
మున్సిపల్ ఉద్యోగుల సమ్మె నోటీసు
* 20వ తేదీలోగా సమస్యలు పరిష్కరించాలి
* మంత్రి నారాయణకు వర్కర్స్ యూనియన్ నోటీసు
* పెన్ డౌన్ యోచనలో మున్సిపల్ కమిషనర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లు ఈ నెల 20వ తేదీలోగా పరిష్కరించకపోతే ఆ తర్వాత ఏ క్షణంలో అయినా సమ్మెలోకి వెళతామని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) హెచ్చరిం చింది. ఈమేరకు ఆ సంఘం అధ్యక్షురాలు సామ్రాజ్యం, ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావులతో పాటు మరి కొంతమంది సభ్యులు మంగళవారం సచివాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సమ్మె నోటీసును అందజేశారు. ఈ నెల 20వ తేదీలోగా తమ సమస్యలను పరిష్కరించకపోతే ఏ క్షణంలో అయినా సమ్మెలోకి వెళతామని సీఐటీయూ కార్యదర్శి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మంత్రితో పాటు మున్సిపల్ కమిషనర్ అండ్ డెరైక్టర్‌కూ నోటీసు ఇచ్చారు. ఈ సమ్మెకు తమ మద్దతు ఇస్తున్నట్టు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ తెలిపింది.
పెన్ డౌన్ యోచనలో కమిషనర్లు
మంత్రితో పాటు ఉన్నతాధికారుల వ్యవహార తీరుపై ఏపీ మున్సిపల్ కమిషనర్లు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే పెన్ డౌన్ నిరసన చేపట్టాలనే వారు ఆలోచిస్తున్నట్లు తెలిసిం ది. రోజూ సమావేశాలు, ఫోన్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుండటం, రాత్రి 11 గంటలకు కూడా మంత్రి పేషీ వద్దే ఉండాల్సిరావడం, వారానికోసారి హైదరాబాద్‌కు పిలవ డం, పగలు రాత్రి తేడా లేకుండా మీటింగ్‌లు పెట్టడం తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కమిషనర్లు వాపోతున్నారు. దీనివల్ల మున్సిపాలిటీల్లో ఒక్క పనీ జరగడం లేదని.. పైగా పనిచేయలేకపోతే ఇంటికెళ్లిపోండి అంటూ మంత్రి అనడం బాధ కలిగిస్తోందని ఓ కమిషనర్ ఆవేదన వ్యక్తంచేశారు. పెన్ డౌన్ ఎప్పటి నుంచి చేపట్టాలనే అంశంపై కమిషనర్లు చర్చిస్తున్నట్లు తెలిసింది.