సొంత స్థలాలపై చంద్రన్న కొరడా | Fraud Registration Act In Chandrababu In East Godavari District | Sakshi
Sakshi News home page

సొంత స్థలాలపై చంద్రన్న కొరడా

Published Mon, Aug 26 2019 9:43 AM | Last Updated on Mon, Aug 26 2019 9:43 AM

Fraud Registration Act In Chandrababu In East Godavari District - Sakshi

నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకు వాయిదాలు చెల్లించిన పుస్తకంలోని ఓ పేజీ

సాక్షి, అమలాపురం: ఆ స్థలాలపై వారికి దాదాపు తొమ్మిది దశాబ్దాల కిందటే నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి హక్కు పత్రం జారీ అయింది. అప్పట్లో ఆ ప్రభుత్వమే లే అవుట్లు రూపాందించి కేటాయించిన ఇంటి స్థలాన్ని.. వారు పది వాయిదాలు చెల్లించి హక్కు పత్రాన్ని సొంతం చేసుకున్నారు. ‘గ్రౌండ్‌ రెంటల్‌’ విధానం పేరుతో నాటి ప్రభుత్వం అణాబేడా వడ్డీతో కలిపి పది రూపాయల లోపు వాయిదాలతో ఇళ్ల స్థలాలు ఇచ్చింది. కోనసీమలో ముఖ్యంగా అమలాపురం పట్టణంలో ఈ గ్రౌండ్‌ రెంటల్‌ విధానంలో 587 మంది ఇళ్ల స్థలాలు పొందారు. అంబాజీపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం తదితర మండలాల్లో దాదాపు 600 మంది ఈ విధానంలో ఇళ్ల స్థలాలు తీసుకున్నారు. 1925–28 సంవత్సరాల మధ్య ఈ ప్రక్రియ జరిగింది. ఇదంతా గతం.

వర్తమానానికి వచ్చేసరికి ఆ స్థలాల హక్కును 22ఎ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ హరిస్తోంది. 2017లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వక్ఫ్, దేవస్థానం, గ్రామకంఠం, ఈనాంలకు చెందిన భూములను ఎనెక్జ్యూర్‌–1 సెక్షన్‌ 22(ఎ) 1(బి) యాక్ట్‌లోకి తీసుకు వచ్చింది. తద్వారా ఆ భూములు అప్పటికి ఏ స్థితిలో ఉన్నారిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆంక్షలు విధించింది. నాడు బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి పొందిన గ్రౌండ్‌ రెంటల్‌ స్థలాలను కూడా అనాలోచితంగా ఈ యాక్ట్‌ పరిధిలోకి చేర్చేశారు. దీంతో గ్రౌండ్‌ రెంటల్‌ విధానంలో ఇళ్ల స్థలాలు పొందిన యజమానులు వాటిని అమ్ముకోలేక నానా ఇక్కట్లూ పడుతున్నారు.

రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలకు బ్రేక్‌
చంద్రబాబు ప్రభుత్వం కొత్త యాక్ట్‌ పరిధిలోకి గ్రౌండ్‌ రెంటల్‌ భూములను చేర్చడంతో వాటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అంతేకాదు.. ఆ స్థలాల్లో అప్పటికే ఉన్న పాత భవనాలను తొలగించి, కొత్తగా ఇళ్లు నిర్మించుకుందామనుకున్న వారు బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు చేసిన ప్రయత్నాలకు కూడా బ్రేక్‌ పడింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములు, స్థలాలు కావడంతో బ్యాంక్‌లు కూడా వీటికి రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో అమలాపురం పట్టణంలో ఈ తరహాలో ఉన్న 587 స్థలాల్లోని ఇళ్ల యజమానుల్లో ఆందోళన నెలకొంది. పట్టణానికి చెందిన వ్యాపారి కాళ్లకూరి చిన్న సూర్యకుమార్‌ తన స్థలం రిజిస్టేషన్‌ కోసం 2017లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళితే ‘మీ స్థలం 22 (ఎ) నిషేధిత భూముల జాబితాలో ఉంది. రిజిస్ట్రేషన్‌ చేయలేము’ అని చెప్పారు.

దీంతో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. నాటి నుంచీ ఈ బాధితులు కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌ సెల్‌కు ఎన్నోసార్లు వెళ్లి, వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. కోనసీమలో దాదాపు 1,200 మంది బాధితులు ఉన్నారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయవచ్చు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం 1925 నాటి గ్రౌండ్‌ రెంటల్‌ భూములకు సంబంధించి వాయిదాలు చెల్లించిన ఆధారాలు ఉంటే తీసుకురావాలనడంతో నాటి లిఖిత పూర్వక ఆధారాలను కూడా బాధితులు చూపించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.

కొత్త ప్రభుత్వంలో సమస్య పరిష్కారం దిశగా కదలిక
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అమలాపురానికి చెందిన గ్రౌండ్‌ రెంటల్‌ స్థలాల బాధితులు జిల్లాకు చెందిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను కలసి తమ సమస్యపై వినతిపత్రం అందించారు. గ్రౌండ్‌ రెంటల్‌ విధానంలో 1925లో వాయిదాల రూపంలో స్థలాలు సంపాదించుకున్నట్టు లిఖితపూర్వక ఆధారాలు చూపిస్తున్నప్పుడు.. ఆ స్థలాలను నిషేధిత భూముల జాబితా నుంచి ఎందుకు తొలగించకూడదని డిప్యూటీ సీఎం బోస్‌ జిల్లా అధికారులను ప్రశ్నించారు. సాక్షాత్తు రెవెన్యూ మంత్రే ఈ సమస్యపై జోక్యం చేసుకోవడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గ్రౌండ్‌ రెంటల్‌ భూముల సమాచారంపై ఆర్డీవోలతో కలెక్టర్‌ ఇటీవల ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. కోనసీమలో వెలుగు చూసినట్లే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా విచారణ నిర్వహిస్తే ఈ తరహా స్థలాల సమస్యలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement