సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్‌జీవోలు, ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు జిల్లా వ్యాప్తంగా తొలి రోజు గురువారం మిశ్రమ స్పందన లభించింది.
- సమైక్య సమ్మెలో ఉద్యోగులు
- ఐసీడీఎస్ వీడియోకాన్ఫరెన్స్‌ను అడ్డుకున్న ఎన్‌జీవోలు
- తిరుపతిలో రాస్తారోకో, తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం
- మూతపడిన తిరుపతి, చిత్తూరు, మదనపల్లె ఆర్‌డీవో కార్యాలయాలు
- సమ్మెలో పాల్గొనని విద్యుత్, ఉపాధ్యాయ, మున్సిపల్ ఉద్యోగులు
సాక్షి, చిత్తూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్‌జీవోలు, ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు జిల్లా వ్యాప్తంగా తొలి రోజు గురువారం మిశ్రమ స్పందన లభించింది. రెవెన్యూశాఖ ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలోని 66 తహశీల్దారు కార్యాలయాలకు తాళాలు వేశారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్‌డీవో కార్యాలయాల వద్దకు చేరుకున్న రెవెన్యూ ఉద్యోగులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో ఉద్యోగులు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు.
చిత్తూరులోని కొత్తకలెక్టరేట్‌లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఎన్‌జీవో సంఘం నాయకులు మూయించారు. ఉద్యోగులు కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా నాయకులు అడ్డుకున్నారు. వీడియో కాన్ఫరెన్‌సకు వెళ్లిన ఐసీడీఎస్ ఉద్యోగులను బలవంతంగా బయటకు పంపించారు. మున్సిపల్ ఉద్యోగులు ఆయా మున్సిపాల్టీల్లో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. తిరుపతిలో వందలాదిమంది విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. అయితే విద్యుత్, మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు దూరంగా ఉన్నారు. చాలా ప్రభుత్వ కార్యాలయాలు పని చేశాయి.
చిత్తూరులో ఎన్‌జీవోలు బైక్‌ర్యాలీ నిర్వహిం చారు. నగరంలోని డీఈవో, జిల్లా పరిషత్, అటవీశాఖ, ఆర్‌అండ్‌బీ, పాత కలెక్టరేట్‌లో ని కార్యాలయాలను మూయించారు. రెవె న్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం నాయకులు కలెక్టరేట్‌లోని ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా అడ్డుకున్నారు.
తిరుపతి రెవెన్యూ డివిజన్, తిరుపతి రూరల్, అర్బన్ తహశీల్దారు కార్యాల యాలు, స్టాటిస్టికల్ విభాగం, సివిల్ సప్లయిస్ విభాగాలు మూతపడ్డాయి. ఉద్యోగులు, తహశీల్దార్లు సమ్మెలో ఉన్నారు. ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్‌డీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. శాప్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగానిరసన తెలిపారు. ఎన్‌జీవోల ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు, తెలుగుతల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఎన్‌జీవోల ఆధ్వర్యంలో విద్యార్థులు మెడికల్‌కాలేజీ సర్కిల్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.
మదనపల్లెలో విద్యార్థి జేఎసీ ఆధ్వర్యంలో ఆర్‌టీసీ బస్టాండ్ వద్ద మానవహారం, ర్యాలీలు నిర్వహించారు. ఎన్‌జీవోలు ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. బీటీ కళాశాలలో సమాచారహక్కు చట్టం కమిషనర్ ఇంతియాజ్ అహ్మద్ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు బహిష్కరించారు.
పలమనేరులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మూతపడ్డాయి. ఎంపీడీవో కార్యాలయం వద్ద వార్డుమెంబర్ల శిక్షణ కార్యక్రమాన్ని అడ్డుకుని వారిని బయటకు పంపేశారు. వార్డు మెంబర్లూ సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కార్యాలయాలకు రాకుండా బయట ఉండే నిరసన తెలిపారు. పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏమీ పని చేయలేదు.
శ్రీకాళహస్తిలో పెండ్లి మండపం వద్ద రెవెన్యూశాఖ ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం మినహా మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు పనిచేశాయి. పుత్తూరు పట్టణంలోనూ తహశీల్దారు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఉద్యోగులు నిరసన తెలిపారు.