జీవితమైనా మాటైనా సరైన రూట్‌లో వెళ్లాలి. జీవితం తూలినా మాట తూలినా భవిష్యత్తు చతికిల పడుతుంది. చట్టం చుట్టుముడుతుంది. ‘దీపికా ఎందుకంతగా భయపడతావు. ఈ రోజే మీ వాళ్లతో మాట్లాడతాను. ఒప్పుకోక ఏం చేస్తారు? కాదంటే ఎటైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం. సరేనా’ కళ్లనీళ్లతో ఉన్న దీపికకు ధైర్యం చెబుతూ అన్నాడు కుమార్. ‘ఒప్పుకుంటారని ఎలా అంటావు. ఆల్రెడీ నీ మీద కేసు పెట్టి లోపలేయించారు. మీ వాళ్లు ఏదో చేసి బయటకు తెచ్చారు. నువ్వు మారలేదు. నేను మారలేదు. మన ప్రేమ ఇంకా పెరిగింది. నువ్వు లేకుండా నేను బతకలేను కుమార్’ అంది దీపిక ఏడుస్తూ. ‘భయపడకు. మన ప్రేమలో నిజాయితీ ఉంది. తప్పక మనం ఒకటవుతాం’ అన్నాడు కుమార్. దీపిక హుజురాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కుమార్ ఓ సెల్‌ఫోన్ షాప్‌లో జాబ్ చేస్తున్నాడు. ఇద్దరికీ ఏడాది క్రితం పరిచయం అయ్యింది. పరిచయం కాస్తా స్నేహంగా, ప్రేమగా మారింది. తమ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఏమంటారోనని దీపిక భయపడుతోంది. అలా ఏమీ జరగదని దీపికకు ధైర్యం చెబుతూ వస్తున్నాడు కుమార్.
దీపిక –కుమార్‌లు మళ్లీ కలిసి తిరుగుతున్నట్టు దీపిక తండ్రికి తెలిసింది. ‘నిన్ను చంపేస్తాను. చదువుకోమని పంపితే పుస్తకాలు వదిలిపెట్టి బేవార్స్ పనులు చేస్తున్నావా? సెల్‌ఫోన్‌లు రిపేర్ చేసుకునేవాడితో ప్రేమేంటే?’ కూతురుపై అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. దీపిక తాత, మేనమామ సర్దిచెప్పారు. దీపిక పెదనాన్నలు కూడా ‘ఏందిరా.. బిడ్డ మీద అలాగేనా నోరేసుకునేది. దానికేం తెలుసు పెద్ద పెద్ద విషయాలు.మనమే చక్కదిద్దాల. పిల్లోడ్ని పిలిపించి అన్నీ సరే అనుకుంటే లగ్గం చేద్దాం’ అన్నారు. అన్నల మాటలకు దీపిక తండ్రి వాళ్లవైపు చూశాడు. అతనికి ఏదో అర్థమైంది.‘సరే’ అని నెమ్మదించాడు.‘అన్నీ ఆలోచించి చేద్దాం’ అంటూ చుట్ట వెలిగించుకుంటూ వాకిట్లోకి వెళ్లాడు దీపిక తాత.
‘చూడబ్బీ.. పిలవగానే వచ్చినవ్. మాకు మీ ప్రేమ విషయం అర్థమైంది. మంచి పిల్లోడివి కాబట్టే మా చిట్టితల్లి నిన్ను ఇష్టపడింది. గతంలో జరిగినవి మనసుల పెట్టుకోకు. మీ పెళ్లి మేం జరిపిస్తం.భయాలేవీపెట్టుకోవద్దు సరేనా!’ అన్నాడు దీపిక తాత. ‘మైనర్ అయిన అమ్మాయిని మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వంచిస్తున్నాడ’ని ఆరు నెలల క్రితం కుమార్ మీద కేసు పెట్టింది దీపిక తాతే.‘కేసు విషయం పట్టించుకోవద్దు. ఎలా కాదనుకున్నా మా ఇంటి అల్లుడివి. మంచి ముహూర్తం పెట్టి మేమే నిన్ను పిలుస్తాం’ అన్నారు దీపిక పెదనాన్నలు. కుమార్ సంతోషంగా తలవూపి ఇంటి దారి పట్టాడు.
అక్టోబర్ 9, 2018.కరీంనగర్ జిల్లా శంకరపట్నం.తెల్లవారుజాము.అప్పుడప్పుడే వెలుతురు విచ్చుకుంటోంది.ఎంగిలిపూల బతుకమ్మ కోసం ఊరి జనం అడవి పూల సేకరణలో పోటీపడుతున్నారు. అరుణ అనే మహి తమ పత్తి చేనులోకి పత్తిపువ్వులను తెంపుకు రావడానికి వెళ్లింది. నాలుగైదు పువ్వులను తెంపిందో లేదో ఎదురుగా కనిపించిన దృశ్యానికి షాకై ఆ పువ్వులను అక్కడే పడేసి ఊరివైపుగా పరిగెత్తింది.అరుణ చెప్పిన విషయం వింటూనే ఊరి జనం పరుగున పత్తిచేనువైపుగా వచ్చారు. అక్కడ ఒక యువకుడి శవం. చిన్న ఊరు అది. మనిషిని పోల్చడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ శవం కుమార్‌ది. అంతే. ఆ వార్త వినగానే అతని తల్లీదండ్రి కంటిమింటికీ ఏడుస్తూ వచ్చారు. చుట్టూ మూగిన జనంలో ఎన్నో సందేహాలు.ఏం జరిగింది..? ఎలా జరిగింది..? కుమార్‌ని ఎవరైన హత్య చేశారా? లేక అతనే ఆత్మహత్య చేసుకున్నాడా? అందరిలోనూ అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. పోలీసులు వచ్చారు. వారిని చూడటంతోటే కుమార్ బంధువులు ఊరి జనం తిరగబడ్డారు.‘బంగారంలాంటి పిల్లాణ్ణి ప్రేమించాడని చంపేస్తే తీరిగ్గా ఇప్పుడొస్తున్నారు. తప్పుడు కేసు పెట్టి లోపల వేయించినప్పుడే వాళ్లను మీరు కంట్రోల్ చేయాల్సింది’ అని పోలీస్ జీపు మీద రాళ్ల వర్షం కురిపించారు.దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా ఎఫ్.ఐ.ఆర్ రాశారు. అయినా జనం శాంతించ లేదు. ఉన్నతాధికారులు వచ్చి ఊరిజనాన్ని సమాధానపరిచి, హంతుకులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో సర్దుకున్నారు. కుమార్ పడున్న చోట అతని సెల్‌ఫోన్ ఒకటే ఆధారంగా దొరికింది. అందులోని కాల్‌డేటా పరిశీలించారు. ఊరిజనంతో మాట్లాడి మరిన్ని వివరాలు రాసుకొని బయల్దేరారు.
కుమార్ చనిపోయి పది రోజులు అవుతుంది. అతనిది హత్యో, ఆత్మహత్యో తేలడం లేదు. కుమార్ ఫోన్‌లో కాల్‌డేటా ఆధారంగా 128 మందిని దర్యాప్తు చేశారు పోలీసులు.‘సార్.. ఇది మా వాళ్ల పనే. చింతగుట్ట గుట్టల్లోకి వెళుతున్నానని నాకు లాస్ట్ ఫోన్ కాల్‌లో కుమార్ చెప్పాడు’ ఏడుస్తూ చెప్పింది దీపిక. పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ‘ఇది ప్రేమకు సంబంధించిన హత్య అయి ఉంటుందా?’ అని దీపిక తండ్రి, మేనమామ, పెదనాన్నల మీద నిఘా పెట్టారు. ఇంటికెళ్లి విచారణ చేశారు. వాళ్లు పొడిపొడిగా సమాధానం చెప్పారు కానీ అందులో నుంచి ఏమీ దొరకడం లేదు. తగిన ఆధారం లేకుండా అరెస్టు చేయడం ప్రమాదం. ఇప్పుడు ఆధారం ఎలా?మరో నాలుగు రోజులు గడిచాయి. కేసు మిస్టరీ ఎలా ఛేదించాలో పోలీసులకు అర్థం కాలేదు. కుమార్ లాస్ట్‌ఫోన్ కాల్‌ను బట్టి అతడు చింతగుట్ట గుట్టల్లోకి వెళ్లాడు.కాని ఆ గుట్టలకు వెళ్లి వెతికితే ఏమీ కనిపించలేదు... తాగేసిన సీసాలు తప్ప. ఆ ప్రాంతంలో కుర్రాళ్లు తాగాలంటే సాధారణంగా ఆ గుట్టల్లోకి వెళుతుంటారు.‘కుమార్‌కు తాగుడు అలవాటుందా?’ స్నేహితులను అడిగారు.‘అప్పుడప్పుడు తాగుతాడు సార్’ అని చెప్పారు వాళ్లు.దీనిని క్లూగా తీసుకుని ఆ చుట్టుపక్కల పల్లెల మద్యం దుకాణాల సీసీ పుటేజీ పరిశీలించారు. అక్టోబర్ 8న అర్థరాత్రి ఓ ఆటో ఆనవాలు కనిపించింది. ఆ ఆటో నంబర్ ట్రేస్ చేసి డ్రైవర్‌ను పట్టుకున్నారు.‘సార్.. ఆ రోజు కుమార్‌తో పాటు వెంకటేశం అనే అతని స్నేహితుడు ఆటో ఎక్కారు. ఇద్దరూ అప్పటికే ఫుల్లుగా తాగున్నారు. అయినా సరే గుట్ట వైపు వెళ్లి తాగాలని అనుకున్నారు. వాళ్లు చెప్పిన చోట ఆటో ఆపేశాను. ఇద్దరూ బాటిళ్లు తీసుకొని దిగారు. నన్ను వెళ్లిపొమ్మనడంతో వెళ్లిపోయాను సార్’ అన్నాడు.‘కుమార్ పోన్ స్విbŒ∙ఆఫ్ అయ్యింది 12:10 గంటల ప్రాంతం. అంటే, అప్పటి వరకు వారిద్దరూ కలిసే ఉన్నారా...’ పోలీసులకి అనుమానం వచ్చింది. ఆటో ఆనవాలు కనిపించిన కేశవపట్నం మద్యం దుకాణం వద్ద సీసీ పుటేజీ పరిశీలించారు.12:30 గంటల ప్రాంతంలో వెంకటేశ్ ఒక్కడే మళ్లీ వచ్చి బీరు బాటిల్ తీసుకున్నట్లు రికార్డు అయ్యింది. ‘ఇక్కడే ఏదో తేడా కొడుతోంది. ఇద్దరుగా వెళ్లి ఒక్కడే ఎందుకు వచ్చాడు?’పోలీసులు వెంటనే వెంకటేశ్‌ను పట్టుకొచ్చారు.
‘సార్... నాకే పాపం తెలియదు. కుమార్‌ను వాళ్ల ఇంటిదగ్గరే దింపి వెళ్లిపోయాను’ అన్నాడు వెంకటేశ్. పోలీసులు సరైన ‘విచారణ’ మొదలెట్టే సరికి అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.‘సార్... దీపిక ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకున్నారన్న సంతోషంతో కుమార్ పార్టీకి పిలిచాడు. నేను వెళ్లాను’‘తర్వాత?’‘ఇద్దరం వైన్‌షాప్ దగ్గరే తాగాం. ఇంకా తాగుదాం అన్నాడు కుమార్.సరే అని రెండు బీరు బాటిళ్లు తీసుకుని గుట్ట వైపు వెళ్లడానికి ఆటో ఎక్కాం. కాని మధ్యలోనే పత్తి చేను దగ్గర దిగేశాం’‘ఊ...’‘నా ఆలోచన ఏంటంటే తొందరగా తాగేసి కుమార్‌ను ఇంటి దగ్గర దించి నేను కూడా ఇంటికి వెళ్లిపోవాలని. కాని మత్తు నా నెత్తికి ఎక్కింది. ఏం మాట్లాడుతున్నానో తెలియదు. దీపికతో ప్రేమ వరకేనా... పెళ్లికి ముందే ఇంకేమైనా చేశావా అనే అర్థంలో మోటుగా ఏదో అడిగినట్టున్నాను’...‘ఊ...’‘దానికి కుమార్‌కు కోపం వచ్చింది. పవిత్ర ప్రేమను అవమానిస్తావా అని నన్ను కొట్టాడు. నాక్కూడా చాలా కోపం వచ్చింది. కాని అసలు కారణం వేరేమో. నాలాంటి చిన్న చితకా మనిషైన కుమార్ దీపిక లాంటి మంచి అమ్మాయిని చేసుకుని పెద్దింటి అల్లుడు అవుతున్నాడని ఈర్ష్య పడినట్టున్నాను. అందుకే దారుణంగా అతడిపై దాడి చేశాను. దేంతో కొట్టానో కూడా తెలియదు. అతను చచ్చిపోయాడు. భయం వేసి శవాన్ని అక్కడే వదిలేశాను. ధైర్యం కోసం మళ్లీ వచ్చి ఒక బీరు కొనుక్కున్నాను. అలా బీరు కొనుక్కోవడం వల్లే మీకు దొరికిపోయాను’ అన్నాతడు.ఈ కేసును పోలీసులు తొమ్మిది రోజుల్లో ఛేదించారు.కాని ఒకడి క్షణికావేశం ఒక యువకుడి నూరేళ్ల జీవితాన్ని బలిగొంది. నేరస్తుడి జీవితాన్ని నాశనం చేసింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.
– గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment