ఏప్రిల్ 24, 2011. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతం. ఉదయం 5.30. రాత్రి పశువుల వద్ద కాపలాగా ఉన్న కాపరి ఇంటికి బయల్దేరాడు. దారిలో ఏవో మూలుగులు వినిపించాయి. ‘ఊ...ఊ...ఊ’
కొద్దిగా రోడ్డు దిగి చూశాడు. చెట్ల వెనకాల నుంచి ఏదో కదులుతోంది. ‘ఊ...ఊ...ఊ’... మూలుగులు.భయం వేసినా చేతిలోని కర్రను గట్టిగా పట్టుకుని పొద వెనకాల ఉన్న కాలిబాట వైపుతొంగి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అదిరిపడ్డాడు. రెండు కాళ్లు తెగిపోయిన ఓ మహిళ ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని మెల్లిగా రోడ్డువైపే పాకుతోంది. ఒళ్లంతా రక్తం. చాలా దూరం పాక్కుంటూ వచ్చినట్టుంది... ఆ దారి అంతా నెత్తురు. ఉదయాన్నే ఆ భీతావహ సన్నివేశం చూసేసరికి వాంతి వచ్చినంతపనైంది. వెంటనే తనకు తెలిసిన మీడియా వ్యక్తికి ఫోన్ చేశాడు.శంషాబాద్ నగర శివారు కాబట్టి ఎక్కడో చంపి శవాలు ఇక్కడ పడేయడం సాధారణమే. అందుకే, పశువుల కాపర్లు పోలీసులకు కాకుండా ముందు మీడియాకు చెబుతారు.
పశువులకాపరి చెప్పింది విని అపనమ్మకంగానే వచ్చారు మీడియా వాళ్లు. కాపరి వాళ్లను తన వెంట తీసుకెళ్లి చూపించాడు.మీడియా వాళ్లు చాలా ఘటనలు చూసి మొద్దుబారి ఉంటారు. అలాంటిది వాళ్లే ఆమెను చూసి ఒక అడుగు వెనక్కి వేశారు.‘ఈమె దగ్గరకి కుక్కలు రాకుండా ఇక్కడే ఉన్నాను సార్’ అన్నాడు కాపరి.నిమిషాల్లో పోలీసు జీపు, అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. పోలీసు వాహనం నుంచి దిగాడు ఎస్.ఐ అశోక్ కుమార్. ఆ మహిళ దగ్గరికి వేగంగా నడుచుకుంటూ వెళ్లాడు.‘ఏమ్మా... ఏమ్మా’ పిలిచాడు.అప్పటికే స్పృహ కోల్పోయింది. రక్తం మరకల ఆధారంగా చిట్టడవిలాంటి ప్రాంతంలోకి వెళ్లగా ఆమె తెగిన కాళ్లు కనిపించాయి. కానిస్టేబుళ్లను, 108 సిబ్బందిని పిలిచాడు. అంతా కలిసి తెగిన కాళ్లతోపాటు బాధితురాలిని అంబులెన్సులో ఎక్కించారు. వీలైనంత త్వరగా ఉస్మానియాకు తరలించాలని ఆదేశించాడు ఎస్.ఐ. సైరన్ మోతతో అంబులెన్స్ హైదరాబాద్ హైవే ఎక్కింది. నిమిషాల్లో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నడియీడు మహిళ కాళ్లు నరకడం, ఆమె ప్రాణాలతో పోరాడుతుండటంతో ఒక్కసారిగా మీడియా దృష్టి ఈ కేసుపై పడింది. రోజంతా ఇదే వార్తను తిప్పి తిప్పి ప్రసారం చేస్తుండటంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది.
క్షణాల్లో క్లూస్ టీం రంగంలోకి దిగింది. డాగ్ స్క్వాడ్‌ను కూడా రప్పించాడు ఎస్.ఐ అశోక్. సమీపంలోని పొదల్లో ఓ గ్రానైట్ రాయి దొరికింది. దానికి రక్తం అంటుకుని ఉంది. నేరస్తుడు ఉపయోగించిన ఆయుధం అన్నమాట. పోలీసు కుక్కను వదిలితే వాసన పసిగడుతూ సమీపంలోని దర్గా వద్దకు, అక్కడనుంచి శంషాబాద్ బస్టాప్ వరకు వెళ్లి ఆగింది. ‘ఏం చేద్దాం సార్’ అన్నాడు డాగ్ స్క్వాడ్ కానిస్టేబుల్ ఎస్.ఐతో.‘ఒక గ్రానైట్ రాయితో రెండుకాళ్లను పూర్తిగా తెగ్గొట్టడం మాటలు కాదు. ఒకే వ్యక్తి ఈ పని చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఒకరి కంటే ఎక్కువ మంది లేదా ఏదైనా బందిపోటు ముఠా ఈ ఘాతుకానికి పాల్పడి ఉండాలి’ అన్నాడు ఎస్.ఐ అశోక్.ఇంతలో సైబరాబాద్ కమిషనర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘అశోక్ హియర్ సార్! స్పాట్‌లోనే ఉన్నాను. ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేశాం’ చెప్పాడు అశోక్.‘నీకెలాంటి టీం కావాలన్నా ఇస్తా. కానీ 24 గంటల్లో నేరస్తుడు దొరకాలి’ అన్నాడు కమిషనర్.
మధ్యాహ్నానికి ఫింగర్‌ఫ్రింట్స్ వచ్చాయి. ‘సార్! పాత నేరస్తుల జాబితాతో ఎక్కడా మ్యాచ్ కాలేదు’ చెప్పాడు హెడ్ కానిస్టేబుల్. ఎస్.ఐ. అశోక్ తల పంకించి ‘ఆమెను చూసి వద్దాం పదా’ అంటూ ఉస్మానియాకు బయల్దేరాడు.అప్పటికే ఆమె ఎమర్జన్సీలో ఉంది. వేగంగా వైద్యం చేస్తున్నారు డాక్టర్లు.‘కాళ్లు రెండూ నరికి చాలా సేపయింది. వాటిని అతికించలేం. సారీ’ అన్నాడు డాక్టర్ అశోక్‌తో.‘నా అంచనా ప్రకారం రాత్రి 11 నుంచి 12 గంటల మధ్యలో ఘటన జరిగి ఉంటుంది. ఇక ఆ అభాగ్యురాలికి అవిటి బతుకు తప్పదు’ నిట్టూర్చాడు డాక్టర్. ‘ఇపుడు ఆమెతో మాట్లాడొచ్చా?’ అడిగాడు ఎస్.ఐ. ‘సారీ! ప్రస్తుతం స్ప్పహలో లేదు’ బదులిచ్చాడు డాక్టర్. ‘ఆమె ఎలాగైనా కళ్లు తెరవాలి డాక్టర్. ఆమె స్టేట్‌మెంట్ ఇపుడు ఎంతో కీలకం’ ‘చాలా రక్తం పోవడం వల్ల స్ప్పహలో లేదు. అంతరక్తం పోయినా అసలామె ఇంతసేపు బతికి ఉండటమే చాలా గొప్ప విషయం. స్పృహ వస్తే ఇన్‌ఫామ్ చేస్తాను’ అన్నాడు డాక్టర్. ఎస్.ఐ. తిరిగి శంషాబాద్ పిఎస్‌కు చేరుకున్నాడు. చుట్టుపక్కల గ్రామాల్లోని పోలీసు ఇన్ఫార్మర్లు, పశువుల కాపర్లను పిలిపించాడు. అందరిదీ ఒకే సమాధానం ..‘ఆమె ఎవరో తెలియదు.’
ఆలోచనల్లో పడ్డాడు ఎస్.ఐ. బాధితురాలు ఓ నడిఈడు మహిళ. మెడలో పసుపుతాడు, కట్టుకున్న చీర ఆధారంగా పేద మహిళ అని ఇట్టే తెలిసిపోతుంది. మహిళ స్థానికురాలు కాదు. కాబట్టి పక్కనున్న బీదర్, రాయచూర్ లేదా పాలమూరు జిల్లా మహిళ అయి ఉండవచ్చని అనుమానించాడు. మిగతా పోలీస్‌స్టేషన్లకు ఆమె ఫొటో పంపాడు. ఎక్కడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదని తెలిసింది. మరి అయితే, ఈమె ఎవరు? ఈమె కాళ్లు నరకాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? సాయంత్రం సమయంలో ఉస్మానియా నుంచి ఫోన్ చేశాడు కానిస్టేబుల్. ‘సార్.. ఆమెకి స్ప్పహ వచ్చింది’ అన్నాడు. వాయువేగంతో ఆసుపత్రిలో వాలాడు ఎస్.ఐ. తన ఊరు, పేరు, వివరాలు చెప్పింది ఆమె. కానీ తన కాళ్లు నరికిన వ్యక్తి ఎవరో తెలియదంది. ఆ సమాధానంతో మైండ్ బ్లాంక్ అయింది ఎస్.ఐకి. అదేంటి? నీకు తెలియకుండా మీ ఊరు నుంచి ఇక్కడిదాకా అతనితో ఎందుకు వచ్చావు?’ ‘కూలి పని ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చాడు సార్!’ అని చెప్పింది. ‘వాడి వివరాలు చెప్పగలవా?’ అన్నాడు ఎస్.ఐ. వాడికి 40 ఏళ్లపైనే ఉంటాయి సార్. ఆ టైంలో తాగి ఉన్నాడు. తాగడానికి డబ్బులు కూడా నేనే ఇచ్చా. అంతకుమించి నాకేం గుర్తులేదు’ అంటూ ఏడ్వడం ప్రారంభించింది. ‘పోనీ అతని గుర్తులేమైనా చెప్పగలవా?’ ‘నాకేం గుర్తులేదు...’ మళ్లీ అదే సమాధానం.ఇక లాభం లేదనుకుని నెత్తిన క్యాప్ పెట్టుకుని ముందుకు నడిచాడు. సార్...!’ ఆమె పిలవడంతో వెనక్కి తిరిగాడు. ‘ఇపుడు గుర్తొచ్చింది.. సార్!’ అంది.విషయం విన్న ఎస్సైకి పోయిన ప్రాణం లేచివచ్చినట్లయింది. ఈ ఒక్క విషయం చాలు. వాడిని పట్టుకునేందుకు. అసలు వాడెవడో నీకు తెలియనపుడు నీ కాళ్లు నరకాల్సిన అవసరం వాడికెందుకు వచ్చింది?’ అన్నాడు ఎస్.ఐ. ‘ఏమో సార్! కూలి పని చేసుకుని బతికేదాన్ని, నా కాళ్లకు కడియాలు, పట్టీలు తప్ప మరేం లేవు’ అని మళ్లీ బోరుమంది. అంతే! ఎస్.ఐకి విషయం అర్థమైంది.
శంషాబాద్‌లోని అన్ని బంగారు దుకాణాలు, కల్లు కాంపౌండ్లలో నిఘా పెట్టారు పోలీసులు. సాయంత్రం షాద్‌నగర్‌లోని ఓ కల్లు కాంపౌండ్ నుంచి ఇన్‌ఫార్మర్ ఫోన్ వచ్చింది. పచ్చరంగు టీషర్టు వేసుకున్న వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడన్నది ఆ కాల్ సారాంశం. పోలీసులు వెంటనే ఆ కల్లు కాంపౌండ్‌ను చుట్టుముట్టారు. అంతమంది పోలీసులు ఒకేసారి రావడంతో మందుబాబులంతా కంగారు పడ్డారు. కొందరు పరుగులు తీశారు. ఇంకొందరు పరిగెత్తలేక అక్కడే ఉన్నారు. కానీ, పోలీసులు నేరుగా వెళ్లి రాజయ్యనే పట్టుకున్నారు. పీకలదాకా కల్లు తాగిన రాజయ్యకు వచ్చింది పోలీసులన్న సంగతి కూడా తెలియట్లేదు.
శంషాబాద్ పోలీస్ స్టేషన్...ఇన్వెస్టిగేషన్ రూమ్‌లో రాజయ్యకు ఎదురుగా కూర్చున్నాడు అశోక్. ‘ఇపుడు చెప్పు ఈ నేరం ఎందుకు చేశావు?’ ప్రశ్నించాడు ఎస్.ఐ. సార్... ఆ రోజు కల్లు కాంపాండ్ యజమాని పాతబాకీ కట్టకుండా కల్లు ఇవ్వనన్నాడు. దీంతో ఎవరినైనా తెలిసినవారిని డబ్బులు అడుగుదామని బస్టాప్‌దాకా వచ్చాను. అక్కడ కూలి పని కోసం ఎదురుచూస్తోన్న ఒకామె కనిపించింది. ఆమె కాళ్లకున్న కడియాలు నా కంట్లో పడ్డాయి. నేనొక మేస్త్రీని, శంషాబాద్‌లో పనిచేస్తా. నాతో వస్తే పని ఇప్పిస్తానని చెప్పా. నా మాటలు నమ్మి ఆమె నాతో వచ్చింది. ఆమె డబ్బులతోనే కల్లు కొని తాగుదామని పొదల్లోకి తీసుకెళ్లా. కల్లు తాగాక నా బుర్ర నా చేతుల్లో ఉండదు. కడియాల కోసం ఇంతపని చేశా. కడియాలు కుదవపెడితే నాలుగువేల రూపాయలు వచ్చాయి. మార్వాడీ కొట్టయితే అనుమానం వస్తుందని, తెలిసినవాడికి అమ్మేశా’ చెప్పాడు. మళ్లీ అతనే ‘సార్, ఎవరికీ తెలియకుండా ఈ పని చేశా. నన్నెలా పట్టుకున్నారు’‡ అన్నాడు.రాజయ్య కుడిచేతిని చూపిస్తూ ‘ఈ కాల్చిన గుర్తుతో’ అన్నాడు ఎస్.ఐ.
‘నీకు కామెర్లు వచ్చినపుడు నాటువైద్యం చేయించుకున్నావుగా.. అదే గుర్తు నిన్ను పట్టించింది. ఆమె ఇచ్చిన సమాచారంలో అతని కుడిచేతిమీద కాలిన గాయం తాలూకు మచ్చ ఉంది అని చెప్పింది. ఆ మచ్చ గల మనిషి ఎవరు వచ్చినా తెలియజేయమని అన్ని కల్లు కాంపౌండ్ల యజమానులకు ఇన్‌ఫామ్ చేశాం. రెండో క్లూ.. నీకు పనీపాటా లేదు. ఎపుడూ కల్లు కాంపౌండ్లలో అప్పు చేసి, వారిని వీరిని బతిమిలాడి తాగేవాడివి. కానీ రెండురోజులుగా నాన్‌స్టాప్‌గా తాగుతున్నావు. పాతబాకీ కట్టేశావు. ఈ రోజు ఉదయం నుంచి నీ మిత్రులకూ తాగిస్తున్నావు. చేతిలో చిల్లిగవ్వ ఉండని నువ్వు ఇంత ఖర్చు పెడుతుంటే నీ స్నేహితులకే అనుమానం వచ్చి మాకు ఉప్పందించారు..’ అన్నాడు ఎస్.ఐ. రాజయ్య తలదించుకున్నాడు.అపరిచితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించా లని ఈ కేసు మరోమారు హెచ్చరించింది.
- అనిల్‌కుమార్ భాషబోయిన
Comments
Please login to add a commentAdd a comment