మనిషి గెలిచాడు..
కశ్మీర్‌లోని శ్రీనగర్ ..
హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేత..
అనంతరం చెలరేగిన ఘర్షణలు..
కాల్పులు, రాళ్లదాడులు.. హింస..
కుయ్యికుయ్యి మంటూ పోలీసు వాహనాలు దూసుకెళ్తున్నాయి..
రోడ్డుపై మనిషన్నవాడు లేడు.. షాపులు, కార్యాలయాలు
అన్నీ బంద్.. నగరమంతటా కర్ఫ్యూ..
బయటకి రావాలంటేనే అంతా భయపడుతున్న సమయమది..
ఆ సమయంలో జుబేదా బేగం..
తన భర్తతో కలిసి బయటకు వచ్చింది.. కర్ఫ్యూను ధిక్కరిస్తూ..
ఆమె చూపు పోలీసు వాహనాలపైనే ఉంది..
వాహనాల కంటపడకుండా జాగ్రత్తగా వెళ్తున్నారీ దంపతులు..
రాళ్లు విసురుతూ.. అక్కడక్కడా అల్లరి మూకలు..
ఓర్పుగా, నేర్పుగా ప్రమాదాలను తప్పించుకుంటూ నడిచి వెళ్తున్నారు
జుబేదా భర్త భుజం మీద బియ్యం, పప్పుల మూట..
అలా వాళ్లు మైళ్ల దూరం నడిచారు..
ఎట్టకేలకు తమ గమ్యాన్ని చేరుకున్నారు..
- ఎవరైనా వీరిని చూస్తే.. కర్ఫ్యూ సమయంలో తమ వారి కోసం
సరుకులు తెచ్చుకోవడానికి బయల్దేరిన ముస్లిం జంటలా కనిపిస్తారు..
కానీ ఇలా కర్ఫ్యూ సమయంలో ప్రాణాలకు తెగించి.. వీరు ఆహారాన్ని తీసుకువెళ్తోంది.. ఓ హిందూ కుటుంబం కోసం..
తమ నివాసానికి దూరంగా జవహర్ నగర్‌లో ఉన్న దివాన్‌చంద్ పండిట్, పక్కనే ఉంటున్న ఇతర హిందూ కుటుంబాల కోసం.. కర్ఫ్యూ సమయంలో వాహన సదుపాయం లేకపోవడంతో వీరు ఇలా మైళ్ల దూరం నడిచి వెళ్లారు.
- దివాన్‌చంద్ పండిట్ భార్య, జుబేదా ఒకే స్కూళ్లో పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ఆమె నుంచి జుబేదాకు ఫోన్ వచ్చింది.. రెండ్రోజులుగా పస్తు.. ఇంట్లో తినడానికి ఏమీ లేదు.. బయటకు వెళ్లే పరిస్థితి లేదు అని చెప్పింది.. అంతే.. జుబేదా ఇంకేమీ ఆలోచించలేదు.. ప్రాణాలకు తెగించింది.. భర్తతో బయల్దేరింది.. దివాన్‌చంద్ భార్య ఫోనైతే చేసింది గానీ.. జుబేదా ఇలా వచ్చేస్తుందని అనుకోలేదు..
జుబేదాను చూడగానే.. దివాన్‌చంద్ కుటుంబం కంట కన్నీరు..
అటు వారి కడుపు నిండింది..
ఇటు జుబేదా గుండె ఆనందంతో నిండిపోయింది..
బయట రాళ్ల వర్షం.. కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి..
అక్కడ ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అప్రస్తుతం..
ఇక్కడ మాత్రం మనిషి గెలిచాడు..
మానవత్వమూ గెలిచింది...