Delhi Liquor Scam: బీజేపీలో చేరితే కేసులు ఎత్తేస్తామన్నారు
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి, బీజేపీలో చేరితే తనపై కేసులన్నీ ఎత్తివేయడంతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కట్టబెడతామంటూ ఆఫర్ ఇచ్చారని చెప్పారు. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల నుంచి విముక్తి కల్పిస్తామంటూ బీజేపీ నుంచే ఈ సందేశం వచ్చిందని పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు. అనంతరం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన కేజ్రీవాల్‌తో కలిసి గుజరాత్‌కు వచ్చారు. ‘‘బీజేపీకి నేను ఇచ్చే సమాధానం ఇదే. నేను మహారాణా ప్రతాప్ వారసుడిని. రాజ్‌పుత్‌ను. తల నరుక్కోవడానికైనా సిద్ధమే గానీ, కుట్రదారుల ఎదుట, అవినీతిపరుల ఎదుట తలవంచే ప్రసక్తే లేదు. నాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. మీకు చేతనైంది చేసుకోండి’’ అని ట్విట్టర్లో తేల్చిచెప్పారు. బీజేపీ ఇచ్చిన రెండు ఆఫర్లతో తన వద్దకు వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యానికి గురయ్యానని మీడియాతో చెప్పారు. నాయకులను బీజేపీలో చేర్పించడమే ఆ వ్యక్తి పని అన్నారు.
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనకు రాజకీయ గురువు అని, ఆయన వద్దనే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నానని, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో కావడానికి రాజకీయాల్లోకి రాలేదంటూ అతడికి తేల్చిచెప్పానని సిసోడియా వెల్లడించారు. తాను నిజాయితీ పరుడినని, కేసులతో భయపెట్టలేరని తేల్చిచెప్పారు. దేశంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యనందించాలన్నదే తన కల అని, అందుకోసం కృషి చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అయితే, తనకు ఆఫర్ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నది సిసోడియా బహిర్గతం చేయలేదు. కాగా, బీజేపీ ఆఫర్‌కు సంబంధించి తమ వద్ద ఆడియో టేపులున్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతామని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
సిసోడియా భారతరత్నకు అర్హుడు: కేజ్రీవాల్
విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను మెరుగుపర్చిన మనీశ్ సిసోడియా భారతరత్న పురస్కారానికి అర్హుడని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను వెంటాడుతోందని ఆక్షేపించారు. సన్మానించాల్సింది పోయి వేధింపులకు గురిచేయడం ఏమిటని నిలదీశారు. కేజ్రీవాల్ సోమవారం అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ విద్యా విధానాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రతిక ప్రశంసించిందని గుర్తుచేశారు.
ఐదేళ్లలో అద్భుతాలు చేసిన వ్యక్తిపై సీబీఐ దాడులు చేయడం మీకు సిగ్గనిపించడం లేదా? అని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్లలో ప్రభుత్వాలు చేయని అద్భుతాలను సిసోడియా చేశారని, ఆయనకు భారతరత్న దక్కాలని ఉద్ఘాటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిసోడియాతోపాటు తనను కూడా అరెస్టు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. గుజరాత్లో 27 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు
ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చినట్లుగానే తమ ప్రభుత్వాన్ని సైతం పడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా సీబీఐ, ఈడీతో సోదాలు చేయించారని విమర్శించారు. నిజానికి లిక్కర్ పాలసీకి, సీబీఐ–ఈడీ సోదాలకు సంబంధం లేదన్నారు. ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని ట్విట్టర్లో కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
దమ్ముంటే పేరు బయటపెట్టండి: బీజేపీ
మనీశ్ సిసోడియా ఆరోపణలను బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఖండించారు. బీజేపీ తరఫున ఆఫర్ ఇచ్చిన వ్యక్తుల పేర్లను దమ్ముంటే బయటపెట్టాలని సిసోడియాకు సవాలు విసిరారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ.. సిసోడియా మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. లిక్కర్ పాలసీ వ్యవహారంలో అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆప్ నేతలు డ్రామాలు అడుతున్నారని మండిపడ్డారు. ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దూరంగా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. మీరు నిజంగా నిజాయితీపరులైతే 24 గంటల్లోగా స్పందించండి అని కేజ్రీవాల్‌కు సూచించారు.
కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ ధర్నా
ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ప్రసంగించారు. సీబీఐ నమోదు చేసిన కేసులో మొదటి నిందితుడైన డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును దోచుకొనేందుకు లిక్కర్ మాఫియాకు అనుమతులు ఇచ్చారన్నారు.