Pamba river
-
శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత
సాక్షి, చెన్నై / పంబా: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ ఎన్జీవో బృందంలోని రుతుస్రావ వయసు ఉన్న 11 మంది మహిళలను ఆందోళనకారులు ఆదివారం తరిమికొట్టారు. తమిళనాడుకు చెందిన మణిది అనే సంస్థ తరఫున ఈ మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు తెల్లవారుజామున తమిళనాడు–కేరళ సరిహద్దు ద్వారా పంబాకు వచ్చారు. మార్గమధ్యంలో చాలామంది వీరి వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించగా, పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. అనంతరం ఆలయానికి వెళ్లేదారిలో వీరిని వందలాది మంది భక్తులు, ఆందోళనకారులు నిలువరించారు. ఈ సందర్భంగా స్వామి దర్శనానికి వెళితే ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశముందని పోలీసులు నచ్చజెప్పగా, అయ్యప్పను దర్శించుకున్నాకే వెనక్కి వెళతామని మణిది సభ్యులు స్పష్టం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ఆరు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో చివరకు మణిది సభ్యులను కొండపైకి తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించగా, వందలాది మంది భక్తులు వెంటపడి తరిమికొట్టారు. రాళ్లవర్షం కురిపించారు. అప్రమత్తమైన అధికారులు మహిళా భక్తులను సమీపంలోని భద్రతాసిబ్బంది ఉండే గదిలోకి తీసుకెళ్లారు. పరిస్థితి చేయిదాటడంతో వీరంతా అయ్యప్పను దర్శించుకోకుండానే వెనక్కు వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో ఈ 11 మంది మహిళల్ని గట్టి భద్రత నడుమ సరిహద్దు దాటించారు. ఈ విషయమై మణిది సంస్థ సమన్వయకర్త సెల్వీ మాట్లాడుతూ..‘ఆందోళనల నేపథ్యంలో వెనక్కు వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు. ఈ 11 మంది తొలి బృందం మాత్రమే. ఇంకా చాలామంది శబరిమలకు రాబోతున్నారు’అని చెప్పారు. అయ్యప్ప దర్శనానికి మహిళల్ని పోలీసులు తీసుకెళ్లేందుకు యత్నించడాన్ని బీజేపీ నేత కె.సురేంద్రన్ తప్పుపట్టారు. వీరి వెనుక ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ, హిందుత్వ సంస్థల కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. -
రికార్డు స్థాయిలో అయ్యప్ప ఆదాయం
సాక్షి, శబరిమల : ఈ ఏడాది శబరిమల అయ్యప్ప ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆలయం తెరిచిన 25 రోజుల్లోనే అప్పయ్య ఆలయానికి రూ. 100 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. ఈ ఏడాది అదనంగా.. రూ. 15 కోట్లు వచ్చినట్లు టీడీబీ అధికారులు ప్రకటించారు. ఇది ఆల్ టైమ్ రికార్డుగా కూడా వారు చెబుతున్నారు. మండల పూజలు పూర్తయ్యే నాటికి ఆదాయం మరింత పెరుగుతుందని వారు అంటున్నారు.గత ఏడాది ఇదే సమయానికి ఆలయానికి 85.96 కోట్ల రూపాయలు ఆదాయంరాగా..ఈ ఏడాది అదనంగా మరో 15 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీడీపీ పేర్కొంది. మొత్తం రెవెన్యూ వివరాలు శబరిమల అప్పయ్య మొత్తం రెవన్యూ : 101, 08,80,925 అరవణ, అప్పం ప్రసాదం అమ్మకల ద్వారా : 52,63,02,745 హుండీ ఆదాయం : 35,89,26,885 భారీగా భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. మంగళవారం సాయంత్రం కూడా దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పంబ, శరంగుత్తి, సన్నిధానం దగ్గర భారీ రద్దీ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు రద్దీలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని.. వారిని పోలీసులు ప్రత్యేక దారిలో పంపుతున్నారని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. నెయ్యాభిషేకం కోసం అయ్యప్ప భక్తులు ఇరుముడి నెయ్యి కోసం మాళికాపురం ఆలయం దగ్గరి ప్రాంతాన్ని కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు. భక్తులు ఇరుముడి, నెయ్యిని ఇక్కడే విప్పుకోవచ్చని తెలిపారు. అలాగే అయ్యప్ప ఆలయానికి ఉత్తరాన భండారం పేరుతో మరో కాంప్లెక్స్ ఉందని.. అక్కడ కూడా నెయ్యాభిషేకం చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
సన్నిధానం చుట్టూ భారీ భద్రత
సాక్షి, తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప ఆలయంపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచరంతో ఈ ఏడు భారీ భద్రతను పెంచారు. అలాగే ఈ సంవత్సరం ఆలయానికి భక్తులు ఎన్నడూ లేనంతగా వస్తారనే అంచనాలతో భధ్రతను కేరళ ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. శబరిమల ఆలయం చుట్టూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కేరళ పోలీస్ బలగాలు ఆలయ భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అలాగే.. పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఇప్పటికే నేవీ తమ ఆధీనంలోకి తీసుకుంది. డ్రోన్లతో పహారా! శబరిమల అయ్యప్ప సన్నిధానంకు ఈ ఏడు కేరళ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ప్రధానంగా సన్నిధానంను ప్రతిక్షణం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డ్రోన్లను రంగంలోకి దింపింది. సన్నిధానంతో పాటు పంబా, అడవిదారి, ఎరుమేలి, ఇతర ముఖ్యప్రాంతాల్లో సైతం భద్రను పెట్టినట్టు సన్నిధానం ప్రత్యేక పోలీసు అధికారి కేకే జయరామన్ తెలిపారు. పదునెట్టాంబడి చుట్టూ పారా మిలటరీ బలగాలు పహారా కాస్తుంటాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచీ! అయ్యప్ప భద్రత కోసం కేరళ పోలీసులతో పాటు, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకనుంచి అదనపు బలగాలను తెప్పించుకున్నట్లు కేకే జయరామన్ చెప్పారు. అయ్యప్పలు సహరించాలి అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రధానంగా నీలిమల, మరక్కూట్టం యూ టర్న్, లోయర్ తిరుమట్టం వద్ద సెక్యూరిటీ చెకింగ్ ఉంటుందని చెప్పారు. అనుమతి ఉన్న వారికే! సన్నిధానానికి వెళ్లే ప్రత్యేకదారిలో.. కేవలం అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని చెప్పారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అనుమతి పత్రం, లేదంటే కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటీ కార్డు ఉండాలని చెప్పారు. -
శబరిమల నీలక్కల్ వద్ద తెలంగాణ భవన్ కు స్థలం
► మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి తెలిపిన కేరళ ప్రభుత్వం ► సన్నిధానం లేదా పంబా వద్ద ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: శబరిమలలోని నీలక్కల్ వద్ద తెలంగాణ భవన్ నిర్మించేందుకు స్థలం కేటాయించనున్నట్టు కేరళ ప్రభుత్వం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి తెలి పింది. రెండు మూడు నెలల్లో స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేస్తామంది. అయితే అక్కడి కంటే సన్నిధానం (శబరిమల), పంబా నది ప్రాంతాల్లో ఏదో ఒక చోట కేటాయించాలని ఇంద్రకరణ్‌రెడ్డి కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బదులుగా తెలంగాణలోని భద్రాచలం వద్దగానీ, కోరిన ఇతర ప్రాంతాల్లో గానీ స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. కేరళలోని శబరిమల వద్ద ఉన్న పంబ నది ప్రాంతంలో సోమవారం ‘పంపా సంగమం’కార్యక్రమం జరిగింది. అందులో ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, తెలంగాణ మలయాళీ అసోసియేషన్ అధ్యక్షుడు బింజిమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శబరిమలలో తెలంగాణ భవన్ కు స్థలం కేటాయింపు అంశంపై చర్చించారు. ఇక శబరిమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నందున వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరముందని ఇంద్రకరణ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తాగునీరు, పార్కింగ్, వసతి, పారిశుద్ధ్యం, డిజాస్టర్ మేనేజ్మెంట్లను మెరుగుపరచాల్సి ఉందని.. శబరిమల మాస్టర్‌ప్లాన్ పూర్తయితే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్థానికంగా ఆలయాల అభివృద్ధి ప్రణాళికలు, పుష్కరాలు లాంటి భారీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను వివరించారు. కేరళ రోడ్ సేఫ్టీ అథారిటీ, ఆ రాష్ట్ర రవాణాశాఖలు సంయుక్తంగా తెలుగులో రూపొందించిన సీడీని ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. అయ్యప్ప భక్తులకు ఉపయోగపడేలా శబరిమల రూట్‌మ్యాప్, వివరాలు, ప్రమాదాలు జరిగితే స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించేందుకు ఆ సీడీని రూపొందించారు.