ఈ రంగంలో అర్హతలు, నైపుణ్యాలు పెంచుకుంటే.. కోరుకున్న కొలువు మీ సొంతం | Employment: Job Opportunities And Career Growth In Financial Sector | Sakshi
Sakshi News home page

ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్టార్‌.. అర్హతలుంటే కోరుకున్న కొలువు మీ సొంతం

Published Wed, Nov 24 2021 10:41 AM | Last Updated on Wed, Nov 24 2021 10:53 AM

Employment: Job Opportunities And Career Growth In Financial Sector - Sakshi

ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్టార్‌.. అర్హతలుంటే కొలువులు ఖాయం చేస్తున్న రంగం. ఎంట్రీ లెవల్‌ మొదలు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ల వరకూ.. చక్కటి ఆఫర్లు అందిస్తోంది. ఇటీవల ఈ రంగం టెక్నికల్‌ నుంచి స్పెషలైజ్డ్‌ జాబ్‌ ప్రొఫైల్స్‌ వరకూ.. భారీగా నియామకాలు చేపడుతోంది! ఉద్యోగార్థులు.. సంబంధిత అర్హతలు, నైపుణ్యాలు పెంచుకుంటే.. కోరుకున్న కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఫైనాన్షియల్‌ సేవల రంగంలో తాజా రిక్రూట్‌మెంట్‌ ట్రెండ్స్‌.. కొలువులు..అర్హతలు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం..

కరోనా పరిణామాల్లో అంతా డిజిటలైజేషన్‌ బాట పట్టారు. దాంతో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగంలో కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. ఈ సెక్టార్‌ పరిధిలోకి వచ్చే ట్రేడింగ్, స్టాక్‌ మార్కెట్, బీఎఫ్‌ఎస్‌ఐ, మ్యూచువల్‌ ఫండ్స్, ఈక్విటీ.. ఇలా అన్నింటిలోనూ కార్యకలాపాలు తిరిగి వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా ఫైనాన్షియల్‌ రంగంలో నియామకాలు ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకూ.. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్టార్‌లోని సంస్థల్లో నమోదైన నూతన నియామకాల సంఖ్యే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.

అందుకే కొలువులు
గత కొంత కాలంగా అనేక సంస్థలు స్టాక్‌ మార్కెట్లో ఐపీఓల బాటపట్టాయి. వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు, ప్రయివేట్‌ ఈక్విటీ సంస్థలకు నిధులు భారీగా వస్తున్నాయి. ట్రేడింగ్‌ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. మరోవైపు సంస్థలు టెక్నాలజీ ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించడంపై దృష్టిపెడుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగం సైతం విస్తరిస్తోంది. ఇవన్నీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్టార్‌లో నియామకాల జోరుకు కారణాలుగా చెబుతున్నారు. వీటన్నింటి ఫలితంగా సంప్రదాయ డిగ్రీ అభ్యర్థులు మొదలు టెక్నికల్, ప్రొఫెషనల్‌ కోర్సుల ఉత్తీర్ణుల వరకూ..ఫైనాన్షియల్‌ రంగంలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. 

జూనియర్, మిడిల్‌ లెవల్‌
ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్టార్‌లో.. జూనియర్, మిడిల్‌ లెవల్‌లో భారీగా నియామకాలు జరుగుతున్నాయి. కరోనా ముందుకాలం నాటి ఆఫర్స్‌తో పోల్చుకుంటే.. సగటున 30 నుంచి 50 శాతం మేర కొత్త కొలువులు లభించాయి. జూనియర్‌ లెవల్‌లో 1 నుంచి 4ఏళ్ల అనుభవం ఉన్న వారిని, మిడిల్‌ లెవల్‌లో అయిదు నుంచి 13ఏళ్ల అనుభవం ఉన్న వారిని సంస్థలు నియమించుకుంటున్నాయి.

బీఎఫ్‌ఎస్‌ఐ.. ఎవర్‌గ్రీన్‌
ఫైనాన్షియల్‌ సెక్టార్‌ అనగానే గుర్తుకొచ్చే బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఐ) సెక్టార్‌లోని సంస్థలు.. రిక్రూట్‌మెంట్స్‌లో ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తున్నాయి. 2020 సెప్టెంబర్‌తో పోలిస్తే.. 2021 సెప్టెంబర్‌ నాటికి బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో 43 శాతం అధికంగా నియామకాలు జరిగినట్లు నౌకరీ జాబ్స్‌ స్పీక్‌ ఇండెక్స్‌ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 

టాలెంట్‌ కొరత
ఫైనాన్స్‌ రంగంలో భారీగా నియామకాలు జరుగుతున్నప్పటికీ.. కంపెనీలకు అవసరమైన టాలెంట్‌ కొరత నెలకొన్నట్లు చెబుతున్నారు. నైపుణ్యాలున్న మానవ వనరులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలు కంపెనీలు, స్టాఫింగ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా స్టాక్‌ బ్రోకింగ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో ఈ సమస్య కొంత ఎక్కువగా ఉంది. 

వేతనాలు ఆకర్షణీయం
నైపుణ్యాలున్న వారికి ఫైనాన్షియల్‌ రంగ సంస్థలు ఆకర్షణీయ ప్యాకేజీలు అందిస్తున్నాయి. జూనియర్‌ లెవల్‌లో సగటున రూ.8లక్షలు, మిడిల్‌ లెవల్‌లో రూ.12లక్షలు, సీనియర్‌ లెవల్‌లో రూ.18లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. 


ఫైనాన్షియల్‌ రంగం.. జాబ్‌ ట్రెండ్స్‌.. ముఖ్యాంశాలు
►   ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్యలో భారీగా నియామకాలు.
►   జూనియర్, మిడిల్‌ లెవల్‌లో 30 నుంచి 50 శాతం వరకూ పెరుగుదల.
►   జూనియర్‌ లెవల్‌లో రూ.8 లక్షలు, మిడిల్‌ లెవల్‌లో రూ.12లక్షలు, సీనియర్‌ లెవల్‌లో సగటున రూ.18 లక్షల వరకు వేతనాలు.
►   సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఏఐ–ఎంఎల్‌ నిపుణులకు డిమాండ్‌.

రీసెర్చ్‌ అనలిస్ట్‌
ఫైనాన్షియల్‌ రంగంలో ముఖ్యంగా స్టాక్‌ బ్రోకింగ్, ఈక్విటీ, ట్రేడింగ్‌ సంస్థల్లో కీలకంగా నిలుస్తున్న జాబ్‌ ప్రొఫైల్‌.. రీసెర్చ్‌ అనలిస్ట్‌. ఆయా స్టాక్స్‌కు సంబంధించి రీసెర్చ్‌ చేసి ఫండ్‌ మేనేజర్లకు వాటి సానుకూలతలు, ప్రతికూలతల గురించి సూచించడం.. క్లయింట్ల కోసం ఈక్విటీ డెరివేటివ్స్, ఈక్విటీస్‌పై విశ్లేషణ వీరి ప్రధాన విధులు.ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌ బ్రోకరేజ్‌ సంస్థలు.. ఎంబీఏ, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌లో పీజీ ఉత్తీర్ణులను రీసెర్చ్‌ అనలిస్టులుగా నియమించుకుంటున్నాయి. 

ఫండ్‌ మేనేజర్‌
ఆయా ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల డబ్బును పెట్టుబడిగా పెడుతుంటారు. అలాంటి సందర్భంలో సదరు సంస్థల ప్రస్తుత పనితీరు, ఆర్థిక ఫలితాలు, లాభనష్టాలు, డివిడెండ్స్‌.. భవిష్యత్‌లో ఆ సంస్థల పనితీరు ఎలా ఉండబోతోంది వంటి అంశాలను విశ్లేషించి.. ఇన్వెస్టర్లకు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. నిర్దిష్ట ఫండ్‌లలో పెట్టుబడుల గురించి ఇన్వెస్టర్లను ఒప్పించడం వంటి కీలక విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు.. ఎంబీఏ, సీఏ, ఫైనాన్షియల్‌ ప్లానింగ్, కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌ విభాగంలో పీజీ స్థాయి అర్హతలు ఉన్న వారికి ఆఫర్స్‌ ఇస్తున్నాయి. 

ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌
సెక్యూరిటీ పోర్ట్‌ఫోలియోస్‌లో ఇన్వెస్టర్ల తరఫున పెట్టుబడుల నిర్వహణ.. ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్ల ప్రధాన విధి. వీరు నిత్యం సెక్యూరిటీస్‌ క్రయ విక్రయాలు, పోర్ట్‌ఫోలియో సమీక్ష, లావాదేవీల పరిష్కారం, సంబంధిత స్టాక్స్, పనితీరు, నియంత్రణ,క్లయింట్ల(ఇన్వెస్టర్లు)కు నివేదించడం వంటివి చేయాల్సి ఉంటుంది. సంస్థలు కామర్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్‌తో బ్యాచిలర్, పీజీ ఉత్తీర్ణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. 

టెక్‌ నిపుణులకు అవకాశం
ఫైనాన్షియల్‌ రంగంలోని సంస్థలు.. ఇన్వెస్ట్‌మెంట్‌ అనాలసిస్‌లో బిగ్‌ డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి లేటెస్ట్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఫలితంగా బీటెక్, ఎంటెక్‌ తదితర కోర్సుల ఉత్తీర్ణులకు ఈ రంగంలో కొలువులు లభిస్తున్నాయి. యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్‌
పాలసీ మొత్తం, దాని ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియం, చెల్లించే సామర్థ్యం, వయసు తదితరాలు గణించి.. పాలసీకి అర్హతలు నిర్ణయించే వారే..యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్‌. వీరికి బీమా సంస్థలు పెద్ద పీట వేస్తున్నాయి. ఇందుకు ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. యాక్చుయేరియల్‌ సొసైటీ నిర్వహించే కోర్సుల ఉత్తీర్ణులకు ఆఫర్స్‌ ఖరారు చేస్తున్నాయి.

అండర్‌ రైటర్స్‌
ఇన్సూరెన్స్‌ సంస్థల్లో మరో కీలకమైన కొలువు..అండర్‌ రైటర్స్‌. ఎవరైనా ఒక వ్యక్తి పాలసీ తీసుకోవాలనే ప్రతిపాదన చేసినప్పుడు.. దాన్ని పరిశీలించి, సదరు పాలసీకి ఆ వ్యక్తి సరితూగుతారో లేదో నిర్ణయించడం వీరి ప్రధాన విధి. ప్రత్యేక అర్హతలున్న వారికే సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అందించే అసోసియేట్‌ డిప్లొమా ఉత్తీర్ణులకు బీమా సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. 

రిస్క్‌ అనలిస్ట్స్‌
నాన్‌–లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలో.. పాలసీ చేయాలనుకున్న వస్తువులు లేదా నిర్మాణాలను పరిశీలించి.. వాటి జీవిత కాలాన్ని పరిగణనలోకి తీసుకొని రిస్క్‌ అనలిస్ట్‌లు నివేదికలు ఇస్తారు. సదరు నివేదిక ఆధారంగానే సంస్థ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయిస్తుంది.

క్లెయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌
పాలసీ క్లెయిమ్‌ల పరిష్కారంలో వీరి పాత్ర కీలకం. ముఖ్యంగా పాలసీ వ్యవధి పూర్తి కాకుండానే ఏదైనా సంఘటన జరిగిందని.. ఆ కారణంగా బీమా చెల్లించాలనే విషయంపై తుది నిర్ణయం వీరిచ్చే నివేదికపైనే ఆధారపడి ఉంటుంది. క్లెయిమ్‌ ఎగ్జిక్యూటివ్స్‌.. సదరు బీమా మొత్తం కోసం వచ్చిన ప్రతిపాదనను పరిశీలించి, డ్యామేజ్‌ విలువను లెక్కిస్తారు. ఆ మొత్తానికి బీమా పరిష్కారం లభిస్తుంది. 

బ్యాంకింగ్‌లో అవకాశాలు
బ్యాంకింగ్‌ రంగంలో.. క్షేత్ర స్థాయిలో కస్టమర్లతో సంప్రదింపులు సాగించే కస్టమర్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ మొదలు ఉన్నత స్థాయిలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ వరకూ.. అనేక రకాల అవకాశాలు లభిస్తున్నాయి. బిజినెస్‌ బ్యాంకింగ్‌ మేనేజర్, కార్పొరేట్‌ బిజినెస్‌ సేల్స్‌ మేకర్, బ్రాంచ్‌ సర్వీస్‌ పార్ట్‌నర్, ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ ఆఫీసర్, రిస్క్‌ ఎగ్జిక్యూటివ్స్, ఫైనాన్షియల్‌ ప్లానర్‌ వంటి ఉద్యోగాలు బ్యాంకింగ్‌ రంగంలో అందుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement