శబరిలో వసతులు మెరుగుపడాలి
దక్షిణ రాష్ట్రాల మంత్రుల భేటీలో ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నందున మౌలిక వసతులను కూడా తదనుగుణంగా పెంచాల్సిన అవసరం ఉందని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యం గా పంబా నది వద్ద తాగునీరు, విడిది, పారిశుద్ధ్యం, పార్కింగ్, భోజనం... తదితరాలను మెరుగుపరచాలని పేర్కొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ అధ్యక్షతన జరిగిన దక్షిణాది రాష్ట్రాల దేవాదాయ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. భక్తుల కోసం కంట్రోల్ రూమ్, వైద్యం కేంద్రం ఏర్పాటుతోపాటు విపత్తు నివారణకు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలన్నారు. శబరిమలలో తెలంగా ణ భవన్ నిర్మాణానికి గతంలో కేటాయించిన చోట కాకుండా పంబా నదీ తీరంలో భూమి ని కేటాయించాలని కోరారు. దానికి బదులు గా భద్రాచలం లేదా కేరళ ప్రభుత్వం కోరిన ప్రాంతంలో భూమిని కేటాయిస్తామన్నారు.
రోడ్డు భద్రతకు జాతీయ విధానం..
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా రోడ్డు భద్రతా చర్యలు, వాహన కాలుష్యం నివారణకు చర్యలు, పర్యాటకుల పన్నుల విధానం తదితరాల్లో జాతీయ విధా నం కావాలని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తిరువనంతపురం లో రాష్ట్రాల రవాణా మంత్రుల కమిటీ సమావేశంలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో రవాణాశాఖ చేపడుతున్న విధానాలను అయన వివరించారు.