స్తంభించనున్న సేవలు | Services Will be interrupted due to APNGO strike | Sakshi
Sakshi News home page

స్తంభించనున్న సేవలు

Published Tue, Aug 13 2013 3:11 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM

Services Will be interrupted due to APNGO strike

తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్:  సమైక్యాంధ్ర పరిరక్షణకు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగ, కార్మికులు ఉద్యమబాటకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మున్సిపల్ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.లోకేశ్వర వర్మ ఉద్యోగ కార్మికులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా సోమవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ ఈశ్వరయ్య, ఉప కమిషనర్ ప్రతాప్‌రెడ్డికి ఉద్యోగుల సంతకాలతో కూడిన సమ్మె నోటీసును అందించారు.

సీమాంధ్రలోని మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగ, కార్మికుల భద్రత, ఈ ప్రాంతంలో నివసించే ప్రజల హక్కుల సాధన కోసం సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నామని నోటీసులో పేర్కొన్నారు. వర్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నట్టు ఇదివరకే ఏపీ ఎన్‌జీవోలతో కలసి తాము ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. అందులో భాగంగానే సీమాం ధ్రలోని 40వేల మంది ఉద్యోగులు, అన్ని రకాల కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటారని స్పష్టం చేశారు.

ఇందులో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల అసోసియేషన్ కూడా పాల్గొంటుందని అన్నారు. అయితే సమ్మెలో ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సేవలకు మినహాయింపు ఇస్తున్నట్టు వర్మ తెలిపారు. ఈ సేవలకు ఎలాంటి ఆటం కమూ ఉండదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించే వరకు తాము తలపెట్టిన నిరవధిక సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం నాయకులు సేతుమాధవ్, నాయకులు చిట్టిబాబు, షణ్ముగం, మధుసూదన్, మునిరాజ, కరుణాకర్, జ్యోతీశ్వర్‌రెడ్డి, రాజశేఖర్, కందాటి గిరిబాబు, జయప్రద, ఉమాదేవి, లక్ష్మీ, లావణ్య, రాణెమ్మ, రెడ్డికుమారి ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement