సాక్షి, కడప : సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా అన్ని వర్గాలు ధృడసంకల్పంతో ఆందోళనల్లో మమేకమవుతున్నారు. ఉద్యమకారులకు రోజూ ఇదో దైనందిన కార్యక్రమంగా మారిపోయింది. వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూ రోజూ వేలాది మంది రోడ్డెక్కుతూనే ఉన్నారు.
విభజన ప్రకటన వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. విజయవాడ ఆటోనగర్‌లో సమైక్యవాదులపై ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుచరుల దాడికి నిరసనగా కడప నగరంలో మున్సిపల్ ఉద్యోగులు, ఇరిగేషన్, న్యాయవాదులు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీఓల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు స్వచ్ఛందంగా విద్యుత్ దీపాలను ఆర్పి నిరసన తెలిపారు.
కడప నగరంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల అధ్యాపకులు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. రిమ్స్ ఉద్యోగులు ర్యాలీగా వచ్చి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. న్యాయవాదులు,న్యాయశాఖ ఉద్యోగులు, మున్సిపల్, వాణిజ్యపన్నులశాఖ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సర్కిల్‌లో నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్‌బాష, జిల్లా మహిళా అధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి నేతృత్వంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు.
ప్రొద్దుటూరులో ఎన్జీఓలు రాష్ర్టం విడిపోతే ఎండిపోతాం..కలిసుంటే పచ్చగా ఉంటాం అంటూ నినాదాలు చేస్తూ వినూత్న రీతిలో ఎండుచెట్లు, పచ్చని చెట్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు విద్యా సంస్థలు, విద్యార్థి జేఏసీ, మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యుల రిలే దీక్షలు కొనసాగాయి. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో జగన్ మాస్క్‌లు ధరించి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సోమవారిపల్లె సర్పంచ్ ప్రశాంతి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల దీక్షలు కొనసాగాయి.
రాజంపేటలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో తొంగూరుపేట పంచాయతీకి చెందిన చెంగారెడ్డి ఆధ్వర్యంలో 60 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. అన్నమయ్య ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి 10 రకాల పూలతో అభిషేకం చేశారు.
బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో వెంకటరామాపురానికి చెందిన మాజీ సర్పంచ్ బాలయ్య, వెంకటయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. బద్వేలు పట్టణంలో వీరారెడ్డి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సేవ్ ఏపీ ఆకృతిలో కూర్చొని నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు నడిరోడ్డుపైనే పాఠాలు బోధించారు.
పులివెందుల పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో ఆర్టీసీ బస్టాండు నుంచి పూల అంగళ్ల కూడలి వరకు అర్ధనగ్నంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నేతలు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, యర్రగంగిరెడ్డి, వరప్రసాద్ పాల్గొన్నారు. ఎన్జీఓలు, జేఏసీ సమన్వయకర్త శివప్రకాశ్‌రెడ్డి నాయకత్వంలో ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రైల్వేకోడూరు పట్టణంలో 1250 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఎస్‌పీ జూనియర్ కళాశాల విద్యార్థుల భరతమాత, జాతీయ నాయకులు, కవుల వేషధారణలతో నృత్య ప్రదర్శనలు చేశారు. పిరమిడ్ విన్యాసాలు చేపట్టారు. చెక్కభజన ఆకట్టుకుంది. హార్టికల్చర్ విద్యార్థుల దీక్షలు కొనసాగుతున్నాయి.
కమలాపురంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సావిత్రమ్మ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. మండల జేఏసీ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలిలో రాస్తారోకో నిర్వహించి ఆందోళనచేపట్టారు. వివిధ పాఠశాలల విద్యార్థులు కోలాటం, నాయకుల వేషధారణలతో నిరసన తెలిపారు. మైదుకూరు పట్టణంలో ఏవీఆర్ స్కూలు విద్యార్థులు 300 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. దేశ నాయకుల వేషధారణలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
జమ్మలమడుగులో పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. చెవిలో చెండుమల్లె పూలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. వీరికి మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి మద్దతు తెలిపారు. ఎర్రగుంట్లలో దీక్షలు కొనసాగాయి. రాయచోటిలో న్యాయవాదులు, జీవశాస్త్ర ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు తలపై కుర్చీలు పెట్టుకుని నిరసన తెలిపారు.
వజ్ర సంకల్పం
Published Sun, Sep 22 2013 2:09 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM
Advertisement
Advertisement