ఏఈకి క్షమాపణ చెబుతున్న రాములు
జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీలోని ఓ వార్డు అభివృద్ధి పనుల్లో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్‌కు నడుమ జరిగిన ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మున్సిపల్ ఇంజనీర్‌పై కౌన్సిలర్ బూతు పురాణానికి దిగిన ఘటన 4 రోజుల క్రితం జరగ్గా, మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూసింది. కౌన్సిలర్ తీరుపై మున్సిపల్ ఉద్యోగులు ఆందోళనకు దిగగా, సదరు కౌన్సిలర్ క్షమాపణ చెప్పడంతో వివాదం సమసిపోయింది. జహీరాబాద్ మున్సిపాలిటీలోని 11వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించారు. పనులకు సంబంధించి కాంట్రాక్టరుతో ఒప్పందం కుదిరినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు.
వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్ కౌన్సిలర్ రాములు ఈ నెల 5న మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ అవినాశ్‌రెడ్డికి ఫోన్ చేశారు. పనులు ఎందుకు ప్రారంభించడం లేదని కౌన్సిలర్ రాములు ప్రశ్నించగా, 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామని కాంట్రాక్టు పొందిన వ్యక్తులు చెప్పారని ఏఈ సమాధానం ఇచ్చారు. దీంతో ఫోన్ సంభాషణ గాడి తప్పి.. కౌన్సిలర్ రాములు బూతు పురాణం ఎత్తుకున్నారు. పత్రికలో రాయలేని భాషలో ఏఈని దుర్భాషలాడారు. ‘చేతనైతే పనులు చేయండి. లేదంటే వెళ్లిపోండి. ఆర్‌అండ్‌బీకి సంబంధించిన బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని’గద్దించారు.
పనితీరు నచ్చక పోతే కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని ఏఈ చెప్పినా, బూతు పురాణం ఆపలేదు. ఈ వ్యవహారంపై ఏఈ మంగళవారం మున్సిపల్ కమిషనర్ జైత్‌రాంకు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్‌పై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీనివ్వగా, పనులు ప్రారంభం కాకపోవడంతో వార్డు ప్రజల నుంచి ఒత్తిడితోనే సహనం కోల్పోయానని కౌన్సిలర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment