పాత టెండర్లు రద్దు.. వచ్చేనెల 31 లోపు కొత్త టెండర్లు
మంత్రి నారాయణ వెల్లడి
సాక్షి, అమరావతి: రాజధాని అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను రద్దు చేసి త్వరలో కొత్తగా టెండర్లను పిలుస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం అధ్యక్షతన 39వ సీఆర్డీఏ సమావేశం అనంతరం ఆయన వివరాలను మీడియాకు వివరించారు.
అమరావతి అభివృద్ధి పనుల కోసం 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, రూ.38 వేల కోట్ల పనులను ప్రారంభించినట్టు తెలిపారు. వీటిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు, రహదారులు, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, అధికారుల వసతి గృహాల నిర్మాణం చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ఈ పనులను కొనసాగించేందుకు శ్రద్ధ చూపలేదన్నారు.
పాత టెండర్ల సమస్యలను పరిష్కరించి నూతన టెండర్లకు విధి విధానాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ 23 పాయింట్లతో గతనెలలో నివేదిక ఇవ్వగా, ఈ సమావేశంలో దానిని ఆమోదించినట్టు చెప్పారు. దాని ప్రకారం హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణానికి జనవరిలోగా, మిగతా పనులకు వచ్చేనెల 31 లోపు టెండర్లు పిలుస్తామని, మూడేళ్లలో వీటిని పూర్తి చేస్తామని వివరించారు.
వరద నివారణ పనులు
అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుక ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని, అయితే నిబంధనల మేరకు వరద నివారణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరిందని తెలిపారు. అందుకనుగుణంగా అమరావతిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో వరద నివారణ పనులను ఆమోదించామన్నారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌ను విస్తరిస్తామని చెప్పారు.
నీరుకొండ వద్ద 0.04 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.01 టీఎంసీలు, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీల స్టోరేజి సామర్ధ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కుల పంపింగ్ స్టేషన్ నిర్మిస్తామని చెప్పారు. గతంలో నిర్ణయించిన ప్రకారం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం త్వరలో చేపడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment