ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనేవారు.. ఇప్పుడు అదే పెళ్లిని నూరేళ్ల మంట అంటున్నారు నవదంపతులు. భార్యాభర్తల మధ్య సమన్వయం లేకపోవడం, అదనపు కట్నం వేధింపులు, దాడులతో పెళ్లయిన మూణ్నాళ్లకే ఎన్నో కొత్త జంటలు విడిపోతున్నాయి. మహిళలే ఎక్కువగా బాధితులై, పోలీసులను ఆశ్రయిస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ యాక్ట్‌ను తీసుకువచ్చింది. దీనిలో పేర్లు నమోదు చేసుకుంటే పెళ్లి అనే పవిత్ర బంధానికి భద్రత ఏర్పడుతుంది. ప్రస్తుతం దీనిపై అంతగా అవగాహన లేకపోవడంతో సర్కారు ఆశించిన ఫలితం నెరవేరడం లేదన్నది సుస్పష్టం. ప్రతీ వివాహాన్ని విధిగా నమోదు చేసుకోవాలని మహిళా సంక్షేమ శాఖ, మహిళా భద్రత కమిటీల సూచనల మేరకు జిల్లాలో వివాహ నమోదు, ప్రయోజనాలపై కథనం..
వీరఘట్టం (పార్వతీపురం మన్యం జిల్లా): ప్రతీ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ యాక్ట్–2012 చెబుతోంది. ఈ చట్టం అమలుకు గ్రామపంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే దీనిపై విస్తృత అవగాహన లేకపోవడం, పెళ్లి నిర్వాహకులు కూడా అంతగా ఆసక్తి చూపకపోవడంతో పెళ్లి రిజిస్ట్రేషన్లు అంతగా కనిపించడం లేదు.
ఇదే చట్టాన్ని తప్పనిసరిగా అమలుచేస్తే బాల్యవివాహాల నిర్మూలనతో పాటు పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోతున్న చాలా జంటల బంధానికి భద్రత కల్పించవచ్చు. దీనిపై అవగాహన కలిగించేందుకు గ్రామీణ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలి. అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని విద్యావంతులు సూచిస్తున్నారు.
పాలకొండలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
2 శాతం లోపురిజిస్ట్రేషన్లు..
ఈ ఏడాది పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,500 వివాహాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 25 పెళ్లిళ్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అయినట్లు సమాచారం. ఏటా వందలాది వివాహాలు జరుగుతున్నా కేవలం 2 శాతం లోపే అధికారికంగా వివాహ నమోదులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్రామసచివాలయ మహిళా పోలీసులు గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్లపై అవగాహన చేపడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనే మాట సర్వత్రా వ్యక్తమవుతోంది.
వివాహాలకు చట్టబద్ధత ఉండాలి..
వివాహ రిజిస్ట్రేషన్‌కు ప్రోత్సహించాలి.. వివాహాలకు చట్టబద్ధత ఉండాలి. అలా అయితేనే భార్యాభర్తలిద్దరూ భాధ్యతతో మెలుగుతారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వివాహ రిజిస్ట్రేషన్‌కు ప్రోత్సహించాలి.
– ఎం.శ్రావణి, డీఎస్పీ, పాలకొండ
అవగాహన కల్పిస్తున్నాం..
బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు పెళ్లి రిజిస్ట్రేషన్‌పై కూడా అప్పుడప్పుడూ గుర్తు చేస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో తరచూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, డిగ్రీ పూర్తయిన తర్వాతే పిల్లలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు చెబుతున్నాం.
– యు.పూర్ణిమ, సీడీపీఓ, వీరఘట్టం
Comments
Please login to add a commentAdd a comment