marriages registration
-
మూడు ముళ్లకు రిజిస్ట్రేషన్! మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ యాక్ట్ ఏం చెప్తోంది
ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనేవారు.. ఇప్పుడు అదే పెళ్లిని నూరేళ్ల మంట అంటున్నారు నవదంపతులు. భార్యాభర్తల మధ్య సమన్వయం లేకపోవడం, అదనపు కట్నం వేధింపులు, దాడులతో పెళ్లయిన మూణ్నాళ్లకే ఎన్నో కొత్త జంటలు విడిపోతున్నాయి. మహిళలే ఎక్కువగా బాధితులై, పోలీసులను ఆశ్రయిస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ యాక్ట్‌ను తీసుకువచ్చింది. దీనిలో పేర్లు నమోదు చేసుకుంటే పెళ్లి అనే పవిత్ర బంధానికి భద్రత ఏర్పడుతుంది. ప్రస్తుతం దీనిపై అంతగా అవగాహన లేకపోవడంతో సర్కారు ఆశించిన ఫలితం నెరవేరడం లేదన్నది సుస్పష్టం. ప్రతీ వివాహాన్ని విధిగా నమోదు చేసుకోవాలని మహిళా సంక్షేమ శాఖ, మహిళా భద్రత కమిటీల సూచనల మేరకు జిల్లాలో వివాహ నమోదు, ప్రయోజనాలపై కథనం.. వీరఘట్టం (పార్వతీపురం మన్యం జిల్లా): ప్రతీ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ యాక్ట్–2012 చెబుతోంది. ఈ చట్టం అమలుకు గ్రామపంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే దీనిపై విస్తృత అవగాహన లేకపోవడం, పెళ్లి నిర్వాహకులు కూడా అంతగా ఆసక్తి చూపకపోవడంతో పెళ్లి రిజిస్ట్రేషన్లు అంతగా కనిపించడం లేదు. ఇదే చట్టాన్ని తప్పనిసరిగా అమలుచేస్తే బాల్యవివాహాల నిర్మూలనతో పాటు పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోతున్న చాలా జంటల బంధానికి భద్రత కల్పించవచ్చు. దీనిపై అవగాహన కలిగించేందుకు గ్రామీణ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలి. అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని విద్యావంతులు సూచిస్తున్నారు. పాలకొండలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 2 శాతం లోపురిజిస్ట్రేషన్లు.. ఈ ఏడాది పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,500 వివాహాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 25 పెళ్లిళ్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అయినట్లు సమాచారం. ఏటా వందలాది వివాహాలు జరుగుతున్నా కేవలం 2 శాతం లోపే అధికారికంగా వివాహ నమోదులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్రామసచివాలయ మహిళా పోలీసులు గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్లపై అవగాహన చేపడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనే మాట సర్వత్రా వ్యక్తమవుతోంది. వివాహాలకు చట్టబద్ధత ఉండాలి.. వివాహ రిజిస్ట్రేషన్‌కు ప్రోత్సహించాలి.. వివాహాలకు చట్టబద్ధత ఉండాలి. అలా అయితేనే భార్యాభర్తలిద్దరూ భాధ్యతతో మెలుగుతారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వివాహ రిజిస్ట్రేషన్‌కు ప్రోత్సహించాలి. – ఎం.శ్రావణి, డీఎస్పీ, పాలకొండ అవగాహన కల్పిస్తున్నాం.. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు పెళ్లి రిజిస్ట్రేషన్‌పై కూడా అప్పుడప్పుడూ గుర్తు చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో తరచూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, డిగ్రీ పూర్తయిన తర్వాతే పిల్లలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు చెబుతున్నాం. – యు.పూర్ణిమ, సీడీపీఓ, వీరఘట్టం -
పుత్తడి బొమ్మలకు పుస్తెల బంధం..
బడికెళ్లాల్సిన బాలికలు పెళ్లి పీటలెక్కుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన అమ్మాయిలు పుస్తెలతాడుతో అత్తారింటి బాట పడుతున్నారు. పట్టుమని 15 ఏళ్లు నిండకుండానే భార్యగా, తల్లిగా బాధ్యతలను మోస్తున్నారు. సంసార మధురిమలు తెలియకుండానే జీవితాన్ని మోస్తున్నారు. పేదరికం ఒక వైపు, ఆడపిల్ల భారం తీరుతుందని కన్నోళ్లే సంసార సాగరంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. సాక్షి, నెల్లూరు: సాంకేతికత రోజు రోజుకూ పెరుగుతున్నా, ఆధునిక సమాజం వైపు అడుగులు వేస్తున్నా జిల్లాలో మాత్రం బాల్య వివాహాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. పెళ్లంటే ఏమిటో కూడా తెలియని వయసులో బాలికలను అత్తారింటికి పంపి, వారి బంగారు భవిష్యత్‌కు తల్లిదండ్రులే సంకెళ్లు వేస్తున్నారు. మరికొందరు ఆడ పిల్లలను బరువుగా భావించి వదిలించుకునే ఆలోచనతో పెళ్లిపీట లెక్కిస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో మానసికంగా, శారీరకంగా బాలికలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా.. బాల్య వివాహాలు ఆగడం లేదు. ప్రేమ వివాహాలు, మేనరికాలు, వలసలు, వరుడికి ఉద్యోగం ఉందని పరిపక్వత లేని బాల్యాన్ని మాంగల్యంలో బందీ చేస్తున్నారు. ఎక్కువగా గిరిజన, మత్స్యకార కుటుంబాల్లో ఆడ పిల్లలను ఇంటి వద్ద ఉంచలేక 18 ఏళ్ల లోపే వివాహాలు జరిపిస్తున్నారు. పిల్లలు చదువుకునే సమయంలో ప్రేమ, పెళ్లి వైపు వెళ్తే కుటుంబం పరువు పోతుందనే భయంతో మరి కొందరు ఇలా చేస్తున్నారు. అడ్డుకట్టకు మార్గాలు గ్రామ స్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో సూపర్వైజర్, సీడీపీఓ, మండల స్థాయిలో తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు బాల్యవివాహాలు అడ్డుకునే అధికారం ఉంది. ఎవరైనా 1098 ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వొచ్చు. ఇప్పటికే సమగ్ర బాలల పరిరక్షణ పథకం కింద ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి సమావేశాల్లో అంగన్వాడీ కార్యకర్తల మండల మహిళా సమాఖ్య, సంరక్షణ అధికారుల సమన్వయంతో 18 ఏళ్లు నిండుకుండానే పెళ్లిళ్లు చేయకూడదనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివాహ రిజిస్ట్రేషన్ తప్పని సరి బాల్యవివాహాల నిరోధానికి అధికారులు ప్రత్యేక ప్రణాళిక చేపట్టారు. జిల్లాలోని అన్ని, రెవెన్యూ డివిజనల్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని సీడీపీఓలు వివాహ రిజిస్ట్రేషన్ చట్టం -2002 అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జీఓ జారీ చేశారు. గ్రామ, వార్డు స్థాయిలో మహిళ సంరక్షణ కార్యదర్శి ద్వారా తప్పక వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్ని ఆదేశాలిచ్చారు. పెళ్లికి ముందే వరుడు, వధువు, ఇద్దరు సంతకం చేసిన దరఖాస్తు ఫారం, నివాస ధ్రువీకరణ పత్రాలు, వయస్సు నిర్ధారణకు ఆధార్ , రెండు పాస్‌ఫొటో సైజు ఫొటోలు, వివాహ పత్రికలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. ఇకపై జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించేందుకు కఠినంగా చర్యలు చేపడుతాం. – రోజ్‌మాండ్, ఐసీడీఎస్ పీడీ -
పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే..
లక్నో: కుల,మత భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా మ్యారెజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కెబినేట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అయితే దేశ వ్యాప్తంగా పెళ్లి రిజిస్ట్రేషన్లు ఖచ్చితంగా చేయాలని 2006లోనే సుప్రీం కోర్టు సూచించింది. దేశవ్యాప్తంగా యూపీతో పాటు రెండు రాష్ట్రాల్లో మినహా అన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధన అమలవుతోంది. 11 ఏళ్ల తర్వాత యూపీ ప్రభుత్వం మ్యారేజ్ రిజిస్ట్రేషన్-2017 పేరిట నిబంధనలు తీసుకొచ్చింది. పెళ్లి అయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేకుంటే జరిమానాలు విధిస్తామని పేర్కొంది. ఏడాదిలోపు రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే రోజుకు రూ.10, ఆపై ఆలస్యం చేస్తే రూ.50ల చొప్పున పెరుగుతూ పోతుందని తెలిపింది. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వైద్య శాఖ మంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్ మీడియాకు తెలిపారు. కొంత మంది ముస్లింలు పెళ్లికొడుకు, పెళ్లికూతురుల ఫోటోలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించిందని, ముస్లింల నిఖామలో ఫోటోలు లేకపోవచ్చు కానీ, ఆధార్ కార్టులాంటి వాటికి ఫోటోలున్నాయి కదా.. మ్యారెజ్ సర్టిఫికెట్ కూడా అలాంటిదేనని మంత్రి సిద్దార్థ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్ పోర్టల్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.