Registration Act
-
మూడు ముళ్లకు రిజిస్ట్రేషన్! మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ యాక్ట్ ఏం చెప్తోంది
ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనేవారు.. ఇప్పుడు అదే పెళ్లిని నూరేళ్ల మంట అంటున్నారు నవదంపతులు. భార్యాభర్తల మధ్య సమన్వయం లేకపోవడం, అదనపు కట్నం వేధింపులు, దాడులతో పెళ్లయిన మూణ్నాళ్లకే ఎన్నో కొత్త జంటలు విడిపోతున్నాయి. మహిళలే ఎక్కువగా బాధితులై, పోలీసులను ఆశ్రయిస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ యాక్ట్‌ను తీసుకువచ్చింది. దీనిలో పేర్లు నమోదు చేసుకుంటే పెళ్లి అనే పవిత్ర బంధానికి భద్రత ఏర్పడుతుంది. ప్రస్తుతం దీనిపై అంతగా అవగాహన లేకపోవడంతో సర్కారు ఆశించిన ఫలితం నెరవేరడం లేదన్నది సుస్పష్టం. ప్రతీ వివాహాన్ని విధిగా నమోదు చేసుకోవాలని మహిళా సంక్షేమ శాఖ, మహిళా భద్రత కమిటీల సూచనల మేరకు జిల్లాలో వివాహ నమోదు, ప్రయోజనాలపై కథనం.. వీరఘట్టం (పార్వతీపురం మన్యం జిల్లా): ప్రతీ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ యాక్ట్–2012 చెబుతోంది. ఈ చట్టం అమలుకు గ్రామపంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే దీనిపై విస్తృత అవగాహన లేకపోవడం, పెళ్లి నిర్వాహకులు కూడా అంతగా ఆసక్తి చూపకపోవడంతో పెళ్లి రిజిస్ట్రేషన్లు అంతగా కనిపించడం లేదు. ఇదే చట్టాన్ని తప్పనిసరిగా అమలుచేస్తే బాల్యవివాహాల నిర్మూలనతో పాటు పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోతున్న చాలా జంటల బంధానికి భద్రత కల్పించవచ్చు. దీనిపై అవగాహన కలిగించేందుకు గ్రామీణ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలి. అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని విద్యావంతులు సూచిస్తున్నారు. పాలకొండలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 2 శాతం లోపురిజిస్ట్రేషన్లు.. ఈ ఏడాది పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,500 వివాహాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 25 పెళ్లిళ్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అయినట్లు సమాచారం. ఏటా వందలాది వివాహాలు జరుగుతున్నా కేవలం 2 శాతం లోపే అధికారికంగా వివాహ నమోదులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్రామసచివాలయ మహిళా పోలీసులు గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్లపై అవగాహన చేపడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనే మాట సర్వత్రా వ్యక్తమవుతోంది. వివాహాలకు చట్టబద్ధత ఉండాలి.. వివాహ రిజిస్ట్రేషన్‌కు ప్రోత్సహించాలి.. వివాహాలకు చట్టబద్ధత ఉండాలి. అలా అయితేనే భార్యాభర్తలిద్దరూ భాధ్యతతో మెలుగుతారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వివాహ రిజిస్ట్రేషన్‌కు ప్రోత్సహించాలి. – ఎం.శ్రావణి, డీఎస్పీ, పాలకొండ అవగాహన కల్పిస్తున్నాం.. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు పెళ్లి రిజిస్ట్రేషన్‌పై కూడా అప్పుడప్పుడూ గుర్తు చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో తరచూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, డిగ్రీ పూర్తయిన తర్వాతే పిల్లలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు చెబుతున్నాం. – యు.పూర్ణిమ, సీడీపీఓ, వీరఘట్టం -
రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 570 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటినుంచి అమల్లోకి రానున్న తెలంగాణ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం –2020లో భాగంగా మండల కేంద్రాల్లోని తహసీల్దారు కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ల చట్టం –1908 ప్రకారం రాష్ట్రంలోని 32 జిల్లాలను (హైదరాబాద్ మినహా) 10 కొత్త సబ్ జిల్లాలుగా పరిగణిస్తూ ఒక్కో సబ్ జిల్లాలో తహసీల్దార్ కార్యాలయాల వారీగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 570 తహసీల్ కార్యాలయాలను రిజిస్ట్రేషన్ల చట్టం–1908లోని సెక్షన్ 5 ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా నోటిఫై చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా రిజిస్ట్రేషన్ల చట్టం–1908 లోని సెక్షన్ 7(1) ప్రకారం తహశీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించారు. తహశీల్దారు అందుబాటులో లేని సమయాల్లో జిల్లా కలెక్టర్ అనుమతితో నాయబ్ తహశీల్దార్లు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ విధులు నిర్వహిస్తారని, తెలంగాణ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం –2020 పరిధిలోనికి వచ్చే భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్ల నుంచి తప్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం 2018లో రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసిన 94,95 జీవోలు రద్దవుతాయని, తాజా ఉత్తర్వులు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని, ఈ మేరకు ప్రభుత్వ గెజిట్‌లో నోటిఫై చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. మ్యుటేషన్ ఫీజు ఖరారు రిజిస్ట్రేషన్ విలువలో 0.1 శాతం.. లేదా పురపాలికల్లో రూ. 1000.. కార్పొరేషన్లలో రూ. 3 వేలు.. ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ఆటో మ్యుటేషన్ కోసం వసూలు చేయాల్సిన రుసుమును ఖరారు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సదరు ఆస్తి రిజిస్ట్రేషన్ విలువలో 0.1 శాతం లేదా పురపాలికల్లో రూ.1000, మునిసిపల్ కార్పొరేషన్లలో రూ.3 వేలు.. రెండింటిలో ఏది ఎక్కువ అయితే దానిని మ్యుటేషన్ ఫీజుగా వసూలు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని పురపాలికల్లో నిర్దేశిత మ్యుటేషన్ ఫీజులు లేకపోవడంతో కొత్త ఫీజులను ఖరారు చేసినట్టు పేర్కొన్నారు. -
సొంత స్థలాలపై చంద్రన్న కొరడా
సాక్షి, అమలాపురం: ఆ స్థలాలపై వారికి దాదాపు తొమ్మిది దశాబ్దాల కిందటే నాటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి హక్కు పత్రం జారీ అయింది. అప్పట్లో ఆ ప్రభుత్వమే లే అవుట్లు రూపాందించి కేటాయించిన ఇంటి స్థలాన్ని.. వారు పది వాయిదాలు చెల్లించి హక్కు పత్రాన్ని సొంతం చేసుకున్నారు. ‘గ్రౌండ్ రెంటల్’ విధానం పేరుతో నాటి ప్రభుత్వం అణాబేడా వడ్డీతో కలిపి పది రూపాయల లోపు వాయిదాలతో ఇళ్ల స్థలాలు ఇచ్చింది. కోనసీమలో ముఖ్యంగా అమలాపురం పట్టణంలో ఈ గ్రౌండ్ రెంటల్ విధానంలో 587 మంది ఇళ్ల స్థలాలు పొందారు. అంబాజీపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం తదితర మండలాల్లో దాదాపు 600 మంది ఈ విధానంలో ఇళ్ల స్థలాలు తీసుకున్నారు. 1925–28 సంవత్సరాల మధ్య ఈ ప్రక్రియ జరిగింది. ఇదంతా గతం. వర్తమానానికి వచ్చేసరికి ఆ స్థలాల హక్కును 22ఎ రిజిస్ట్రేషన్ యాక్ట్ హరిస్తోంది. 2017లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వక్ఫ్, దేవస్థానం, గ్రామకంఠం, ఈనాంలకు చెందిన భూములను ఎనెక్జ్యూర్–1 సెక్షన్ 22(ఎ) 1(బి) యాక్ట్‌లోకి తీసుకు వచ్చింది. తద్వారా ఆ భూములు అప్పటికి ఏ స్థితిలో ఉన్నారిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆంక్షలు విధించింది. నాడు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పొందిన గ్రౌండ్ రెంటల్ స్థలాలను కూడా అనాలోచితంగా ఈ యాక్ట్ పరిధిలోకి చేర్చేశారు. దీంతో గ్రౌండ్ రెంటల్ విధానంలో ఇళ్ల స్థలాలు పొందిన యజమానులు వాటిని అమ్ముకోలేక నానా ఇక్కట్లూ పడుతున్నారు. రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలకు బ్రేక్ చంద్రబాబు ప్రభుత్వం కొత్త యాక్ట్ పరిధిలోకి గ్రౌండ్ రెంటల్ భూములను చేర్చడంతో వాటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అంతేకాదు.. ఆ స్థలాల్లో అప్పటికే ఉన్న పాత భవనాలను తొలగించి, కొత్తగా ఇళ్లు నిర్మించుకుందామనుకున్న వారు బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు చేసిన ప్రయత్నాలకు కూడా బ్రేక్ పడింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములు, స్థలాలు కావడంతో బ్యాంక్‌లు కూడా వీటికి రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో అమలాపురం పట్టణంలో ఈ తరహాలో ఉన్న 587 స్థలాల్లోని ఇళ్ల యజమానుల్లో ఆందోళన నెలకొంది. పట్టణానికి చెందిన వ్యాపారి కాళ్లకూరి చిన్న సూర్యకుమార్ తన స్థలం రిజిస్టేషన్ కోసం 2017లో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే ‘మీ స్థలం 22 (ఎ) నిషేధిత భూముల జాబితాలో ఉంది. రిజిస్ట్రేషన్ చేయలేము’ అని చెప్పారు. దీంతో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. నాటి నుంచీ ఈ బాధితులు కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్‌కు ఎన్నోసార్లు వెళ్లి, వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. కోనసీమలో దాదాపు 1,200 మంది బాధితులు ఉన్నారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయవచ్చు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం 1925 నాటి గ్రౌండ్ రెంటల్ భూములకు సంబంధించి వాయిదాలు చెల్లించిన ఆధారాలు ఉంటే తీసుకురావాలనడంతో నాటి లిఖిత పూర్వక ఆధారాలను కూడా బాధితులు చూపించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. కొత్త ప్రభుత్వంలో సమస్య పరిష్కారం దిశగా కదలిక వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అమలాపురానికి చెందిన గ్రౌండ్ రెంటల్ స్థలాల బాధితులు జిల్లాకు చెందిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను కలసి తమ సమస్యపై వినతిపత్రం అందించారు. గ్రౌండ్ రెంటల్ విధానంలో 1925లో వాయిదాల రూపంలో స్థలాలు సంపాదించుకున్నట్టు లిఖితపూర్వక ఆధారాలు చూపిస్తున్నప్పుడు.. ఆ స్థలాలను నిషేధిత భూముల జాబితా నుంచి ఎందుకు తొలగించకూడదని డిప్యూటీ సీఎం బోస్ జిల్లా అధికారులను ప్రశ్నించారు. సాక్షాత్తు రెవెన్యూ మంత్రే ఈ సమస్యపై జోక్యం చేసుకోవడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గ్రౌండ్ రెంటల్ భూముల సమాచారంపై ఆర్డీవోలతో కలెక్టర్ ఇటీవల ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. కోనసీమలో వెలుగు చూసినట్లే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా విచారణ నిర్వహిస్తే ఈ తరహా స్థలాల సమస్యలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. -
గ్రామకంఠాలపై జీవో
రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఎ నుంచి మినహాయిస్తూ ఉత్తర్వు హైదరాబాద్: ప్రజల ఉమ్మడి అవసరాలకు ఉద్దేశించిన గ్రామ కంఠం భూములు ఇక మాయం కానున్నాయి. గ్రామ ఉమ్మడి అవసరాల నిమిత్తం బ్రిటిష్ కాలంలోనే గ్రామ కంఠాలను ఏర్పాటు చేయగా వీటిని రక్షించాల్సిన ప్రభుత్వం భక్షించేందుకు మార్గం సుగమం చేసింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఎ నుంచి గ్రామ కంఠం భూములను మినహాయిం చాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ బుధవారం జారీ చేసిన జీవో 187 ఇందుకు నిదర్శనం. గ్రామ కంఠం భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఎ నుంచి మినహాయిస్తూ గత ఫిబ్రవరి 16వ తేదీ జీవో 56 జారీ చేసింది. -
వెబ్సైట్లో ‘రిజిస్ట్రేషన్ల’ సమగ్ర సమాచారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ శాఖ వెబ్సైట్ ప్రారంభించి చాలాకాలం అయినప్పటికీ అందులో అరకొర సమాచారం మాత్రమే ఉండేది. ప్రస్తుతం సమగ్ర సమాచారంతో www.registration.ap.gov.in వెబ్‌సైట్‌ను నిరంతరం అప్డేట్ చేస్తున్నారు. గ్రామాల వారీగా, వీధుల వారీగా స్థిరాస్తుల మార్కెట్ విలువలను పొందుపరిచారు. స్థిరాస్తి విక్రయం, బహుమతి (గిఫ్ట్) రిజిస్ట్రేషన్ల స్టాంపు డ్యూటీ వివరాలు ఉన్నాయి. అమ్మకం దస్తావేజు, తనఖా దస్తావేజు వంటి అన్ని రకాల నమూనా డాక్యుమెంట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ నమూనా పత్రాలను డౌన్లోడ్ చేసుకొని ప్రజలు వినియోగించుకోవచ్చు. నోటరీలు, స్టాంపు వెండర్ల వివరాలూ ఉన్నాయి. స్టాంపుల చట్టం, రిజిస్ట్రేషన్ల చట్టం, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన నియమ నిబంధనావళి వంటి సమగ్ర సమాచారాన్ని కూడా పొందవచ్చు. ఏదైనా స్థిరాస్తికి సంబంధించిన క్రయ విక్రయ లావాదేవీల(ఎంకంబరెన్స్ సర్టిఫికెట్-ఈసీ) వివరాలు కూడా వెబ్సైట్లోనే చూసుకునే వెసులుబాటును స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కల్పించింది. స్థిరాస్తుల క్రయ విక్రయ లావాదేవీలు తెలుసుకునేందుకు ఈసీల కోసం ‘మీసేవ’లో నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అయితే, ఇకమీదట ఈ వెబ్సైట్ ద్వారా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్యలో ఎవరైనా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి వెళ్లి.. స్థిరాస్తి లావాదేవీల తాజా వివరాలను ఈసీలు తీసుకోనవసరం లేకుండానే చూసుకోవచ్చు. ‘మీసేవ’ కేంద్రాల్లో ఈసీలు ఇస్తున్నందున పగటి సమయంలో ఈ సమాచారం చూసుకునే అవకాశం కల్పించలేదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అయితే, ‘మీసేవ’ కేంద్రాల ద్వారా ఈసీలు తీసుకోవడంలో చాలా సమస్యలున్నందున వెబ్సైట్ ద్వారా ఏ సమయంలోనైనా ఈసీల సమాచారం తెలుసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.