శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: ఇదే తేదీ.. అదేస్థాయి.. మధ్యలో మూడు నెలల వ్యవధి. ఏసీబీ వలలో రెండు మున్సిపల్ చేపలు ఇలా ఏసీబీ వలలో చిక్కుకోవడం యాధృచ్ఛికమే అయినా విశేషమే. మూడు నెలల క్రితం ఆగస్టు 20న శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు సీనియర్ అసిస్టెంట్ పద్మనాభం కూడా దొరికిపోయారు. కాగా బుధవారం పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ నాగభూషణరావు రూ.12 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరు మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారులు పట్టుబడటం ఒక విశేషం కాగా, కొత్తగా ఏర్పాటైన పాలకొండ నగర పంచాయతీకి తొలి కమిషనర్‌గా వచ్చిన అధికారే పట్టుబడటం మరో విశేషం. జిల్లా చరిత్రలో ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్లు కూడా వీరిద్దరే.. ఆ విధంగా కూడా వీరు రికార్డుల్లోకెక్కారు.