మూడు రోజులు విధుల బహిష్కరణకు మున్సిపల్ ఉద్యోగుల నిర్ణయం
Published Mon, Aug 5 2013 2:48 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి మూడు రోజులపాటు విధులను బహిష్కరించాలని 13 జిల్లాల్లోని మున్సిపల్ ఉద్యోగులు నిర్ణయించారు. ఈ మేరకు మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగులు, కమిషనర్ల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. మూడు రోజుల తర్వాత మరోసారి భేటీ అయి తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తామని మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం చైర్మన్ కృష్ణమోహన్‌రావు, కమిషనర్ల సంఘం అధ్యక్షుడు శివరామకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగులు మూడు రోజులపాటు విధులు బహిష్కరించనున్నట్టు తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ ఈ నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేపడితే అందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జేఏసీ చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు మున్సిపల్ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు అందిస్తారని కృష్ణమోహన్‌రావు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని, ఈ సమావేశాల్లో ఉద్యమ కార్యాచరణను మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు.
Advertisement
Advertisement