ఖమ్మం, న్యూస్‌లైన్ : సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె రెండోరోజుకు చేరింది. ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు పట్టణాలలో మంగళవారం కూడా కార్మికులు విధులు బహిష్కరించి ర్యాలీలు నిర్వహించారు. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంతోపాటు, మణుగూరు, కొత్తగూడెం మున్సిపాలిటీల ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్మికుల సమ్మె కారణంగా పారిశుధ్యపనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వీధులు దుర్గంధం వెదజల్లు తున్నాయి. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండగా... మురికికాలువలు తీసేవారు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి ఇబ్బందికరంగా మారింది. కాగా, మున్సిపల్ కార్మికుల సమ్మెకు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. ఆయాపార్టీల నాయకులు ఆందోళన జరుపుతున్న కార్మికుల వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు.
ఖమ్మంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె రెండోరోజు విజయవంతమైంది. నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి కలెక్టరెట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ ఎస్. వెంకటేశ్వర్లు, సీపీఎం డివిజన్ కార్యాదర్శి ఎర్రా శ్రీకాంత్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి విష్ణు, ఐఎన్‌టీయూసీ నాయకులు బుర్రి వినయ్ కూమార్ మద్దతు తెలిపి... మాట్లాడుతూ ప్రభుత్వం దిగిరాకపోతే పతనం తప్పదని హెచ్చరించారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె రెండోరోజు కొనసాగింది. సమ్మె శిబిరం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మందా నర్సింహారావు, మధు సంఘీభావం తెలిపారు. కార్మికుల సమ్మె కారణంగా పట్టణంలో కొంతమేరకు పారిశుధ్య పనులు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
మణుగూరులో మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి పూలమార్కెట్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటే పరిష్కరించాలని సీఐటీయూ డివిజన్ ప్రదాన కార్యదర్శి గద్దల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
కదంతొక్కిన మున్సిపల్‌కార్మికులు
Published Wed, Oct 23 2013 3:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement