ఓరి దేవుడా.. | Oh My God .. | Sakshi
Sakshi News home page

ఓరి దేవుడా..

Published Sun, Oct 12 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

ఓరి దేవుడా..

ఓరి దేవుడా..

 ‘ఓరే పవనూ లేయ్యిరా.. బడికి పోవాల్రా.. సిన్నోడా నీకేమైందిరా.. పిలుత్తుంటే పలకడం లేదెందుకురా.. ఎవరికేం అన్నాలం చేయలేదురా.. ఆ దేవుడు మమ్మల్ని సిన్న సూపు సూశాడురా.. ఓరి భగవంతుడా.. మా పల్లల్ని ఇలా తీసుకుపోయావేమిరా’ అంటూ ఆ తల్లిదండ్రులు పొగిలి పొగిలి ఏడుస్తుంటే ఆపడం ఎవరి తరమూ కాలేదు.
 
 కళ్యాణదుర్గం రూరల్ : కొడుకులిద్దరినీ తీసుకెళ్లి వంశవృక్షం లేకుండా చేస్తివి దేవుడా... అంటూ ఆ తల్లి రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టిం చింది. శుక్రవారం మధ్యాహ్నం ఆడుకునేందుకు బయటకు వెళ్లిన అన్నదమ్ములు శనివారం నీటికుంటలో శవాలుగా కనిపించారు. కళ్యాణదుర్గం మునిసిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

అనంతపురం రూరల్ మండలం సోమలదొడ్డికి చెందిన ఈడిగ శ్రీరాములు, దొడగట్టకు చెందిన పద్మావతి దంపతులు. వీరు ఆరు నెలల క్రితం సోమల దొడ్డి నుంచి దొడగట్టకు వచ్చారు. పద్మావతి ఇంటి వద్దే చిల్లర దుకాణం నిర్వహిస్తుండగా.. శ్రీరాములు ఆటో నడుపుతున్నాడు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. స్థానిక జ్ఞానభారతి ప్రైవేట్ పాఠశాలలో పవన్ (11) ఒకటో తరగతి, సంతోష్ (6) ఎల్‌కేజీ చదువుతున్నారు. కుమార్తె అనసూయ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది.

శుక్రవారం జ్ఞానభారతి పాఠశాలలో ఫంక్షన్ జరుగుతుండటంతో తరగతులు జరగవేమోనని కొంతమంది పిల్లలు ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. అలా ఇంటికి వచ్చి ఆడుకుంటున్న పవన్, సంతోష్‌లకు మధ్యాహ్న సమయంలో నానమ్మ నీలావతి వచ్చి భోజనం పెట్టింది. ఆ తర్వాత పిల్లలు మళ్లీ ఆడుకునేందుకు బయటకు వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి పిల్లలు కనిపించలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామ పరిసరాల్లో గాలించినా జాడ దొర కలేదు. దీంతో రాత్రి పదిన్నర గంటల సమయంలో పిల్లలు కనిపించడం లేదని తండ్రి శ్రీరాములు పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

శనివారం ఉదయం బొమ్మన్నదేవరగుట్ట సమీపంలోని చిన్న నీటికుంటలో పవన్, సంతోష్‌ల మృతదేహాలను రవి, రాజేంద్ర అనే వ్యక్తులకు కనిపించాయి. వారు పట్టణ పోలీసులకు సమాచారమందించారు. ఎస్‌ఐ జయానాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి.. తల్లిదండ్రులు, గ్రామస్తుల సమక్షంలో మృతదేహాలను వెలికితీయించారు. కుమారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మేము ఎవరి కోసం బతకాలిరా దేవుడా అంటూ గుండెలుబాదుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

 ‘పథకం ప్రకారమే పిల్లలను చంపేశారు’
 మా ఎదుగుదలను ఓర్వలేని వారు పథకం ప్రకారం పిల్లలను చంపేశారని పద్మావతి ఆరోపించింది. గ్రామంలో గతంలో జరిగిన ఓ సంఘటనలో మా కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్పలేదనే నేపంతోనే ఇద్దరు వ్యక్తులు మా పై కక్షగట్టి ఈ దుర్మార్గానికి ఒడిగట్టి ఉంటారని విలపించింది. పిల్లలను నీటికుంటలో ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటారని ఆరోపించింది. పిల్లలతో పాటు మమ్ములను కూడా చంపేయండి అంటూ కన్నీరుమున్నీరయ్యింది.

 పిల్లల మృతిపై అనుమానాలు
 చిన్నారులు పవన్, సంతోష్‌ల మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా నీటికుంట వద్దకు ఎందుకు వెళ్లి ఉంటారు. అసలు బొమ్మన్నదేవరగుట్ట వద్దకు వెళ్లేందుకు రహదారి కూడా లేదు. ఆ సమీప ప్రాంతంతో నీటి కుంటలున్నట్లు పిల్లలకు తెలియదు. ఈత కోసం వెళ్లి పిల్లలు నీటి కుంటలో పడి మృతి చెంది ఉండరని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. పిల్లలు మృతికి ఇంకేదైనా కారణం అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు.

 పాఠశాలలో ఉంటే బతికేవారేమో..?
 పిల్లలు పాఠశాలలో ఉండి ఉంటే బతికేవారని స్థానికులు అంటున్నారు. ఫంక్షన్ జరుగుతుండటాన్ని చూసి ఇక క్లాసులు ఉండవని భావించి పిల్లలు ఇంటికి వెళ్లడమే శాపంగా మారిందని పేర్కొంటున్నారు. యాజమాన్యం పాఠశాల నిర్వహణ పై శ్రద ్ధ చూపకపోడం వల్లే నేడు ఈ పరిస్థితి చోటు చేసుకుందని ఆరోపిస్తున్నారు. అయితే పాఠశాల కరస్పాండెంట్ రమేష్ ఈ ఆరోపణలను ఖండించారు. పాఠశాల యథావిధిగా జరిగిందని చెప్పారు.

 పలు కోణాల్లో దర్యాప్తు
 చిన్నారుల మృతిపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్‌ఐ జయనాయక్ తెలిపారు. పిల్లలను హత్య చేసి నీటి గుంటలో పడవేసినట్లు ఆనవాళ్లు కనిపించడం లేదన్నారు. మృతదేహాలపై ఎక్కడా రక్తపు గాయాలు కానీ, తేలికపాటి దెబ్బలు కానీ కనిపించడం లేదన్నారు. నీట మునిగి మృతి చెందినట్లు డాక్టర్ రంగనాథ్ నిర్ధారించారన్నారు. అయితే అన్ని అవయవాలనూ పరీక్షల నిమిత్తం తిరుపతి, హైదరాబాద్, అనంతపురం ల్యాబ్‌లకు పంపుతామన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

 నాయకుల పరామర్శ
 పవన్, సంతోష్ ఇద్దరు పిల్లలు నీటి గుంటలో పడి మృతి చెందడంతో పలువురు నేతలు వారి కుటుంబాన్ని పరామర్శించారు. మునిసిపల్ చైర్మన్ వైపీ రమేష్, వైస్ చైర్మన్ అబ్దుల్ రహీమ్, ఎమ్మార్పీఎస్ నాయకులు అక్కులప్ప, తిమ్మరాజు తదితరులు మృతదేహాలను పరిశీలించారు. ఇదిలా ఉండగా నలుగురు పిల్లలు ఈత కెళ్లారని పవన్, సంతోష్‌లు నీట మునగగానే మిగతా వారిద్దరూ పారిపోయారనే చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి పారిపోయిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement