మునిసిపల్ ఖాళీ స్థలాలపై పన్ను
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లో ఖాళీ స్థలాలపై పన్ను వడ్డించాలని పురపాలక శాఖ కమిషనర్ అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లను ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థలు ఆదాయ వనరులు పెంచుకోవడానికి వీలుగా ఖాళీ స్థలాలపై తప్పనిసరిగా పన్ను వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంటి పన్ను వసూలు చేస్తున్న మాదిరిగానే ఖాళీ స్థలాలపై పన్ను వసూలు చేయాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీల చట్టంలోనూ ఈ నిబంధన ఉన్నప్పటికీ ఆయా మున్సిపాలిటీలు దీనిని పట్టించుకోవడం లేదని, ఇకపై కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
పట్టణాల్లో ఖాళీ స్థలం మార్కెట్ విలువపై 0.20 శాతం పన్ను, నగరాల్లో 0.50 శాతం పన్ను విధించాలని, పన్నునోటీసులు పంపించిన తరువాత నిర్ణీత వ్యవధిలోగా చెల్లించని పక్షంలో వారి నుంచి అదనంగా రెండు శాతం వడ్డీ వసూలు చేయాలని కూడా సూచించారు. ముందుగా పట్టణాభివృద్ది సంస్థలు లేదా నగర పాలక సంఘాలు లే అవుట్‌లు మంజూరు చేసిన వాటిల్లో ఉన్న ఖాళీ ప్రదేశాలను సర్వే చేయాలని, ఆ తరువాత లే అవుట్‌లు లేకున్నా అభివృద్ది చెందిన ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణం అనుమతి కోసం వచ్చినప్పుడు వేకె ంట్ ల్యాండ్ ట్యాక్స్(వీఎల్‌టీ) బకాయిలు ఏమీ లేని పక్షంలో భవ న నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని లేదంటే అనుమతి ఇవ్వడానికి వీల్లేదని పురపాలక శాఖ కమిషనర్ స్పష్టం చేశారు.
టౌన్ ప్లానింగ్ అధికారుల సాయంతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని, ఆ తరువాత ఆయా స్థలాల యజమానుల గురించి తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఎంకంబరెన్స్ సర్టిఫికేట్‌లు(ఈసీ) తీసుకుని, నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈసీలు ఇవ్వడానికి రిజిస్ట్రేషన్ శాఖ ఆలస్యం చేసే పక్షంలో ఈ విషయాన్ని కలెక్టర్ల దృష్టికి తీసుకుని వెళ్లాలని పేర్కొన్నారు. యజమానులకు నోటీసులు జారీ చేసే కార్యక్రమాన్ని డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఖాళీ స్థలాలకు ఒక నంబర్ ఇచ్చి.. దాని ఆధారంగా ప్రతీ సంవత్సరం పన్ను వసూలు చేయాలని సూచించారు.