శబరిమల నీలక్కల్ వద్ద తెలంగాణ భవన్ కు స్థలం
► మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి తెలిపిన కేరళ ప్రభుత్వం
► సన్నిధానం లేదా పంబా వద్ద ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: శబరిమలలోని నీలక్కల్ వద్ద తెలంగాణ భవన్ నిర్మించేందుకు స్థలం కేటాయించనున్నట్టు కేరళ ప్రభుత్వం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి తెలి పింది. రెండు మూడు నెలల్లో స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేస్తామంది. అయితే అక్కడి కంటే సన్నిధానం (శబరిమల), పంబా నది ప్రాంతాల్లో ఏదో ఒక చోట కేటాయించాలని ఇంద్రకరణ్‌రెడ్డి కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బదులుగా తెలంగాణలోని భద్రాచలం వద్దగానీ, కోరిన ఇతర ప్రాంతాల్లో గానీ స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. కేరళలోని శబరిమల వద్ద ఉన్న పంబ నది ప్రాంతంలో సోమవారం ‘పంపా సంగమం’కార్యక్రమం జరిగింది. అందులో ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, తెలంగాణ మలయాళీ అసోసియేషన్ అధ్యక్షుడు బింజిమన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శబరిమలలో తెలంగాణ భవన్ కు స్థలం కేటాయింపు అంశంపై చర్చించారు. ఇక శబరిమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నందున వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరముందని ఇంద్రకరణ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తాగునీరు, పార్కింగ్, వసతి, పారిశుద్ధ్యం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లను మెరుగుపరచాల్సి ఉందని.. శబరిమల మాస్టర్‌ప్లాన్ పూర్తయితే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్థానికంగా ఆలయాల అభివృద్ధి ప్రణాళికలు, పుష్కరాలు లాంటి భారీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను వివరించారు.
కేరళ రోడ్ సేఫ్టీ అథారిటీ, ఆ రాష్ట్ర రవాణాశాఖలు సంయుక్తంగా తెలుగులో రూపొందించిన సీడీని ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. అయ్యప్ప భక్తులకు ఉపయోగపడేలా శబరిమల రూట్‌మ్యాప్, వివరాలు, ప్రమాదాలు జరిగితే స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించేందుకు ఆ సీడీని రూపొందించారు.