
నాకు ఇటీవలే పెళ్లయింది. నా భార్యకి నాకు పెళ్ళికి ముందు 7 నెలల పరిచయం ఉంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. కట్నంగా 5లక్షల రూపాయలు ఫోన్ పే ద్వారా తీసుకున్నాను. పెళ్ళి వరకు అంతా బాగానే ఉంది కానీ, తర్వాత తన ప్రతి చిన్న దానికి గొడవ చేస్తుంది. తనకి అందం మీద ఉన్న శ్రద్ధ నా మీద, నా కుటుంబం మీద లేదు. ఊరికే ఫోటోలు దిగుతూ ఉంటుంది. స్కార్ఫ్ కట్టుకోమంటే కట్టుకోను అంటుంది. గొడవ పడిన ప్రతిసారి తలబాదుకుని నేను ఫిజికల్ అబ్యూస్ చేశాను అని వాళ్ళ కుటుంబ సభ్యులతో చెబుతుంది. అందంగా ఉంది, బాగానే సంపాదిస్తుంది అని పెళ్లి చేసుకున్నాను. అందం డబ్బు ఉంటే సరిపోదు, మాట వినే భార్య కూడా అయి ఉండాలి అని అర్థమైంది. మేమిద్దరం ఉద్యోగస్తులమే. నా జీతం 40,000. ఎం.బీ.ఏ చదివాను. తన జీతం 60,000. తను ఎం.సీ.ఏ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఇంట్లో ఖర్చులకు తన జీతం పైసా కూడా ఇవ్వను అంటుంది. తన పెత్తనమే నడవాలి అంటుంది. ఎప్పుడూ తనని పొగుడుతూ ఉండాలి. తనకి నేను కౌన్సిలింగ్ కూడా ఇవ్వలేకపోతున్నాను. విడాకులు తీసుకోవాలి అంటే కనీసం సంవత్సరం ఆగాలి అని ఎక్కడో చదివాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం సూచించగలరు.
– ఆదినారాయణ, గుంటూరు
ఏమిటి? ఐదు లక్షలు వరకట్నం తీసుకున్న మీరు, మీ భార్య మంచిది కాదు, సద్గుణాలు లేవు, నన్ను హరాస్ చేస్తోంది అంటున్నారా? హాస్యాస్పదంగా లేదూ? పైగా కట్నం డబ్బులు ఫోన్‌పే ద్వారా తీసుకున్నారు కదా... తను కేసు పెడితే జైలుకు వెళ్తారేమో చూసుకోండి!
ఇకపోతే... విడాకుల గురించి మీరు చదివింది నిజమే. హిందూ వివాహ చట్టం ప్రకారం కనీసం ఒక సంవత్సరం గడవకుండా విడాకుల కోరడం కుదరదు. పరస్పర ఒప్పందంతో విడిపోవాలి అనుకున్నా గాని కనీసం ఒక సంవత్సరం విడివిడిగా ఉంటున్నట్లు చూపించాలి.
మీ భార్య ఫోటోలు ఎక్కువ దిగుతుంది, ముఖానికి స్కార్ఫ్ కట్టుకోమంటే వినడం లేదు, తన పెత్తనం నడవాలి అంటుంది, జీతం కూడా నాకు ఇవ్వడం లేదు అని మీరు రాసిన ఈ–మెయిల్ చదివిన తర్వాత, కౌన్సెలింగ్ మీ భార్యకి కాదు మీకు అవసరం అనిపించింది. భార్య మీతో సమానం, మీరు చెప్పినట్లు వినడానికి తను మీ బానిస కాదు.
ఇది మీకు తెలిసినట్లుగా లేదు. ఏ విధంగా చూసుకున్నా మీకన్నా తనకే మెరిట్ ఎక్కువ కదా... మీరెందుకు మీ జీతం ఆవిడకి ఇచ్చి ఇంటిని నడపమని చెప్పరు? ఇంటికి యజమాని పురుషుడు మాత్రమే అని అనుకుంటున్నారా? కనీసం మీ మాట తను వినట్లేదు, జీతం ఇవ్వడం లేదు అనకుండా ‘‘కుటుంబ బాధ్యతలు, ఆర్థిక బాధ్యతలు పంచుకోవడం లేదు’’ అనివుంటే నేను బహుశా ఆవిడ వైపు నుంచి కూడా చాలానే తప్పు ఉంది అని అనుకునేవాడిని
. చాలామంది పురుషులలో – పురుషుల తల్లిదండ్రులలో కూడా ఈ పురుషాధిక్య భావాలు ఇంకా వుండటం బాధాకరం. మీరు పంపిన ఈ–మెయిల్‌ని బట్టి చూస్తే అందులోని విషయాలు గృహహింస చట్టం – వరకట్న నిషేధ చట్టం కింద నేరాలే! తనది కూడా ఎంతో కొంత తప్పు ఉంది అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్‌తో మీకు నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే: ఇద్దరూ కలిసి మంచి ఫ్యామిలీ కౌన్సెలర్ దగ్గర కౌన్సెలింగ్ తీసుకోండి. తప్పు ఎవరిదైనా సరిచేసుకొని హాయిగా వైవాహిక జీవనాన్ని సాగించండి. అప్పటికీ కుదరకపోతే సామరస్యంగా విడిపోండి. ఆౖన్‌లైన్‌లో కట్నం తీసుకున్నారు కాబట్టి కేసులు మీ మీద వేస్తే మీకే నష్టం!
Comments
Please login to add a commentAdd a comment