
సాక్షి, బంజారాహిల్స్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వియ్యంకుడు అనిల్ కుమార్ కిషన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 15లో నివాసం ఉంటున్న ఎమ్మెల్యే నాగేందర్ వియ్యంకుడు అనిల్ కిషన్ సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మీటింగ్ ముగించుకొని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ మీదుగా కళాంజలి నుంచి తన ఇంటికి కారులో వెళ్తున్నాడు. కళాంజలి షోరూం దాటగానే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై వెనుక నుంచి రాళ్లతో దాడి చేశారు.
వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న ఆయన తన వియ్యంకుడు దానం నాగేందర్‌కు ఫోన్ చేశారు. అప్రమత్తమైన దానం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నైట్ డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ నాయుడు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈఘటనలో కారు అద్దాలు పగిలి ఉన్నాయని, సీసీ ఫుటేజీలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు. ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్నదానిౖపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment