వెబ్‌సైట్‌లో ‘రిజిస్ట్రేషన్ల’ సమగ్ర సమాచారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ శాఖ వెబ్‌సైట్ ప్రారంభించి చాలాకాలం అయినప్పటికీ అందులో అరకొర సమాచారం మాత్రమే ఉండేది. ప్రస్తుతం సమగ్ర సమాచారంతో www.registration.ap.gov.in వెబ్‌సైట్‌ను నిరంతరం అప్‌డేట్ చేస్తున్నారు. గ్రామాల వారీగా, వీధుల వారీగా స్థిరాస్తుల మార్కెట్ విలువలను పొందుపరిచారు. స్థిరాస్తి విక్రయం, బహుమతి (గిఫ్ట్) రిజిస్ట్రేషన్ల స్టాంపు డ్యూటీ వివరాలు ఉన్నాయి. అమ్మకం దస్తావేజు, తనఖా దస్తావేజు వంటి అన్ని రకాల నమూనా డాక్యుమెంట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ నమూనా పత్రాలను డౌన్‌లోడ్ చేసుకొని ప్రజలు వినియోగించుకోవచ్చు. నోటరీలు, స్టాంపు వెండర్ల వివరాలూ ఉన్నాయి. స్టాంపుల చట్టం, రిజిస్ట్రేషన్ల చట్టం, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన నియమ నిబంధనావళి వంటి సమగ్ర సమాచారాన్ని కూడా పొందవచ్చు.
ఏదైనా స్థిరాస్తికి సంబంధించిన క్రయ విక్రయ లావాదేవీల(ఎంకంబరెన్స్ సర్టిఫికెట్-ఈసీ) వివరాలు కూడా వెబ్‌సైట్‌లోనే చూసుకునే వెసులుబాటును స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కల్పించింది. స్థిరాస్తుల క్రయ విక్రయ లావాదేవీలు తెలుసుకునేందుకు ఈసీల కోసం ‘మీసేవ’లో నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అయితే, ఇకమీదట ఈ వెబ్‌సైట్ ద్వారా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్యలో ఎవరైనా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. స్థిరాస్తి లావాదేవీల తాజా వివరాలను ఈసీలు తీసుకోనవసరం లేకుండానే చూసుకోవచ్చు. ‘మీసేవ’ కేంద్రాల్లో ఈసీలు ఇస్తున్నందున పగటి సమయంలో ఈ సమాచారం చూసుకునే అవకాశం కల్పించలేదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అయితే, ‘మీసేవ’ కేంద్రాల ద్వారా ఈసీలు తీసుకోవడంలో చాలా సమస్యలున్నందున వెబ్‌సైట్ ద్వారా ఏ సమయంలోనైనా ఈసీల సమాచారం తెలుసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.