
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరణ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తనను టార్గెట్ చేశారని.. తనను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలిపారు.
శనివారం ఆయన హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారన్నారు. అసభ్యకర పదాలతో దూషించారని పేర్కొన్నారు.
కాగా, శాసనసభలో శుక్రవారం.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంయమనం కోల్పోయారు. బీఆర్‌ఎస్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉండడంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలో వెళ్లడం, సభలో వినిపించడంతో గందరగోళానికి దారితీసింది.
హైదరాబాద్‌లో సుస్థిర అభివృద్ధి అంశంపై స్పీకర్ లఘు చర్చను ప్రారంభించి దానం నాగేందర్‌కు మైక్ ఇచ్చారు. నాగేందర్ మాట్లాడటం ప్రారంభించగానే.. ఆయన వైపు తిరిగి ‘నువ్వు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు’అంటూ బీఆర్‌ఎస్ సభ్యులు గట్టిగా నిలదీశారు. నాగేందర్ ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా, వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పదేపదే ప్రశ్నించటంతో నాగేందర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఆ క్రమంలోనే సహనం కోల్పోయి.. ‘నన్ను ఏయ్ అంటారా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మళ్లీ నాగేందర్‌ను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావంటూ నిలదీయటంతో.‘ఏయ్ మూసుకో రా..నీయమ్మ.. తోలు తీస్తా కొడుకా ఒక్కొక్కరిది.. నీ యమ్మ బయట కూడా తిరగనీయరా. ఏం అనుకుంటున్నార్రా మీరు...తోలు తీస్తా...బయట కూడా తిరగనియ్య.. రారా.’అంటూ మాట్లాడటంతో సభ్యులంతా విస్తుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment