ఎందుకంటే విచారణ ముందుకు సాగలేదు. సీఐడీ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. జిల్లా స్థాయి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటైంది. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నిరసన అంతకంతకూ ఎక్కువవుతోంది. కానీ కేసు ఇసుమంత కూడా కదల్లేదు. అడిగితే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నమంటున్నారు సీఐడీ అధికారులు. రిపోర్టు రావడానికి ఇంతకాలం పడుతుందా? ఈ కేసు ఎప్పటికి తేలుతుంది? ప్రియాంక, భూమికలకు న్యాయం జరుగుతుందా? అసలీ గుట్టు ఎప్పటికైనా వీడుతుందా?? - అబ్బు వెంకట్‌రెడ్డి, సాక్షి, నర్సంపేట, వరంగల్
 
న్యాయం కావాలి
 ‘‘ఆడబిడ్డలు లేక  ఇల్లంతా సిన్నబోతోంది. మంచిగ సదివి మంచి ఉద్యోగాలు సంపాదించాలని అనుకున్నం. ఆళ్లని ఈ స్థితిలో చూస్తమని కల్లో కూడా అనుకోలేదు. అసలు మా బిడ్డలకు ఆత్మహత్యలు చేసుకునేంత ఇబ్బందులు ఏమీ లేవు. ఆల్లని ఎవరో పొట్టన పెట్టుకుని ఉంటారు. ఆరు నెలలు అయినా పోలీసోళ్లు ఎందుకు తెలుసుకుంటలేరు! ల్యాబ్ రిపోర్ట్ రాలేదని చెబుతాండ్రు. పెద్దపెద్దోళ్ల విషయంలో తొందర్నే వచ్చిన ల్యాబ్ రిపోర్టు మా బిడ్డల కాడికి వచ్చేసరికి ఎందుకు ఆలస్యమైతాందో అర్థం కావడం లేదు. ఏడవని రోజు లేదు. ఏ పనీ సేయలేకపోతాన్నం. ఇప్పటికైనా మా బిడ్డల హత్యల వెనక ఎవరు ఉన్నారో కనిపెట్టాల.    - బాలికల తల్లిదండ్రులు
 
ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నాం!
ప్రియాంక, భూమికల కేసు విషయమై ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు అందిన వెంటనే బాలికల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులకు నివేదికలు అందించి.. అభిప్రాయాలు తీసుకుని, బాలికలది ఆత్మహత్యా హత్యా అనే విషయాలు వెలుగులోకి తీసుకువస్తాం. మరో వారం రోజుల్లో ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక అందే అవకాశం ఉంది.
 - డీఎస్పీ బాలుజాదవ్ కేసు దర్యాప్తు చేస్తున్నసీఐడీ అధికారి

 


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement