Registration branch
-
వెబ్సైట్లో ‘రిజిస్ట్రేషన్ల’ సమగ్ర సమాచారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ శాఖ వెబ్సైట్ ప్రారంభించి చాలాకాలం అయినప్పటికీ అందులో అరకొర సమాచారం మాత్రమే ఉండేది. ప్రస్తుతం సమగ్ర సమాచారంతో www.registration.ap.gov.in వెబ్సైట్ను నిరంతరం అప్డేట్ చేస్తున్నారు. గ్రామాల వారీగా, వీధుల వారీగా స్థిరాస్తుల మార్కెట్ విలువలను పొందుపరిచారు. స్థిరాస్తి విక్రయం, బహుమతి (గిఫ్ట్) రిజిస్ట్రేషన్ల స్టాంపు డ్యూటీ వివరాలు ఉన్నాయి. అమ్మకం దస్తావేజు, తనఖా దస్తావేజు వంటి అన్ని రకాల నమూనా డాక్యుమెంట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ నమూనా పత్రాలను డౌన్లోడ్ చేసుకొని ప్రజలు వినియోగించుకోవచ్చు. నోటరీలు, స్టాంపు వెండర్ల వివరాలూ ఉన్నాయి. స్టాంపుల చట్టం, రిజిస్ట్రేషన్ల చట్టం, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన నియమ నిబంధనావళి వంటి సమగ్ర సమాచారాన్ని కూడా పొందవచ్చు. ఏదైనా స్థిరాస్తికి సంబంధించిన క్రయ విక్రయ లావాదేవీల(ఎంకంబరెన్స్ సర్టిఫికెట్-ఈసీ) వివరాలు కూడా వెబ్సైట్లోనే చూసుకునే వెసులుబాటును స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కల్పించింది. స్థిరాస్తుల క్రయ విక్రయ లావాదేవీలు తెలుసుకునేందుకు ఈసీల కోసం ‘మీసేవ’లో నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అయితే, ఇకమీదట ఈ వెబ్సైట్ ద్వారా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్యలో ఎవరైనా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి వెళ్లి.. స్థిరాస్తి లావాదేవీల తాజా వివరాలను ఈసీలు తీసుకోనవసరం లేకుండానే చూసుకోవచ్చు. ‘మీసేవ’ కేంద్రాల్లో ఈసీలు ఇస్తున్నందున పగటి సమయంలో ఈ సమాచారం చూసుకునే అవకాశం కల్పించలేదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అయితే, ‘మీసేవ’ కేంద్రాల ద్వారా ఈసీలు తీసుకోవడంలో చాలా సమస్యలున్నందున వెబ్సైట్ ద్వారా ఏ సమయంలోనైనా ఈసీల సమాచారం తెలుసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
మునిసిపల్ ఖాళీ స్థలాలపై పన్ను
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లో ఖాళీ స్థలాలపై పన్ను వడ్డించాలని పురపాలక శాఖ కమిషనర్ అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లను ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థలు ఆదాయ వనరులు పెంచుకోవడానికి వీలుగా ఖాళీ స్థలాలపై తప్పనిసరిగా పన్ను వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంటి పన్ను వసూలు చేస్తున్న మాదిరిగానే ఖాళీ స్థలాలపై పన్ను వసూలు చేయాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీల చట్టంలోనూ ఈ నిబంధన ఉన్నప్పటికీ ఆయా మున్సిపాలిటీలు దీనిని పట్టించుకోవడం లేదని, ఇకపై కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. పట్టణాల్లో ఖాళీ స్థలం మార్కెట్ విలువపై 0.20 శాతం పన్ను, నగరాల్లో 0.50 శాతం పన్ను విధించాలని, పన్నునోటీసులు పంపించిన తరువాత నిర్ణీత వ్యవధిలోగా చెల్లించని పక్షంలో వారి నుంచి అదనంగా రెండు శాతం వడ్డీ వసూలు చేయాలని కూడా సూచించారు. ముందుగా పట్టణాభివృద్ది సంస్థలు లేదా నగర పాలక సంఘాలు లే అవుట్లు మంజూరు చేసిన వాటిల్లో ఉన్న ఖాళీ ప్రదేశాలను సర్వే చేయాలని, ఆ తరువాత లే అవుట్లు లేకున్నా అభివృద్ది చెందిన ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణం అనుమతి కోసం వచ్చినప్పుడు వేకె ంట్ ల్యాండ్ ట్యాక్స్(వీఎల్టీ) బకాయిలు ఏమీ లేని పక్షంలో భవ న నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని లేదంటే అనుమతి ఇవ్వడానికి వీల్లేదని పురపాలక శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారుల సాయంతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని, ఆ తరువాత ఆయా స్థలాల యజమానుల గురించి తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఎంకంబరెన్స్ సర్టిఫికేట్లు(ఈసీ) తీసుకుని, నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈసీలు ఇవ్వడానికి రిజిస్ట్రేషన్ శాఖ ఆలస్యం చేసే పక్షంలో ఈ విషయాన్ని కలెక్టర్ల దృష్టికి తీసుకుని వెళ్లాలని పేర్కొన్నారు. యజమానులకు నోటీసులు జారీ చేసే కార్యక్రమాన్ని డిసెంబర్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఖాళీ స్థలాలకు ఒక నంబర్ ఇచ్చి.. దాని ఆధారంగా ప్రతీ సంవత్సరం పన్ను వసూలు చేయాలని సూచించారు.