అధికారం కోసం కిచిడీ మేనిఫెస్టోలతో బాబు వంచన
అందలం ఎక్కగానే మేనిఫెస్టోలను తుంగలో తొక్కి ప్రజలకు వెన్నుపోటు
1994లో ఎన్టీఆర్ ఇచ్చిన హామీలకు చంద్రబాబు తిలోదకాలు
సంపూర్ణ మద్య నిషేధం ఎత్తివేత, రూ.2 కేజీ బియ్యం రూ.5.50కు పెంపు
1999లో కోటి మందికి ఉపాధి, 35 లక్షల ఇళ్ల నిర్మాణం హామీ
అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన బాబు
2004లో బాబు హామీలను నమ్మని ఓటర్లు.. వైఎస్ రాజశేఖర రెడ్డికి పట్టం
వైఎస్సార్ ఉచిత విద్యుత్‌ను ఎగతాళి చేస్తూ.. తీగలపై బట్టలారేసుకోవాలని బాబు ఎద్దేవా
2004లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన వైఎస్సార్..
2009 ఎన్నికల్లో బాబు బూటకపు మాటల్ని విశ్వసించని ప్రజలు.. వైఎస్సార్‌కు నీరాజనం
2014లో వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి హామీలు
600 హామీలతో అందలం ఎక్కి.. వెబ్‌సైట్ నుంచి మేనిఫెస్టో మాయం చేసిన చంద్రబాబు
ఇప్పుడు అమలు సాధ్యంకాని హామీలతో మోసగించేందుకు మళ్లీ సిద్ధం
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు అధికారమే పరమావధి.. అందుకోసం వందల హామీలిచ్చి అందలమెక్కుతాడు.. తనను నమ్మి ఓటేసిన ప్రజలను నిలువునా వంచిస్తాడు. హామీలన్నీ చెత్తబుట్టలో పడేస్తాడు. హామీలిస్తే అమలు చేయాలా? అని సమాధానమిస్తాడు. మోసానికి నిలువెత్తు రూపం చంద్రబాబు.. మాయమాటలతో ఎన్నికల ముందు తిమ్మిని బమ్మి చేసి కిచిడీ మేనిఫెస్టోతో ప్రజల నమ్మకంతో ఆడుకుంటాడు. ‘చంద్రబాబుకు ఒక శాపముంది.. ‘నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుంది’ అని ఆనాడు అసెంబ్లీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలు ఎప్పటికీ అక్షరసత్యం.. అందుకే చంద్రబాబు మేనిఫెస్టో అబద్ధాల పుట్ట.. అబద్ధాలు తప్ప నిజం మాట్లాడడు.
అలాంటి వ్యక్తికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పుడా సమయం ఆసన్నమైంది. చంద్రబాబు పాలనలో మహిళలు, వృద్ధుల కష్టాలు, రైతుల కన్నీళ్లను గుర్తు చేసుకోవాలి. బాబొస్తే జాబన్నాడు. ఇంటికో ఉద్యోగమన్నాడు. కొడుక్కి మంత్రి పదవే కట్టబెట్టి నిరుద్యోగులకు మాత్రం కుచ్చుటోపీ పెట్టాడు. ఇప్పుడు మళ్లీ 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. మన భవిష్యత్‌ను గుర్తు చేసుకుని.. మన కోసం ఒక మంచి బాట వేసిన జననేతను మళ్లీ గెలిపించుకోవాలి. ఒక్క ఓటుతో చంద్రబాబు అబద్ధాల ప్రపంచాన్ని పటాపంచలు చేయాలి.
హామీలతో వంచించే నేతను విశ్వసిస్తే భవిత నాశనమే..
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి అమ్ముడపోయి.. ఇప్పుడు ఆ పారీ్టతోనే చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే నేతకు మేనిఫెస్టో కేవలం ఒక కాగితం మాత్రమే.. జగన్ దృష్టిలో మేనిఫెస్టో అంటే ప్రజలకు ఇచ్చే మాట.. ఐదేళ్ల పాలనను చాటిచెప్పే పవిత్ర వాగ్దానం. ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా చంద్రబాబు తాను గెలిచిన ప్రతీసారి ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు. 2014లో పదవి కోసం చంద్రబాబు 600కు పైగా హామీలు గుప్పించారు. అందులో ఒక్కటీ అమలు కాలేదు. అధికారంలోకి వచ్చాక ఆయన రూటే వేరు. హామీల మాటే మరిచిపోతారు.
జనంలోకెళ్తే ఎక్కడ తన్ని తరిమేస్తారోనని మేనిఫెస్టోను తన వెబ్‌సైట్ నుంచి మాయం చేస్తారు. ఎన్నికలప్పుడు అబద్ధాలకు రెక్కలు తొడుగుతూ అలవికాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేయడం.. అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ.. ఎప్పుడూ మేనిఫెస్టోను అమలుచేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు మరోసారి.. సూపర్ సిక్స్‌తో కలిపి ఇతర హామీలు ఇస్తూ మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు మరోసారి ప్రజలను మోసగించేందుకు సిద్ధమయ్యారు.
రుణమాఫీ పేరుతో టోపీ
2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్‌లో కలిసి చంద్రబాబు ఎన్నికల బరిలో నిలిచారు.
ఆ ఎన్నికల్లో ప్రధాన హామీలు
1. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం
2. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ
3. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి
4. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకంలో రూ.25 వేల డిపాజిట్
5. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం.. పక్కా ఇళ్ల నిర్మాణం
6. ఏడాదికి రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు
7. చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ
8. సింగపూర్‌ను మించి అభివృద్ధి
9. ప్రతి జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీ నిర్మాణం
ఇలా 650కిపైగా హామీలు ఇచ్చారు. మోదీ ప్రభంజనంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ హామీల అమలును తుంగలో తొక్కారు. ఇదేంటని ప్రశి్నస్తే.. కేంద్రం సహకరించలేదంటూ బుకాయించి.. హామీలిస్తే అమలు చేయాలా? అని ఎదురు ప్రశి్నంచారు.
ఎన్టీఆర్ హామీలకు బాబు వెన్నుపోటు
ఉమ్మడి రాష్ట్రంలో 1994 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు పోడిచి.. అధికారంతోపాటు టీడీపీని కబ్జా చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.2 కే కిలో బియ్యం హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారు. మద్యపాన నిషేదాన్ని ఎత్తేయడంతో పాటు రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కు పెంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.
1999లో అరచేతిలో స్వర్గం
1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు తన విశ్వరూపం చూపించాడు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారు.
1. కోటి మందికి ఉపాధి
2. 35 లక్షల ఇళ్లు నిర్మాణం
3. దారిద్య్ర నిర్మూలనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు
4. పట్టణాల్లో మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లు
5. 25 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీటి సౌకర్యం ఇలా పదుల సంఖ్యలో హామీలిచ్చారు.
అటల్ బిహారీ వాజ్‌పేయిపై సానుభూతి కలిసొచ్చి ఆ ఎన్నికల్లో చంద్రబాబు గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. హామీల అమలును మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. కేంద్రం సహకరించలేదని బుకాయించారు.
ఉచిత విద్యుత్‌పై పరిహాసం
అలిపిరి ఘటన నుంచి సానుభూతి పొందడం ద్వారా అధికారంలోకి రావాలన్న ఎత్తుగడతో 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని.. వ్యవసాయ విద్యుత్ బకాయిలను రద్దు చేస్తామని మహానేత వైఎస్సార్ హామీ ఇస్తే అపహాస్యం చేశారు. సేద్యానికి ఉచితంగా విద్యుత్ ఇస్తే.. తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని చంద్రబాబు పరిహాసమాడారు. చంద్రబాబు మోసాన్ని గుర్తించిన జనం అతని పాలనకు చరమగీతం పాడారు.
2009లో తారాస్థాయికి బాబు అబద్ధాలు
2009 ఎన్నికల్లో రాష్ట్ర విభజనకు ఆమోదం తెలుపుతూ టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలతో చంద్రబాబు మహాకూటమిగా బరిలోకి దిగారు.
ఆ ఎన్నికల్లో హామీలు
1. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రూ.2 వేల నగదు బదిలీ
2. 50 లక్షల ఉద్యోగాలు
3. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్
4. 25 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం.. అలా పదుల కొద్దీ హామీలతో ప్రచారంలో ఊదరగొట్టినా అతని నైజం తెలిసి ప్రజలు చిత్తుగా ఓడించారు. ఎన్నికల హామీలన్నీ అమలు చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని పార్టీని జనం గెలిపించారు. వ్యవసాయానికి ఏడు గంటలకు బదులు 9 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తామని, రేషన్ బియ్యం ఒక్కొక్కరికి 4 కేజీలు కాకుండా 6 కేజీలకు పెంచి ఇస్తామని రెండే హామీలు ఇచ్చిన మహానేత వైఎస్‌ను విశ్వసనీయతకు జనం పట్టం కట్టారు.
ప్రత్యేక హోదా అంటూ 2019లో మోసం
2018లో బీజేపీతో విడిపోయి 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. కమిషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకోవడం కోసం ప్రత్యేక హోదాను 2016లో కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు.. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా సాధిస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి 12 గంటల ఉచిత విద్యుత్ పగటిపూటే సరఫరా చేస్తామని.. 2 కోట్ల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని.. అన్నదాత సుఖీభవలో రైతులకు ఏటా రూ.15 వేలు, మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతానని హామీలు ఇచ్చారు. చంద్రబాబు మోసానికి భయపడిన జనం ఆ ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు.
కర్ణాటక, తెలంగాణలో విఫలమైన హామీలతో ‘సూపర్ సిక్స్’
2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్.. నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రజాక్షేత్రంలో ఒంటరిగా సీఎం జగన్‌ను ఎదుర్కోవడానికి భయపడిన చంద్రబాబు.. మళ్లీ బీజేపీ, జనసేనతో జట్టుకట్టారు. కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమల్లో నీరుగారిపోయినా వాటికే సూపర్ సిక్స్ ముసుగేసి ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేయడం గమనార్హం. తెలంగాణలో ఇంతవరకూ ఉచిత బస్సు హామీ తప్ప ఏదీ అమలు కాలేదు. మిగతా అమలవుతాయో లేదో తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment