జమ్మూ: కశ్మీర్‌లో ఆందోళనల్లో 2008 నుంచి 2017 మధ్య భద్రతా దళాలపైకి రాళ్లు విసిరిన 9,730 మందిపై నమోదైన కేసులను ఉపసంహరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కశ్మీర్ సీఎం మెహబూబా ప్రకటించారు. ఈ అంశంపై ఏర్పాటైన ఓ కమిటీ సిఫారసులను అనుసరించి, షరతులను విధించి 1,745 కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. గత రెండేళ్లలో చిన్నచిన్న ఘటనల్లో రాళ్లు విసిరిన 4 వేల మందికీ క్షమాభిక్ష పెట్టాలని ప్రభుత్వం సిఫారసు చేసినట్లు రాష్ట్ర అసెంబ్లీలో చెప్పారు. గత రెండేళ్లలో రాళ్లు విసిరిన ఘటనలకు సంబంధించి మొత్తం 3,773 కేసులు నమోదవ్వగా 11,290 మంది అరెస్టయ్యారని చెప్పారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ చనిపోయిన 2016తో పోలిస్తే 2017లో రాళ్ల దాడి కేసులు, అరెస్టులు తగ్గాయన్నారు. రాళ్లు విసిరిన వారిలో 56 మంది ప్రభుత్వోద్యోగులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment